ఉద్యోగులు ఓడించగలరా? జగన్ ధైర్యం ఏంటి?

‘ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనగలిగింది లేదు’ ఇది ఉద్యోగవర్గాలనుంచి తరచుగా వినిపిస్తున్న మాట. అవునా.. ఉద్యోగులు అంత శక్తిమంతులా! ప్రభుత్వాల్ని కూల్చేయగలరా? అందరూ ఆ రకంగా మాట్లాడుతున్నారు ఎందుకు? అందరిలోనూ అలాంటి అభిప్రాయం…

‘ఉద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ మనగలిగింది లేదు’ ఇది ఉద్యోగవర్గాలనుంచి తరచుగా వినిపిస్తున్న మాట. అవునా.. ఉద్యోగులు అంత శక్తిమంతులా! ప్రభుత్వాల్ని కూల్చేయగలరా? అందరూ ఆ రకంగా మాట్లాడుతున్నారు ఎందుకు? అందరిలోనూ అలాంటి అభిప్రాయం ఎందుకు స్థిరపడింది? ఇలాంటి సందేహాలు సామాన్యులకు కలగడం సహజం. ఇప్పుడు ఉద్యమాలు చేస్తున్న నాయకులందరూ కూడా మమ్మల్ని తక్కువ అంచనా వేస్తున్నారు.. ఈ ప్రభుత్వానికి మా తడాఖా ఏంటో చూపిస్తాం అని హెచ్చరిస్తున్నారు.

చాలా మంది నాయకులు ఉద్యోగుల ఈ తరహా బెదిరింపులకు నిజంగానే జడుసుకుంటారు. ఉద్యోగులు ఏం చేసేస్తారో అనే వెరపు ఉంటుంది. సాధారణంగా పోలింగ్ సమయంలో.. ఉద్యోగులు తలచుకుంటే.. ఏదైనా ఒక పార్టీకి అనుకూలంగా/ వ్యతిరేకంగా ఓట్లు వేయించడం చాలా సులువైన సంగతి అని అంతా అనుకుంటూ ఉంటారు. 

పోలింగ్ సమయంలో కొందరు ఓటర్ల ఓట్లు వీరే వేస్తుంటారనేది.. జనరల్ గా అందరూ అనుకునే సంగతి. వీరు అలా దొంగ ఓట్లు వేసి పార్టీలకు సహకరిస్తారో లేదో వేరే సంగతి.. కానీ.. ఉద్యోగులు ఏం చేయగలరనే విషయంలో ఇంకో రకమైన అభిప్రాయాలు కూడా ఉంటాయి.

సహజంగా ఉద్యోగులకు సామాన్య ప్రజలతో ‘యాక్సెస్’ ఉంటుంది. వారిని ‘ఒపీనియన్ మేకర్స్’ అని అందరూ అంటూ ఉంటారు. అంటే.. ఉద్యోగులు నిత్యం ప్రజలతో కలిసి మెలిసి తిరుగుతూ పనిచేస్తూ ఉంటారు గానుక.. ప్రజాభిప్రాయాన్ని వారు నిర్మించగలరు అనేది ఒక అభిప్రాయం. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక ఆలోచనను ఉద్యోగులు వ్యాపింపజేయదలచుకుంటే.. ప్రజలకు అలాంటి అభిప్రాయం కలిగించగలరు అనుకోవాలి. 

ఇదంతా సాధారణంగా ఉండే సిద్ధాంతాలు. ఆ నమ్మకంతోనే.. మా తడాకా ఏంటో ప్రభుత్వానికి చూపిస్తాం అని వారు బీరాలు పలుకుతున్నారు. అయితే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో.. ఆ పాత సిద్ధాంతాలు చెల్లుతాయా? అనేది ప్రశ్నార్థకం. ఎందుకంటే.. ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం ఏంటో.. ప్రజారంజక పాలన ఏంటో.. నిర్ణయాలు ఏంటో.. ప్రజలకు నేరుగా తెలిసి వస్తున్నాయి. 

ప్రభుత్వం గురించి ఒకరు చెప్పే మాట విని అభిప్రాయాలు ఏర్పరచుకోవలసిన స్థితిలో సామాన్యులు లేరు. ఇలాంటి నేపథ్యంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనాభిప్రాయాన్ని నిర్మించడం ఉద్యోగులకు సాధ్యమా? అనేది ప్రశ్న. కేవలం తమ జీతాల కోసం ప్రభుత్వాన్ని నిందిస్తున్న ఉద్యోగుల్ని ప్రజలు సానుభూతితో చూస్తారా? వారు చెప్పుడు మాటలు చెబితే ఆలకిస్తారా? అనేది ఇంకో ప్రశ్న!

ఇలాంటి నేపథ్యంలో ఉద్యోగులు తలచుకున్నంత మాత్రాన ప్రభుత్వాన్ని నిలువునా కూల్చేయడం జరగని పని. ప్రజలే తిరస్కరించదలచుకుంటే, కోపగిస్తే వైసీపీ ఓడిపోవచ్చు. కానీ.. అది ఉద్యోగుల ఆగ్రహం వల్ల జరుగుతుందని అనుకోవడం భ్రమ. ఒక కులం, ఒక మతం, ఒక వర్గం ఆగ్రహించినంత మాత్రాన ప్రభుత్వాలు కూలిపోయేట్లయితే.. పార్టీలు నాశనం అయిపోయేట్లయితే.. మనదేశంలో ప్రజాస్వామ్యానికే విలువ లేదు. ఆ విషయం ఉద్యోగులు అర్థం చేసుకోవాలి.