పచ్చమీడియా పండగ చేసుకుంటోంది ఎందుకు?

పచ్చమీడియా పండగ చేసుకోవడానికి వారికి తాజాగా ఒక పాయింట్ కనిపించింది. నిజానికి అందులో పండగ చేసుకునేంత గొప్ప పాయింటేమీ లేదు. కాపోతే.. తాము పండగ చేసుకున్నట్టుగా కనిపిస్తే.. ప్రజలు మాయలో పడతారని.. ప్రజల ఆలోచనల్ని…

పచ్చమీడియా పండగ చేసుకోవడానికి వారికి తాజాగా ఒక పాయింట్ కనిపించింది. నిజానికి అందులో పండగ చేసుకునేంత గొప్ప పాయింటేమీ లేదు. కాపోతే.. తాము పండగ చేసుకున్నట్టుగా కనిపిస్తే.. ప్రజలు మాయలో పడతారని.. ప్రజల ఆలోచనల్ని తప్పుదారి పట్టించవచ్చునని బహుశా వారి ఊహ కావొచ్చు. విషయం ఏమీ లేకపోయినా.. ఏదో అయిపోయినట్టుగా దానికి రంగు పులిమి వారు వార్తల ప్రాధాన్యాలను తమ బుద్ధులకు అనుకూలంగా మారుస్తున్నారు. 

ఇంతకూ విషయం ఏంటంటే..

పార్లమెంటులో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు.. ఏపీ రాజధాని గురించి స్పష్టత కావాలని అడిగారు. నిజానికి ఇప్పటికీ కేంద్రంనుంచి కొన్ని లేఖలు.. ఏపీ రాజధాని అంటూ హైదరాబాదు అడ్రసుకు వెళుతున్నాయని, అలా ఎందుకు జరుగుతోందనేది ఆయన ప్రశ్న. దీనికి సమాధానం ఇస్తూ.. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానందరాయ్.. ఏపీకి ఇప్పుడు అమరావతే రాజధాని అని ప్రకటించారు. మూడురాజధానుల కోసం తెచ్చిన చట్టాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకున్నట్లుగా తెలిసిందని కూడా అన్నారు. అదే సమయంలో.. రాజధాని ఎక్కడ ఉండాలనే సంగతి పూర్తిగా రాష్ట్రప్రభుత్వం ఇష్టం అని కూడా వెల్లడించారు. 

నిజానికి ఇందులో అణువంతైనా కొత్త సంగతి లేదు! ఈ విషయాన్ని కేంద్రప్రభుత్వం గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పింది. అయితే.. పచ్చ మీడియా ఇప్పుడు ఈ విషయాన్ని చాలా హైలైట్ చేస్తోంది. ‘ఇప్పుడు రాజధాని అమరావతే’ అంటూ కేంద్రం ధ్రువీకరించినట్టుగా.. వార్తలు వండి వారుస్తోంది. మూడురాజధానుల విషయంలో జగన్ వెనక్కి తగ్గిన తర్వాత.. ఇప్పుడు సీఎం, గవర్నర్, సెక్రటేరియేట్, అసెంబ్లీ.. అన్ని వ్యవహారాలూ అమరావతిలోనే ఉండగా.. రాజధాని అమరావతి కాకుండా ఎందుకు పోతుంది? అందులో గొప్ప వార్త ఏమున్నదో అర్థం కాని సంగతి!

రాజధానితో తమకు సంబంధమే లేదని అంటున్న కేంద్రమంత్రి మాటల్ని పక్కన పెట్టి.. ప్రస్తుతానికి అమరావతే రాజధాని అని ఆయన అంటే.. అదేదో శిలాశాసనంలాగా పచ్చమీడియా ప్రచారం చేయడం చిత్రం. మూడు రాజధానులకు కట్టుబడే ఉన్నాం అని జగన్ ప్రభుత్వం.. చట్టం రద్దు తర్వాత కూడా పలుమార్లు ప్రకటించింది. అంతకంటె పటిష్టమైన చట్టాన్ని తెచ్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉన్నదని కూడా వారు వెల్లడించారు. 

ఆ కొత్త చట్టమేదో వచ్చేవరకు.. సహజంగా అమరావతే రాజధాని అవుతుంది. ఈ విషయంలో ఎలాంటి భిన్నాభిప్రాయాలు ఉండవు, తలెత్తవు. కానీ పచ్చ మీడియా మాత్రం.. కేంద్ర సహాయ మంత్రి ప్రకటనతో రాజధాని ఇక ఎక్కడికీ తరలిపోయే అవకాశమే లేదు అన్నంత హైప్ తో వార్తలు అందిస్తోంది.

నిజానికి ఇదే రోజున.. మూడు రాజధానుల గురించి హైకోర్టులో జరిగిన విచారణ సందర్భంగా కూడా.. కేంద్రం తరఫున ఏఎస్‌జీ.. రాజధానితో తమకు సంబంధం లేదనే విషయాన్నే వెల్లడించారు. అది పూర్తిగా రాష్ట్రప్రభుత్వం పరిధిలోని అంశం అనే సంగతి చెప్పారు. కేంద్రమంత్రి చెప్పినట్టుగా రాజధాని ఇప్పుడు అమరావతే. కానీ, అంతమాత్రాన మూడు రాజధానుల అంశం ముగిసిపోయినట్టు కాదు! అలాంటి రంగుపులిమే వార్తలను అందిస్తే గనుక.. అది ప్రజలను మోసం చేయడమే అవుతుందని పచ్చమీడియా తెలుసుకోవాలి.