‘అతి’ మాని మితంగా అడిగితే మేలు!

‘ఆ మూడు డిమాండ్లకు కాలం చెల్లింది’ అని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా తేల్చి చెప్పేశారు. పాత జీతాలు ఇవ్వాలి, పీఆర్సీ జీవోలు రద్దు చేయాలి, పీఆర్సీ నివేదిక బయటపెట్టాలి.. అని ఉద్యోగ…

‘ఆ మూడు డిమాండ్లకు కాలం చెల్లింది’ అని రాష్ట్రప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విస్పష్టంగా తేల్చి చెప్పేశారు. పాత జీతాలు ఇవ్వాలి, పీఆర్సీ జీవోలు రద్దు చేయాలి, పీఆర్సీ నివేదిక బయటపెట్టాలి.. అని ఉద్యోగ సంఘాలు అడుగుతున్నాయి. కొత్త పీఆర్సీ జీవోల ప్రకారం జీతాలు పడడం కూడా మొదలయ్యాక ఇక తొలి రెండు డిమాండ్లకు విలువలేదని, ఈ పీఆర్సీ అమల్లోకి వచ్చేసిన తర్వాత.. ఇక నివేదిక అవసరమే లేదని సజ్జల స్పష్టత ఇచ్చారు. సజ్జల చెప్పడం అంటే.. సాక్షాత్తూ ముఖ్యమంత్రి ప్రకటన లాంటిదే అనే అభిప్రాయం పలువురిలో ఉంది. ఇలాంటి సందర్భంలో.. ఇంకా పీఆర్సీ గురించి ఉద్యోగులు పట్టుబట్టడం విజ్ఞతతో కూడినదేనా? అనే అభిప్రాయం వినవస్తోంది.

ఒకసారి కొత్త వేతనాలు ఖాతాల్లో పడితే.. ఇక చేయగలిగేదేమీ లేదని ఉద్యోగులకు స్పష్టత ఉంది. సాంకేతికంగా ఇక వెనక్కుమళ్లడం సాధ్యం కాదని కూడా వారికి తెలుసు. అందుకే కొత్తజీతాలు తమ ఖాతాల్లు పడకుండా ఉండడానికి వారికి చేతనైనంత వరకు, చేతనైనన్ని పద్ధతుల్లో అడ్డుపడ్డారు. ట్రెజరీ కార్యాలయాల్లో సిబ్బంది సహకరించకుండా చూడాలనుకున్నారు. బిల్లులు పెట్టవలసిన డీడీవోలు ఆ పనిచేయకుండా చూశారు. పాతజీతాలే కావాలనే డిమాండ్ వినిపించారు. 

కోర్టుకు వెళ్లారు. పీఆర్సీ జీవోలు రద్దు చేయాలని కూడా అడిగారు. వారు ఎన్ని చేసినప్పటికీ.. వారితో సమానంగా ప్రభుత్వానికి ఉండగల ప్రత్యామ్నాయాలు ప్రభుత్వానికి ఉంటాయి గనుక.. జీతాలు వారి ఖాతాల్లో పడిపోవడం జరుగుతోంది. ఇక జీతాల విషయం వెనక్కి వెళ్లడం టెక్నికల్ గా సాధ్యం కాదనే సంగతి అందరికంటె ఎక్కువగా ఉద్యోగులకే క్లారిటీ ఉంటుంది. అయితే వారు ఎంత ఉద్యమించినా.. ఎంతగా నిరసన గళం వినిపించినా.. అదంతా తమ అసంతృప్తిని తెలియజెప్పడానికి ఉపయోగపడుతుంది తప్ప.. ప్రభుత్వ నిర్ణయాన్ని మార్చడానికి ఉపయోగపడదనే సంగతి కూడా వారికి అర్థమవుతుంది. 

ఈ సమయంలో.. ఉద్యోగులు ఇక తమ సమ్మె ఆలోచన మానుకుని.. ప్రాక్టికల్ గా ఆలోచించి ఒకే ఒక్క డిమాండ్‌కు పరిమితం అయితే.. వారికి ఎంతో కొంత మేలు జరిగే అవకాశం ఉన్నదని పలువురు విశ్లేషిస్తున్నారు. జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగులకు 27 శాతం ఐఆర్ రూపంలో ఇవ్వడం ప్రారంభించింది. ఇటీవల పీఆర్సీ వ్యవహారం కొలిక్కి వచ్చిన సమయంలో.. జగన్ 23.29గా ఫిట్మెంట్ నిర్ణయించారు. ఇలా ఐఆర్ కంటె తగ్గడంపై కొంత రాద్ధాంతం జరిగింది. పీఆర్సీ ఇంప్లిమెంట్ అయ్యాక సహజంగానే ఇంటి అద్దె అలవెన్సులు తగ్గుతాయి. ప్రభుత్వం అలా తగ్గించడాన్ని ఉద్యోగులు సహించలేకపోతున్నారు. గగ్గోలు పెడుతున్నారు.

అంతకంటె పెద్ద విషయం ఏంటంటే.. ఇప్పుడు ప్రకటించిన ఫిట్మెంట్ కంటె ఇన్నాళ్లూ ఐఆర్ రూపంలో ఎక్కువగా చెల్లించాం గనుక.. ఆ సొమ్ము రికవరీ చేస్తాం అని ప్రభుత్వం అంటోంది. ఉద్యోగుల రాద్ధాంతం మరింత పెరగడానికి ఇది ఒక కారణం. ఇప్పుడు కొత్త పీఆర్సీ ప్రకారం కొత్త వేతనాలు వారి అకౌంట్లలో కూడా పడిన తర్వాత.. ఉద్యోగులు అన్ని రకాల ఇతర డిమాండ్లు మానుకుని.. గతంలో అదనంగా చెల్లించిన మొత్తాలను రికవరీ చేయవద్దు మహాప్రభో అనే డిమాండ్ కు మాత్రం పరిమితం అయితే వారికి లాభం జరుగుతుంది.

ప్రస్తుతానికి రికవరీలు చేయవద్దన్నంత వరకే కోర్టు కూడా ప్రభుత్వానికి సూచించింది. ఫిట్మెంటు- ఐఆర్ కంటె తక్కువగా ఎలా ఇస్తారు? ఇంత ఇవ్వాలి కదా.. అని కోర్టు చెప్పగల, ఎంత జీతాలు పెంచాలో నిర్దేశించగల అవకాశాలు తక్కువ. ఆ రకంగా చూసినప్పుడు ఉద్యోగులకు మొదటికే మోసం వస్తుంది. 

అలాంటి ప్రమాదం తలెత్తకుండా.. కేవలం రికవరీల వరకు పరిమితమైతే బాగుంటుంది. ఇచ్చిందేదో ఇచ్చారు.. ఇప్పుడు వెనక్కి లాక్కోకండి అని అడిగితే.. ప్రభుత్వం కూడా సానుభూతితో ఓకే చెప్పే అవకాశం ఉంది. అలా కాకుండా.. ప్రభుత్వాన్ని నిందిస్తూ.. సమ్మె ద్వారా ప్రజల్ని ఇబ్బంది పెడతాం అని బీరాలు పలుకుతూ గోల చేసినంత వరకు వారు ఏమీ సాధించలేరు.