మ‌హిళా క‌మిష‌న్‌కు క‌నిపిస్తోందా, వినిపిస్తోందా!

వ్య‌క్తులు, పార్టీల‌ను బ‌ట్టి త‌ప్పొప్పులు ఉండ‌వు. ఎవ‌రు చేసినా త‌ప్పు త‌ప్పే. అయితే రాజ‌కీయ ప‌లుకుబ‌డి ఉంటే నేర‌స్తులు నిర్భ‌యంగా తిర‌గ‌గ‌లిగే వ్య‌వ‌స్థ‌లో మ‌నం బ‌తుకుతున్నాం. ఇది ముమ్మాటికీ సిగ్గుచేటు. అమ్మాయిల‌కు అన్యాయం జ‌రిగితే,…

వ్య‌క్తులు, పార్టీల‌ను బ‌ట్టి త‌ప్పొప్పులు ఉండ‌వు. ఎవ‌రు చేసినా త‌ప్పు త‌ప్పే. అయితే రాజ‌కీయ ప‌లుకుబ‌డి ఉంటే నేర‌స్తులు నిర్భ‌యంగా తిర‌గ‌గ‌లిగే వ్య‌వ‌స్థ‌లో మ‌నం బ‌తుకుతున్నాం. ఇది ముమ్మాటికీ సిగ్గుచేటు. అమ్మాయిల‌కు అన్యాయం జ‌రిగితే, విచారించి న్యాయం చేయ‌డానికి ప్ర‌భుత్వం మ‌హిళా క‌మిష‌న్‌ను ఏర్పాటు చేసింది. అయితే త‌మ ప్ర‌త్య‌ర్థి పార్టీల‌కు చెందిన వారు అన్యాయానికి ఒడిగ‌డితే ఏపీ మ‌హిళా క‌మిష‌న్ వేగంగా స్పందిస్తున్న‌దే త‌ప్ప‌, సొంత పార్టీ నేత‌ల విష‌యంలో మౌనం పాటిస్తుంద‌నే విమ‌ర్శ ఉంది.

కానీ ఆ విమ‌ర్శ‌లో వాస్త‌వం లేద‌ని, రాజ‌కీయాల‌కు అతీతంగా త‌మ సంస్థ న్యాయ‌బ‌ద్ధంగా వ్య‌వ‌హ‌రిస్తుంద‌ని నిరూపించుకు నేందుకు మ‌హిళా క‌మిష‌న్‌కు ఓ అవ‌కాశం ద‌క్కింది. అది కూడా సీఎం సొంత జిల్లాలో న్యాయం కోసం ఎదురు చూస్తున్న‌ యువ‌తిని ఆదుకోవ‌డం ద్వారా. అమ్మాయి కేసును వాసిరెడ్డి ప‌ద్మ నేతృత్వంలోని మ‌హిళా క‌మిష‌న్ సుమోటోగా స్వీక‌రించి బాధితురాలికి న్యాయం చేయాల్సిన అవ‌స‌రం ఉంది. వివ‌రాల్లోకి వెళితే…

క‌డ‌ప అల్మాస్‌పేట‌కు చెందిన షేక్ స‌మీన అనే యువ‌తి హైద‌రాబాద్ కిమ్స్‌లో ఆస్ప‌త్రిలో ప‌నిచేసేది. ఈమెకు త‌న జిల్లాలోని రాయ‌చోటి నివాసి పైజాన్ అనే యువ‌కుడితో సోష‌ల్ మీడియా ద్వారా ప‌రిచ‌యం ఏర్ప‌డింది. ఇద్ద‌రి మ‌ధ్య ప‌రిచ‌యం పెరిగి ప్రేమ‌కు దారి తీసింది. పెళ్లి చేసుకుంటాన‌ని మాయ మాట‌లు చెప్ప‌డంతో శారీర‌కంగా కూడా ద‌గ్గ‌ర‌య్యారు. స‌ద‌రు ఫొటోలు, వీడియోలు తీసి ఆమెపై బ్లాక్‌మెయిల్‌కు తెగ‌బ‌డ్డాడు. దీంతో బాధితురాలు న్యాయం కోసం క‌డ‌ప దిశ పోలీస్‌స్టేష‌న్‌ను ఆశ్ర‌యించింది.

దిశ పోలీస్‌స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన‌ప్ప‌టి నుంచి యువ‌తికి కొత్త క‌ష్టాలు మొద‌ల‌య్యాయి. ఫిర్యాదు వెన‌క్కి తీసుకోవాల‌ని, లేదంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌ని రాయ‌చోటికి చెందిన అధికార పార్టీ నేత‌లు, ఓ ప్ర‌జాప్ర‌తినిధి పీఏ ఫోన్ చేసి బెదిరించ‌డం మొద‌లు పెట్టారు. డ‌బ్బు తీసుకుని రాజీప‌డాల‌ని బెదిరించారు. అయిన‌ప్ప‌టికీ ఆమె త‌లొగ్గ‌లేదు. దీంతో పోలీసుల‌తో బెదిరించారు.

త‌న‌కు పెళ్లి త‌ప్ప‌, మ‌రో ర‌క‌మైన న్యాయం వ‌ద్ద‌ని ఆమె ప‌ట్టుబ‌ట్టింది. ఈ నేప‌థ్యంలో గ‌త ఏడాది సెప్టెంబ‌ర్ 21న దిశ పోలీస్‌స్టేష‌న్‌లో పోలీసులు, వైసీపీ నేత‌ల స‌మ‌క్షంలో పెళ్లి జ‌రిపించారు. పెళ్లి రోజు రాత్రి మ‌రోసారి యువ‌తిని అత‌ను తీవ్రంగా హింసించాడు. దీంతో మ‌ళ్లీ బాధిత యువ‌తి పోలీసుల‌ను ఆశ్ర‌యించింది. అత‌నిపై రాయ‌చోటి పోలీస్‌స్టేష‌న్‌లో కేసు న‌మోదు చేసి వెంట‌నే బెయిల్ ఇచ్చి ఇంటికి పంపారు. అప్ప‌టి నుంచి అత‌ను క‌నిపించ‌డం లేదు.

మోస‌గాడిపై అత్యాచార కేసు న‌మోదు కాకుండా, ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌ల్లో భాగంగా పెళ్లి నాట‌కాన్ని ర‌క్తి క‌ట్టించార‌ని యువ‌తి వాపోతోంది. తామిద్ద‌రూ స‌న్నిహితంగా ఉన్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేశాడ‌ని క‌డ‌ప యువ‌తి ఆవేద‌న వ్య‌క్తం చేస్తోంది. అంతేకాదు, బాధిత యువ‌తి పేరుతో 18 ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్లు తెరిచి వాటిలో అశ్లీల వీడియోలు పోస్ట్ చేస్తూ, ఆమెను మాన‌సికంగా కుంగ‌దీస్తున్నాడు. ఈ నేప‌థ్యంలో త‌న‌కు న్యాయం చేయాల‌ని, మ‌రెవ‌రూ ఆ దుర్మార్గుడి బారిన ప‌డి అన్యాయానికి గురి కావ‌ద్దంటూ డీజీపీ గౌత‌మ్ స‌వాంగ్‌కు యువ‌తి ఫిర్యాదు చేసింది.

అధికార బ‌లం ఉన్న పోకిరీతో ఓ యువ‌తి చేస్తున్న పోరాటం మ‌హిళా క‌మిష‌న్‌కు క‌నిపిస్తోందా? ఆమె అర‌ణ్య రోద‌న వినిపిస్తోందా? అని మ‌హిళా సంఘాలు ప్ర‌శ్నిస్తున్నాయి. ఈ  కేసును ఏపీ మ‌హిళా క‌మిష‌న్ సుమోటోగా తీసుకుని వెంట‌నే ఆ కామాంధుడిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని మ‌హిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నిందితుడు అధికార పార్టీకి చెందిన వాడు కావ‌డం వ‌ల్లే మ‌హిళా క‌మిష‌న్ చూసీచూడ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని మ‌హిళా సంఘాల నేత‌లు విమ‌ర్శిస్తున్నారు. 

కావున ఇప్ప‌టికైనా మ‌హిళా క‌మిష‌న్ రాజ‌కీయాల‌కు అతీతంగా వ్య‌వ‌హ‌రిస్తూ బాధితుల ప‌క్షాన నిల‌వాల్సి ఉంది. సీఎం సొంత జిల్లాలో ఓ యువ‌తికి జ‌రిగిన అన్యాయంపై మ‌హిళా క‌మిష‌న్ స్పందించే తీరును బ‌ట్టి, ఆ సంస్థ విశ్వ‌స‌నీయ‌త ఆధారప‌డి ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.