సమ్మె : మొదలు కాకముందే వీగిపోతున్నదా?

తమ జీతాలు తాము కోరినంతగాపెంచకపోతే ఊరుకునేది లేదనే డిమాండ్ తో ఉద్యోగులు చేయదలచుకుంటున్న సమ్మె విజయవంతం అవుతుందా? వీగిపోతుందా? రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న చర్చ ఇది. ఈ సమ్మె విజయవంతం అయినంత మాత్రాన.. ప్రజాభిప్రాయం అంతా…

తమ జీతాలు తాము కోరినంతగాపెంచకపోతే ఊరుకునేది లేదనే డిమాండ్ తో ఉద్యోగులు చేయదలచుకుంటున్న సమ్మె విజయవంతం అవుతుందా? వీగిపోతుందా? రాష్ట్రవ్యాప్తంగా నడుస్తున్న చర్చ ఇది. ఈ సమ్మె విజయవంతం అయినంత మాత్రాన.. ప్రజాభిప్రాయం అంతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నట్టు కాదు. ఉద్యోగులు అందరూ మూకుమ్మడిగా తమ జీతాల గురించి అడుగుతున్నారు గనుక.. వారు పని మానేసి కూర్చోవడం పెద్ద విషయం కాదు.. విజయం కూడా కాదు! అదంతా పక్కన పెట్టినా.. సమ్మె మొదలు కాకముందే వీగిపోతుందేమో అనే సంకేతాలు అందుతున్నాయి. 

6వ తేదీ నుంచి ఉద్యోగులు సమ్మెకు వెళ్లనున్నట్టుగా ప్రభుత్వానికి నోటీసు ఇచ్చారు. గురువారం నాడు ఎటూ చలో విజయవాడ నిర్వహించబోతున్నారు. చలో విజయవాడ కార్యక్రమాన్ని చాలా పెద్ద స్థాయిలో విజయవంతం చేయాలనేది వారి ప్లాన్. కేవలం అయిదువేల మందితో ప్రదర్శన నిర్వహిస్తాం అంటూ వారు పోలీసులను అనుమతి అడిగితే.. అధికారులు నిరాకరించారు. 

నిజానికి ఒక్కోజిల్లానుంచి అయిదువేల మంది వరకు పోగేసి.. చాలా భారీ స్థాయిలో విజయవాడను ముట్టడించాలనేది వారి ప్లాన్. అయితే కొవిడ్ నేపథ్యంలో పోలీసులు అనుమతి నిరాకరించారు గనుక.. ఇప్పటినుంచే.. ఈ చలో విజయవాడను భగ్నం చేయడానికి ఎక్కడికక్కడ ప్రయత్నాలు జరుగుతున్నాయి. పోలీసులు ఉద్యోగ సంఘాల నాయకుల్ని కట్టడి చేస్తున్నారు. ఆంక్షలు విధిస్తున్నారు. వారి కళ్లు గప్పి.. కొన్ని వేల మంది అయినా.. విజయవాడకు చేరుకోగలరు గానీ.. ఒక పోరాటం, ప్రదర్శన రూపంలో ఎంత మేరకు జరుగుతుందో సందేహమే.

ఇదొక ఎత్తు అయితే.. సమ్మె ఎంతకాలం చేయగలరో స్పష్టత లేదు. ఈ ఉద్యోగులు సమ్మె చేసినంత మాత్రాన ప్రజాజీవితం ప్రత్యక్షంగా స్తంభించిపోయేదేమీ ఉండదు. అదే సమయంలో.. ఆర్టీసీ, వైద్య రంగాల వారు కూడా సమ్మెకు దిగితే మాత్రం ప్రజలకు ఇబ్బందే. అయితే.. సమ్మె సైరన్ ఇంకా మోగక ముందే.. ఆర్టీసీలో అప్పుడే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. 

ఒక యూనియన్ ఆర్టీసీ ఎండీని కలిసి.. తాము సమ్మె చేయబోమని, ఆర్టీసీని ప్రభుత్వంలో కలిపేసి.. కరోనా కాలంలో కూడా వేతనాలు ఇచ్చి ఆదుకున్న ప్రభుత్వానికి వ్యతిరేకంగా సమ్మె చేస్తే.. తల్లి పాలుతాగి రొమ్ము గుద్దినట్లే అవుతుందని సెలవిచ్చారు. తమ యూనియన్లో 13000 మంది ఉన్నారని, వారంతా విధులకు హాజరవుతారని ప్రకటించారు. అంటే.. ఆర్టీసీ సమ్మెలో అప్పుడే చీలిక వచ్చేసింది. 

ఇక వైద్య శాఖ విషయం తేలాల్సి ఉంది. ఆ రెండు శాఖల్లో సమ్మె పూర్తి స్థాయిలో జరగకుండా పాక్షికంగా మాత్రమే జరిగితే.. పీఆర్సీ కోసం ఉద్యోగుల సమ్మెకు నైతిక మద్దతు లేనట్టే. ఆ రెండు రంగాల్లో ప్రజలకు ఇబ్బంది కలగకపోతే.. ఇక మిగిలిన ఉద్యోగుల సమ్మె గురించి ఎవ్వరూ పట్టించుకోరు. కొన్నిరోజులు మొండికేసి.. ఆ తర్వాత వారికే చిరాకు వచ్చి దిగిరావాల్సి వస్తుంది.

ఈలోగా.. ఉద్యోగసంఘాల్లో భేదాభిప్రాయాలు రావని చెప్పడానికి కూడా వీల్లేదు. కొత్త పే స్లిప్పులు ఇచ్చిన ప్రభుత్వం.. ఏ ఒక్కరికీ గత నెలకంటె జీతం కొంతైనా తగ్గలేదని ఢంకా బజాయించి చెబుతోంది. ఈ వాదనలతో ఏ కొందరు ఉద్యోగులైనా ఏకీభవిస్తే.. అది సమ్మెకు దెబ్బ! 

రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని.. పెంచిన పీఆర్సీతో సర్దుకుని వెళ్లగలిగిన ఉద్యోగులు ఒక్క శాతం ఉన్నా సరే.. పీఆర్సీ సమ్మె ఆందోళనలకు గండి పడుతుంది. ఎటూ ఇప్పటికే.. ఇతర సంఘాలు వచ్చినా.. చర్చిస్తామని  ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో.. కొందరు మెట్టు దిగి వస్తే.. సమ్మె ముందే బలహీన పడే అవకాశం ఉంది. 

ఆర్టీసీ సమ్మె ఇప్పటికే వీగిపోయినట్టే. ఈ కోణాలన్నీ గమనించుకుంటూ.. ఉద్యోగులు ప్రాక్టికల్ గా ఆలోచిస్తే.. సమ్మెకు వెళ్లడం కాకుండా చర్చలకు వెళ్లడమే తమ సమస్యకు పరిష్కారం అనే సంగతి తెలుసుకోగలుగుతారు.