హీరోయిన్ ఒంటిపై పుట్టుమచ్చలు..హద్దుమీరిన కొండేటి

మీడియాకు చాలా శక్తి ఉందంటారు. అందులో కొంత నిజం కూడా ఉంది. అలా అని మైక్ పుచ్చుకొని ఏది పడితే అది వాగితే కరెక్టా..? మీడియాకు కూడా కొన్ని హద్దులున్నాయి, కొన్ని విలువలున్నాయి, కొన్ని…

మీడియాకు చాలా శక్తి ఉందంటారు. అందులో కొంత నిజం కూడా ఉంది. అలా అని మైక్ పుచ్చుకొని ఏది పడితే అది వాగితే కరెక్టా..? మీడియాకు కూడా కొన్ని హద్దులున్నాయి, కొన్ని విలువలున్నాయి, కొన్ని కట్టుబాట్లు ఉన్నాయి. అంశాలవారీగా ఇవి మారొచ్చేమో కానీ ఇంగితజ్ఞానం అనేది కామన్. ఆ విచక్షణ కూడా మరిచి ప్రవర్తిస్తే అతడ్ని జర్నలిస్ట్ అనలేం. అలాంటి ఘటనే ఈరోజు జరిగింది.

డీజే టిల్లు ట్రయిలర్ లాంఛ్ అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ లోని ఏఎంబీ మాల్ లో ఈరోజు ట్రయిలర్ రిలీజ్ చేశారు. మీడియా సమావేశం కూడా ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా సురేష్ కొండేటి అనే వ్యక్తి మైక్ పుచ్చుకున్నాడు. హద్దు మీరి ప్రశ్న సంధించాడు.

డీజే టిల్లూ ట్రయిలర్ లో ఓ డైలాగ్ ఉంటుంది. హీరోయిన్ తన ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో చెబుతుంది. దీన్ని ఉటంకిస్తూ మాట్లాడిన సురేష్ కొండేటి.. “సినిమాలో హీరోయిన్ చేత 16 పుట్టుమచ్చలున్నాయని చెప్పించారు కదా, మరి రియల్ గా ఆ హీరోయిన్ కు ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా?” అని మైక్ లో నేరుగా, సభాముఖంగా హీరోను అడిగేశాడు.

విచక్షణ మరిచి అడిగిన ఈ ప్రశ్నకు సమాధానం చెప్పినప్పుడు హీరో సిద్ధు మాత్రం విచక్షణ కోల్పోలేదు. “బహుశా.. ఈ ప్రశ్నను నేను ఎవాయిడ్ చేయొచ్చు అనుకుంటున్నాను” అంటూ సున్నితంగా సమాధానమిచ్చి తన హుందాతనాన్ని చాటుకున్నాడు.

వేదికపై హీరోయిన్ ఉంటుండగా, సురేష్ కొండేటి అడిగిన ఈ ప్రశ్నకు సోషల్ మీడియాలో విపరీతమైన వ్యతిరేకత వస్తోంది. నెటిజన్లు సురేష్ కొండేటిని ట్రోల్ చేస్తున్నారు. జర్నలిజం విలువలు పడిపోయాయంటూ కొందరు కామెంట్స్ పెడుతుంటే.. అసలు సురేష్ కొండేటి జర్నలిస్ట్ కాదంటూ మరికొందరు తమదైన వివరణ ఇస్తున్నారు.

నిజమే.. సురేష్ కొండేటి జర్నలిస్ట్ కాదు. ఈమధ్యే ఆయన జర్నలిస్ట్ అవతారం ఎత్తాడు. ఏ మీడియా సమావేశం జరిగినా మైక్ పుచ్చుకొని ఇష్టమొచ్చినట్టు ప్రశ్నలు అడగడం మొదలుపెట్టాడు. మొన్నటికిమొన్న ఆర్ఆర్ఆర్ ప్రెస్ మీట్ జరిగినప్పుడు కూడా ఓ వివాదాస్పద అంశాన్ని లేవనెత్తి, దర్శకుడు రాజమౌళితో సున్నం పెట్టించుకున్నాడు. అంతకంటే ముందు జరిగిన 2-3 ప్రెస్ మీట్స్ లో కూడా హద్దు మీరి ప్రశ్నలు అడిగి తన స్థాయిని చాటుకున్నాడు.

ఇప్పుడీ వ్యవహారం మొత్తం కొత్త టర్న్ తీసుకుంది. అసలు మీడియాకు, సురేష్ కొండేటికి సంబంధం ఏంటంటూ జర్నలిస్ట్ సర్కిల్ లో కొత్త చర్చ మొదలైంది. మెయిన్ స్ట్రీమ్ (ప్రింట్, ఎలక్ట్రానిక్) మీడియాను కాదని కొండేటికి మైక్ ఎందుకిస్తున్నారంటూ సినీ పాత్రికేయుల వాట్సాప్ గ్రూపుల్లో ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రారంభంలో కొంతమంది జర్నలిస్టులే సురేష్ కొండేటిని ఎంకరేజ్ చేశారంటూ సాక్ష్యాలు చూపెడుతున్నారు మరికొంతమంది జర్నలిస్టులు. 

ఇది చాలదన్నట్టు ఓ టీవీ ఛానెల్, సురేష్ కొండేటిని ఏకంగా యాంకర్ ను చేసింది. సినీ ప్రముఖుల్ని కొండేటి ఇంటర్వ్యూ చేస్తే, వాటిని ప్రసారం చేయడం మొదలుపెట్టింది. వీటన్నింటికంటే ముందు ఆయనకు ఓ చిన్న మ్యాగజైన్ ఉంది. ఇలా రకరకాల ప్రయత్నాలతో తనకుతాను జర్నలిస్ట్ ముసుగు వేసుకున్న సురేష్ కొండేటి… ఇప్పుడదే జర్నలిస్ట్ సమాజాన్ని అందరూ నిందించేలా ప్రవర్తించాడు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో బాధితురాలిగా మారిన హీరోయిన్ నేహాశెట్టి కూడా ఈ వ్యవహారంపై స్పందించింది. ట్రయిలర్ లాంఛ్ ఈవెంట్ లో సదరు వ్యక్తి అడిగిన ప్రశ్న చాలా దురదృష్టకరమన్న నేహా శెట్టి.. తన చుట్టూ ఉన్న మహిళలకు, ఇంట్లో, ఆఫీస్ లో తన దగ్గర ఉండే మహిళలకు అతడు ఏపాటి గౌరవం ఇస్తాడో ఈ ఘటనతో అర్థమౌతోందంటూ గట్టిగా చురకలు అంటించింది.