రాజకీయ నేతల్లో టీడీపీ అధినేత చంద్రబాబుది ఓ విలక్షణ శైలి. ఎన్నికల హామీల అమల్లో ఆయన చేతల కంటే మాటలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారని పేరు. ఓడ ఎక్కేదాక ఓడ మల్లన్న .. ఓడ దిగాక బోడి మల్లన్న అన్నట్టుగా ఎన్నికల్లో ఓట్లు వేయించుకునే వరకు ప్రజలే దేవుళ్లని, సమాజమే దేవాలయమని చంద్రబాబు పెద్ద పెద్ద మాటలు చెబుతారు. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రశ్నిస్తే తోకలు కత్తెరిస్తానని ఆయన హెచ్చరించడం చూశాం.
తాజాగా తెలంగాణలో గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో రాజకీయ నేతల మధ్య మాటల యుద్ధం హద్దులు దాటింది. చివరికి ప్రము ఖుల విగ్రహాల కూల్చివేత ప్రకటనల వరకు వెళ్లింది. హైదరాబాద్‌లో పెద్ద ఎత్తున భూఆక్రమణలు జరిగాయని, వాటిలో ఉన్న పీవీ నరసింహారావు, ఎన్టీఆర్ సమాధులను కూల్చే దమ్ము కేసీఆర్ సర్కార్‌కు ఉందా? అని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశ్నించడం తీవ్ర దుమారం రేపింది.
ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌తో పాటు పార్టీకి చెందిన నాయకులు ఘాటుగా స్పందించారు. బాబు, లోకేశ్‌ల స్పందనల గురించి తెలుసుకుందాం.
“రాజకీయ ప్రయోజనాల కోసం టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్, దివంగత ప్రధాని పీవీ నరసింహారావు వంటి మహనీయులను రచ్చకీడ్చడం దారుణం. తెలుగు వారికి గర్వకారణంగా , జాతీయ రాజకీయాలకు వన్నె తెచ్చిన తెలుగు వెలుగులు ఎన్టీఆర్ , పీవీ నరసింహరావు. ఎన్టీఆర్ సమాధిని కూల్చాలని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా. తెలుగు వారి ఆరాధ్య దైవంగా నిలిచిన ఎన్టీఆర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తెలుగు వారందరినీ అవమానించడమే” అని చంద్రబాబు ట్వీట్ చేశారు.
“దివంగత ఎన్టీఆర్, పీవీ నరసింహారావు లాంటి మహనీయుల సమాధులను కూల్చివేయాలన్న ఎంఐఎం నేత అక్బరుద్దీన్ తన వ్యక్తిత్వాన్ని కూల్చేసుకున్నారు. గొప్ప వ్యక్తుల సమాధులను కూల్చే బదులు మీలో ఉన్న అహాన్ని కూలిస్తే మిమ్మల్ని నమ్ముకుని ఎన్నో ఏళ్లుగా ఓట్లు వేస్తున్న ప్రజలకు న్యాయం జరుగుతుంది” అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ట్వీట్ చేశారు.
ఎన్టీఆర్, పీవీ నరసింహారావు సమాధుల గురించి అక్బరుద్దీన్ ప్రస్తావించడం ముమ్మాటికీ తప్పు. ఇందులో రెండో అభిప్రాయానికే తావు లేదు. మరి ఎన్టీఆర్‌కు చంద్రబాబు చేసిన ద్రోహం మాటేమిటి? ఏకంగా అధికార పీఠం నుంచి ఎన్టీఆర్‌ను చంద్రబాబే కదా కూల్చేసింది. సొంత అల్లుడే తనకు వెన్నుపోటు పొడవడాన్ని జీర్ణించుకోలేని ఎన్టీఆర్ మానసికంగా కుంగిపోయి చివరికి ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిన విషయం వాస్తవం కాదా?
ఎన్టీఆర్ లాంటి మహనీయుడిని రచ్చకీడ్చడం దారుణం అంటున్న చంద్రబాబు …నాడు వైస్రాయ్ హోటల్ ఎదుట ఆయనకు చేసిన పరాభవం మాటేమిటి? నాడు ఎన్టీఆర్‌ను పదవి నుంచి కూల్చివేసేటప్పుడు తెలుగు వారి ఆరాధ్య దైవమని చంద్రబాబుకు గుర్తు రాలేదా? తన తండ్రి అధికార దాహాన్ని, అహాన్ని కూల్చి వేసుకుని ఉంటే … ఆ మహనీయుడికి జీవిత చరమాంకలో దుర్గతి పట్టేది కాదు కదా అనే పశ్చాత్తాపం ఏనాడైనా కనీసం లోకేశ్‌లోనైనా కలిగిందా?
తన తండ్రితో పోల్చుకుంటే అక్బరుద్దీన్ చేసిన ద్రోహం ఏమిటో లోకేశ్ ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిది. ఇదే సందర్భంలో తాను ఎన్టీఆర్ నామస్మరణ చేయడం వల్ల ఆయన ఆత్మ ఘోషిస్తుందని చంద్రబాబు గ్రహిస్తే మంచిది. చివరిగా చెప్పొచ్చేది ఏంటంటే…ఎన్టీఆర్ విషయంలో అక్బరుద్దీన్ ఉత్తుత్తి మాటల నేత. ఇదే చంద్రబాబు విషయానికి వస్తే అధికారం కోసం సైలెంట్‌గా లోలోపల పని కానిచ్చేశాడు.