ఆంధ్రప్రదేశ్ కేబినెట్ భేటీ సమావేశం మరికాసేపట్లో ప్రారంభం కాబోతోంది. సీఎం జగన్ అధ్యక్షతన జరగనున్న ఈ మీటింగ్ లో ప్రధానాంశం అసెంబ్లీ శీతాకాల సమావేశాలు. సోమవారం నుంచి ప్రారంభం కాబోతున్న ఈ సమావేశాల్లో ఏఏ అంశాలపై చర్చించాలో ఇవాళ్టి కేబినెట్ భేటీలో నిర్ణయిస్తారు.
మూడు రాజధానుల అంశం, స్థానిక సంస్థల ఎన్నికలు, హిందూ దేవాలయాలపై దాడులు లాంటి అంశాల్ని తెలుగుదేశం పార్టీ లేవనెత్తే అవకాశం ఉన్న నేపథ్యంలో.. ఆయా అంశాలపై ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్లాలనే విషయంపై ఈరోజు సమావేశంలో చర్చిస్తారు. ఏ అంశాన్ని ఎవరు టేకప్ చేయాలో జగన్ ఈరోజు దిశానిర్దేశం చేయబోతున్నారు.
వీటితో పాటు నివర్ తుపాను ప్రభావంపై కూడా కేబినెట్ భేటీలో చర్చించబోతున్నారు. ఇప్పటికే తుపాను సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఇవి కాకుండా చిత్తూరు, నెల్లూరు, కడప, ప్రకాశం జిల్లాలకు ఎలాంటి ప్యాకేజీ అందిస్తే బాగుంటుందనే అంశంపై చర్చిస్తారు.
వీటితో పాటు కరోనా సెకెండ్ వేవ్, వ్యాక్సిన్ వస్తే దాని పంపిణీ తదిరత అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది.