హైదరాబాద్ అంటే చంద్రబాబు; చంద్రబాబు అంటే హైదరాబాద్ అనే లెవల్‌లో టీడీపీ బిల్డప్. ఇది నిన్న మొన్నటి వరకూ స్వయంగా చంద్రబాబు చెప్పుకున్న గొప్పలు. కానీ నేడు అదే హైదరాబాద్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతుంటే ప్రచారానికి వెళ్లలేని దుస్థితి చంద్రబాబుది.
ఇదే కాల మహిమ అంటే. 2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇదే విషయాన్ని ప్రచార అంశంగా జనాల్లోకి తీసుకెళ్లి, ఓట్లను గంపగుత్తగా పొందాలని చూశారు. అయితే తానొకటి తలస్తే, కేసీఆర్ మరో రకంగా దాన్ని సొమ్ము చేసుకున్నారు.
హైదరాబాద్‌కు 400 ఏళ్ల చరిత్ర వుందని, కనీసం సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత కూడా చంద్రబాబుది కాదని టీఆర్ఎస్ ఎదురు దాడి చేసింది. అసలు పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో మళ్లీ చంద్రబాబు పెత్తనం ఏంటనే ప్రశ్నతో, కేసీఆర్ ఏకైక ఎన్నికల ఎజెండాతో 2018లో ఉధృతంగా ప్రచారం చేశారు.
కేసీఆర్ దెబ్బతో టీడీపీని నమ్ముకుని పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ కూడా మునిగిపోయింది. తెలంగాణలో రెండోసారి కేసీఆర్ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం కాంగ్రెస్‌తో కలిసి చంద్రబాబు ప్రచారం నిర్వహించడమే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయ పడ్డారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో తమ ఓటమికి బాబు రాకే కారణమని కాంగ్రెస్ నాయకులు కూడా ఓ అభిప్రాయానికి వచ్చారు.
ఇదిలా వుండగా, తాజాగా గ్రేటర్ ఎన్నికల ప్రచారం రసవత్తరంగా సాగుతోంది. డిసెంబర్ 1న ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల గడువు దగ్గర పడేకొద్దీ ప్రచారం ఊపందుకుంటోంది. ఈ ఎన్నికల్లో టీడీపీ కూడా 106 స్థానాల్లో పోటీ చేస్తోంది. టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం …ఇలా అన్ని పార్టీలు తమ స్టార్ క్యాంపెయినర్లను రంగంలోకి దింపి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. బీజేపీ తరపున అగ్రనేతలైన నడ్డా, అమిత్‌షా కూడా రంగంలోకి దిగారు.
కానీ టీడీపీ తరపున చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, బాలకృష్ణ ఇలా ఏ ఒక్కరూ ప్రచారానికి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. పైపెచ్చు ప్రస్తుతం వీళ్లంతా అక్కడే ఉన్నారు కూడా. గత గ్రేటర్ ఎన్నికల్లో వీళ్లంతా ప్రచారం చేసిన వాళ్లే. హైదరాబాద్‌ను అభివృద్ధి చేసిన ఘనత టీడీపీదేనని ప్రచారం చేసిన వాళ్లే.
ఈ దఫా మాత్రం గ్రేటర్ ఎన్నికలతో తమకెలాంటి సంబంధం లేదని హైదరాబాద్‌లోనే ఉంటున్న చంద్రబాబు, లోకేశ్ వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ఎన్నికల ప్రచారానికి వెళితే, గత అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితి ఎక్కడ పునరావృతం అవుతుందనే భయం బాబును వెంటాడమే కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో మీ రాష్ట్రం, మీ ఎన్నికలంటూ తెలంగాణ టీడీపీ నేతలపైనే పూర్తి భారం వేశారు.
గత అసెంబ్లీ ఎన్నికల నాడు కేసీఆర్ పెట్టిన భయం బాబును ఎంతలా వేటాడుతున్నదో గ్రేటర్ ఎన్నికల్లో ఆయన ప్రచారం చేయకపోవడమే నిదర్శనమని చెబుతున్నారు. హైదరాబాద్‌ను ప్రపంచ పటంలో పెట్టింది తానేనని ఊరూరా డప్పు వేయించి మరీ ప్రచారం చేసుకున్న చంద్రబాబుకు, నేడు ఆ నగరంలో ఎన్నికల ప్రచారం నిర్వహించడానికి కూడా ధైర్యం చాల్లేదంటే …హతవిధీ, ఏమిటీ దుర్గతి అని అనకుండా ఎలా ఉంటారు?