నివర్ తుపాను ధాటికి చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో వాగులూ వంకలూ పొంగి పొర్లాయి.. గత 15ఏళ్లలో ఎప్పుడూ చూడనంత ఉధృతంగా వాగుల్లోకి నీరు వచ్చి చేరింది. కట్టలు తెంచుకుని చెరువులు ఊళ్లని ముంచెత్తుతాయన్న భయాందోళనలు నెలకొన్నాయి. విపత్తు పెద్దదే, కానీ సీఎం జగన్ పాలనలో అది పూర్తిగా చిత్తయింది. ముఖ్యంగా సచివాలయ వ్యవస్థ, వాలంటీర్లు.. నివర్ కి తమ పవర్ అడ్డు పెట్టి హీరోలుగా నిలిచారు.
తీరం దాటుతూ నివర్ సృష్టించిన విధ్వంసాన్ని సమన్వయంతో ఎదుర్కొన్నారు సిబ్బంది. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముంపు ప్రాంతాల వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఓవైపు కరెంటు లేదు, మరోవైపు వణికిస్తున్న చలి, జోరు వాన.. అయినా సరే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది తమ ప్రాణాలకు తెగించి ముంపు ప్రాంతాలవారిని ప్రభుత్వ కార్యాలయాలకు తరలించి ఆశ్రయమిచ్చారు.
చిత్తూరు జిల్లాలోని నాలుగు నియోజకవర్గార పరిథిలో 2వేలమంది నిరాశ్రయులకు ఆహారం, నీరు సమకూర్చారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 15వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించి వారి అవసరాల తీర్చారు.
మాటకి ముందు తిత్లీ, హుద్ హుద్ అని డబ్బా కొట్టుకునే చంద్రబాబు.. పని తక్కువ, ప్రచారం ఎక్కువ చేసుకున్నారు. కానీ జగన్ జమానాలో ప్రచారం తక్కువ పని ఎక్కువ. కంట్రోల్ రూమ్ లు, వార్ రూమ్ లు పెట్టి అధికారుల్ని లెక్కలకు పరిమితం చేయలేదు జగన్. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా తుపానుపై సమీక్ష చేపట్టి.. వారికి తగిన సూచనలిచ్చి క్షేత్రస్థాయి పనుల్ని పర్యవేక్షించాలని ఆదేశాలిచ్చారు.
సీఎం ఇచ్చిన ఫ్రీహ్యాండ్ తో నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు.. నేరుగా క్షేత్ర స్థాయిలో సహాయ చర్యల్లో పాల్గొన్నారు, వాటిని పర్యవేక్షించారు. ముఖ్యంగా సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు ప్రతి గ్రామంలో అందుబాటులో ఉండటంతో.. వారి ద్వారా పని పూర్తయింది.
అటు మంత్రి అనిల్ కుమార్ నేరుగా వరదనీటిలో దిగి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్డీఆర్ఎఫ్ బృందంతో కలసి బోటులో వెళ్లి ఇద్దరు రైతుల్ని వరదనీటి నుంచి కాపాడారు. ఇలాంటి ఉదాహణలు చాలానే ఉన్నాయి.
మొత్తమ్మీద నివర్ అనే భయంకర తుపాను ప్రభావాన్ని.. అధికారుల సమన్వయం అద్భుతంగా అడ్డుకోగలిగింది. రోడ్లు తెగినా, ఊళ్లలోకి వరద నీరొచ్చినా ప్రాణనష్టం అత్యల్పం అంటే దానికి జగన్ ముందు చూపు, సచివాలయ-వాలంటీర్ వ్యవస్థలు, ఉద్యోగులు మాత్రమే కారణం.