ష‌రా మామూలే, సీఎం సీటు మీదే క‌న్ను!

తమ‌కు బ‌లం ఉన్న రాష్ట్రాల్లో సీఎం అభ్య‌ర్థిత్వాల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ నేత‌ల పోరు కొత్త‌ది కాదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వివిధ రాష్ట్రాల్లో సీఎం సీటు విష‌యంలో నేత‌ల ప్ర‌క‌ట‌న‌లు…

తమ‌కు బ‌లం ఉన్న రాష్ట్రాల్లో సీఎం అభ్య‌ర్థిత్వాల విష‌యంలో కాంగ్రెస్ పార్టీ నేత‌ల పోరు కొత్త‌ది కాదు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, వివిధ రాష్ట్రాల్లో సీఎం సీటు విష‌యంలో నేత‌ల ప్ర‌క‌ట‌న‌లు ఆ పార్టీలో వ‌ర్గ పోరును క‌లిగించేవి. ఇలాంటి ప‌రిస్థితి ఉన్న చోట ఎక్క‌డా కాంగ్రెస్ పార్టీ మ‌ళ్లీ గెల‌వ‌లేక‌పోయింది.

వైఎస్ మ‌ర‌ణం త‌ర్వాత ఏపీలో, ఇటీవ‌లే కర్ణాట‌క‌లో.. అనేక మంది నేత‌లు తామే సీఎం క్యాండిడేట్స్ అన్న‌ట్టుగా చేసిన ర‌చ్చ ఆ పార్టీకి తీవ్ర న‌ష్టాన్ని క‌లిగించింది. ఇప్పుడు దేశంలో కాంగ్రెస్  కు పూర్తి స్థాయిలో మెజారిటీ ఉండి, అధికారాన్ని అందుకునే అవ‌కాశం ఉన్న‌ది చాలా చాలా త‌క్కువ రాష్ట్రాల్లో మాత్ర‌మే. ఇలాంటి వాటిల్లో ఒక‌టైన పంజాబ్ లో సీఎం సీటు విష‌యంలో ఉన్న ర‌చ్చ ఇప్ప‌టికే జాతికి తెలిసిందే.

అమ‌రీంద‌ర్ వ‌ర్సెస్ సిద్ధూ పోరాటం చాన్నాళ్ల పాటు సాగింది. చివ‌ర‌కు అమ‌రీంద‌ర్ కు సిద్ధూ ఎర్త్ పెట్ట‌గ‌లిగాడు. అయితే త‌ను సీఎం కాలేక‌పోయాడు. అనూహ్యంగా చ‌న్నీకి అవ‌కాశం ద‌క్కింది. ఇంత‌లో ఎన్నిక‌లు వ‌చ్చాయి. సిద్ధూనేమో ఇప్పుడు ప‌దే ప‌దే సీఎం అభ్యర్థిత్వం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పంజాబ్ అసెంబ్లీ ఎన్నిక‌ల పోలింగ్ కు ముందే సీఎం అభ్య‌ర్థి ఎవ‌రో ప్ర‌క‌టించాలంటూ సిద్ధూ బ‌హిరంగ ప్ర‌క‌ట‌న‌లు చేస్తున్నాడు. రాహుల్ గాంధీని ఇలా బాహాటంగా ఇర‌కాటంలో పెడుతున్నాడు సిద్ధూ!

అయితే కాంగ్రెస్ పార్టీ అంత ప‌ని చేస్తే.. ఆ త‌ర్వాత క‌థ ఎలా ఉంటుందో చెప్ప‌న‌క్క‌ర్లేదు. త‌న‌కు ఆ అవ‌కాశం ద‌క్క‌పోతే సిద్ధూ పోలింగ్ కు ముందే తిరుగుబాటు చేసినా పెద్ద ఆశ్చ‌ర్యం లేదు! అయితే సిద్ధూనే కాదు తాము కూడా పోటీలో ఉన్నామ‌న్న‌ట్టుగా పంజాబీ కాంగ్రెస్ సీనియ‌ర్లు ప్ర‌క‌ట‌న‌లు మొద‌లుపెట్టారు. 

అమ‌రీంద‌ర్ త‌ర్వాత మెజారిటీ ఎమ్మెల్యేలు త‌న‌నే సీఎంగా ఉండ‌మ‌న్నారంటూ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత సునీల్ జ‌క్క‌ర్ ప్ర‌క‌టించుకున్నారు. త‌ను హిందూ కావ‌డం చేతే సీఎం కాలేక‌పోయానంటూ ఆయ‌న వ్యాఖ్యానించారు. ఇలా తాము కూడా అవ‌కాశం కోసం ఎదురుచూస్తున్న‌ట్టుగా  పంజాబ్ కాంగ్రెస్ నేత‌లు త‌లా ఒక క‌ర్చీఫ్ వేస్తున్నారు.

పంజాబ్ లో కాంగ్రెస్ మ‌రీ చిత్తు కాక‌పోవ‌చ్చ‌ని వివిధ స‌ర్వేలు అంచ‌నా వేస్తున్నాయి. క‌ష్ట‌ప‌డితే గెలుపు కూడా మ‌ళ్లీ  సాధ్య‌మే అంటున్నాయి. ఇలాంటి నేప‌థ్యంలో సీఎం సీటు విష‌యంలో ముందుగానే ఈ నేత‌ల మ‌ధ్య‌న మాట‌ల యుద్ధాన్ని గ‌మ‌నిస్తే.. విజ‌యం సాధ్య‌మేనా? అనే డౌటు రావొచ్చు!