కేసీఆర్‌పై కమలదళం వంకర ఎత్తుగడలు!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని, ఈ దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉన్నదని ఒక మాట అన్నారు. జాతీయ మీడియా మొత్తం తాను చెబుతున్న ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని.. దేశంలోని అందరి…

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్యాంగాన్ని మార్చాలని, ఈ దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం ఉన్నదని ఒక మాట అన్నారు. జాతీయ మీడియా మొత్తం తాను చెబుతున్న ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించాలని.. దేశంలోని అందరి దృష్టికి ఈ విషయం వెళ్లాలని.. దేశంలో కొత్త రాజ్యాంగం కావాలనే డిమాండ్ గురించి.. చర్చ జరగాల్సిన అవసరం ఉన్నదని కేసీఆర్ అన్నారు. 

‘రాజ్యాంగంలో అప్పటిపెద్దలు పేర్కొన్న విషయాలు కాలం చెల్లినవి’ అని నిరూపిస్తూ.. ఈ దేశంలో ఇప్పటికే 80కి పైగా సవరణలు జరిగాయి. రాజ్యాంగాన్ని సవరించడం అనేది.. అందులో అంశాల్ని పార్లమెంటు సభ్యులు ఆమోదించినప్పుడు సమూలంగా మార్చేయడం అనేది తప్పు కాదని ఈ దేశం నమ్ముతున్నప్పుడు.. యావత్తు రాజ్యాంగాన్ని మార్చాలని కోరుకోవడం లేదా.. కనీసం యావత్తు రాజ్యాంగం సమీక్ష జరగవలసిన అవసరం ఉన్నదని వాదించడం తప్పు ఎలా అవుతుంది?

కొత్త రాజ్యాంగం కావాలని ప్రతిపాదించిన కేసీఆర్.. తాను ఎందుకు అలాంటి డిమాండ్ చేస్తున్నారో కూడా వివరించారు. రాష్ట్రాలకు న్యాయబద్ధంగా రాజ్యాంగబద్ధంగా దక్కే హక్కులను కేంద్రం హరించివేస్తున్నదని.. రాష్ట్రాలు- కేంద్రం యొక్క బాధ్యతలు విధివిధానాల గురించి మరింత స్పష్టత ఉండేలా.. రాజ్యాంగం చెప్పవలసిన అవసరం ఉన్నదనేది ఆయన వాదన. సూచన.

అయితే రాష్ట్రాల హక్కులను హరించేయడం అనే కేసీఆర్ ఆరోపణకు సంబంధించి సూటిగా సమాధానం చెప్పలేని కేంద్రంలోని బీజేపీ నాయకులు.. వంకర వాదనల్ని తెరపైకి తెచ్చి.. తద్వారా కేసీఆర్‌ను ఇరుకున పెట్టాలని చూస్తున్నారు. రాజ్యాంగం ద్వారా పెట్టిన పార్టీ ద్వారా ఎన్నికై, రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వ్యక్తి రాజ్యాంగం మార్చాలని డిమాండ్ చేయడం అనైతికం అంటూ.. కిషన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. 

రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న వారు కాకుండా.. బయటి వ్యక్తులు రాజ్యాంగం మార్చాలనే డిమాండ్ వినిపిస్తే ఈ ప్రభుత్వం చెవిన వేసుకుంటుందా? దేశద్రోహి ముద్ర వేయకుండా ఉంటుందా? అనేది ఇంకో చర్చ. అయితే.. రాజ్యాంగం మార్చాలనే డిమాండ్ కు.. ‘యాంటీ అంబేద్కర్’ రంగు పులమడానికి ఇప్పుడు బీజేపీ ఒక సంకుచితమైన ప్రయత్నం చేస్తోంది. 

ఈ డిమాండ్ .. రాజ్యాంగానికి రూపకల్పన చేసిన అంబేద్కర్ ను అవమానించేలా ఉన్నదట. అంబేద్కర్ కు ముడిపెడితే.. కేసీఆర్ మీద దళిత వ్యతిరేక ముద్ర వేయచ్చునని వారు అత్యుత్సాహపడుతున్నట్టు కనిపిస్తోంది. ఈ దేశంలో పార్లమెంటు రాజ్యాంగ సవరణలు చేపట్టిన ప్రతి సందర్భమూ.. అంబేద్కర్ ను అవమానించడమే అవుతుందా? అనేది సామాన్యులకు కలుగుతున్న సందేహం. 

రాజ్యాంగ వ్యతిరేకంగా రాష్ట్రాలను అణచివేయడానికి సంబంధించి జవాబు ఇవ్వలేని బీజేపీ.. అంబేద్కర్ కు ముడిపెడుతూ వంకర మాటలతో వక్ర ప్రయోజనాలు ఆశిస్తోంది. కేసీఆర్ డిమాండ్ కు వ్యతిరేకంగా ‘భీం దీక్ష’ పేరుతో భాజపా శ్రేణులు దీక్షలు చేస్తారట. ఈ ప్రయత్నంలో వారి ఎజెండా అర్థమవుతూనే ఉంది. ఈ దీక్షల ద్వారా.. కొత్త రాజ్యాంగం కావాలనే కేసీఆర్ డిమాండ్ మీద దేశంలో చర్చ జరగకుండా.. వివిధ వర్గాల వారు దాని గురించి మాట్లాడకుండా చేయగలం అని బీజేపీ ఎలా అనుకుంటున్నదో అర్థం కావడం లేదు.