హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలకు భాజపా మేనిఫెస్టో వచ్చేసింది. మరీ ఎగ్జయిటింగ్ గా లేదు. అలా అని వాస్తవానికి దగ్గరగానూ లేదు. తెరాస అంటే రాష్ట్రంలో అధికారంలో వుండడంతో, మున్సిపల్ లెవెల్ కు దాటి హామీలు ఇచ్చింది.
భాజపాకు ఆ అవకాశం లేదు. కానీ అలవికాని హామీలు ఇచ్చింది. మహిళలకు పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ లో ఉచిత ప్రయాణం అన్నది కచ్చితంగా కాస్త ఆకర్షణీయమే. అయితే ఇది ఎలా అమలు అవుతుంది అన్నది తెలియాలి.
ఎందుకంటే ప్రజా రవాణా అన్నది వివిధ సంస్థలుగా విడిపోయి వుంది. రైల్వేలో కొంత, ఆర్టీసీ చేతిలో కొంత, మెట్రో చేతిలోమరి కొంత వుంది. మరి వాటికి ఎలా భర్తీ చేసే అవకాశం వుంటుంది.
అసలు మహిళల నుంచి ప్రతి వ్యవస్థకు ఎంత ఆదాయం వస్తుంది? అది ఎవరు భర్తీ చేస్తారు అన్నది తేల్చాల్సిన అంశం. అలా లెక్క కడితే ఎంత మొత్తం అవుతుంది? అది మొత్తంగా జిహెచ్ఎంసి ఎలా భర్తీ చేస్తుంది అన్నది ఆసక్తికరం. అంత బడ్జెట్ ను కేటాయించగలదా? అన్నది ఆలోచించాల్సిన విషయం.
అలాగే వంద యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ అన్నది కూడా సాదా సీదా విషయం కాదు. ఆ మేరకు విద్యుత్ పంపిణీ సంస్థలకు జిహెచ్ఎంసి తిరిగి చెల్లించాల్సి వుంటుంది. ఆ మొత్తం చాలా భారీగా వుంటుంది. అది సాధ్యమా? అన్నది ఆలోచించాల్సిందే.
ఆ సంగతి పక్కన పెడితే ఈ మధ్య భాజపా నాయకుల నోటి వెంట వచ్చి, విపరీతంగా సోషల్ మీడియాలో పాపులర్ అయిన చలానాల చెల్లింపు, రవాణా చట్టం ఉల్లంఘించినా వదిలేయడం, అలాగే వరదల్లో కారు పోతే కారు, బైక్ పోతే బైక్, ఫర్నిచర్ పోతే ఫర్నిచర్ ఇస్తాం అన్న హామీలు మేనిఫెస్టోలో కనిపించలేదు.
నిజానికి ఇలాంటివి క్రేజీగా, ఆసక్తిగా వుంటాయి. కానీ అవన్నీ ఫన్నీగా కూడా జనాలు షేర్ చేసుకున్నారు. బహుశా అందుకే మేనిఫెస్టోలో పెట్టడం వదలేసి వుంటారు.
ఇదిలావుంటే కరోనా వ్యాక్సీన్ ను అందరికీ ఉచితంగా అందిస్తాం, సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహిస్తాం లాంటి హామీలు కూడా వున్నాయి. కేంద్రం ఎలాగూ ఉచితంగానే ఇస్తుంది అది కూడా హామీగా చేర్చడం ఏమిటో? అలాగే సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించడం కూడా హామీల జాబితాలో చేర్చారు. అదేమీ ఖర్చుతో కూడిన పని కాదు కదా?