ఏపీ స‌ర్కార్‌కు ‘చింతా’మ‌ణి!

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చింతామ‌ణి నాట‌కం నిషేధంపై వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో జ‌గ‌న్ స‌ర్కార్‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నాట‌కం విష‌యంలో స‌ర్కార్‌కు చింత త‌ప్ప‌లేదు. స‌రైన స‌మాధానం చెప్పుకోడానికి ప్ర‌భుత్వం…

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో చింతామ‌ణి నాట‌కం నిషేధంపై వైసీపీ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు దాఖ‌లు చేసిన పిటిష‌న్‌లో జ‌గ‌న్ స‌ర్కార్‌పై హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. నాట‌కం విష‌యంలో స‌ర్కార్‌కు చింత త‌ప్ప‌లేదు. స‌రైన స‌మాధానం చెప్పుకోడానికి ప్ర‌భుత్వం ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింది. 

వైసీపీ రెబల్ ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు త‌న సొంత ప్ర‌భుత్వం తీసుకుంటున్న నిర్ణ‌యాల‌పై న్యాయ‌స్థానాల్ని ఆశ్ర‌యిస్తున్న సంగ‌తి తెలిసిందే. చివ‌రికి త‌న పార్టీ అధినేత‌, ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ బెయిల్ ర‌ద్దు చేయాల‌ని కూడా ఆయ‌న న్యాయ‌స్థానాన్ని ఆశ్ర‌యించి భంగ‌పాటుకు గుర‌య్యారు.

అయిన‌ప్ప‌టికీ సొంత ప్ర‌భుత్వం తీసుకుంటున్న ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌పై ఆయ‌న పోరు కొన‌సాగిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఇటీవ‌ల ఏపీ స‌ర్కార్ చింతామ‌ణి నాట‌కాన్ని నిషేధించ‌డంపై ఆయ‌న ఏపీ హైకోర్టును ఆశ్ర‌యించారు. ఆయ‌న వ్యాజ్యంపై ఇవాళ కోర్టు విచార‌ణ చేప‌ట్టింది.

ఇందులో భాగంగా ప్ర‌భుత్వానికి న్యాయ స్థానం కీల‌క ప్ర‌శ్న‌లు వేసింది. నాట‌కంలోని ఒక పాత్ర‌పై అభ్యంత‌రం వుంటే… మొత్తం నాట‌కాన్ని ఎలా నిషేధిస్తార‌ని ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాదిని హైకోర్టు ప్ర‌శ్నించింది. అలాగే చింతామ‌ణి నాట‌కాన్ని నిషేధించారా? అనే ప్ర‌శ్న‌కు లేద‌ని ప్ర‌భుత్వం స‌మాధానం ఇచ్చింది.

పుస్త‌కాన్ని నిషేధించ‌కుండా నాట‌కాన్ని ఎలా నిషేధిస్తార‌ని కోర్టు మండిప‌డింది. పాత్ర‌పై అభ్యంత‌రం వుంటే, అంత వ‌ర‌కే నిషేధాన్ని చూడాల‌ని కోర్టు అభిప్రాయ‌ప‌డింది. త‌మ సామాజిక వ‌ర్గాన్ని కించ‌ప‌రిచేలా చింతామ‌ణి నాట‌కంలో ఓ పాత్ర ఉంద‌ని ప్ర‌భుత్వ దృష్టికి  వైశ్యులు తీసుకొచ్చార‌ని, వారి విజ్ఞాప‌న మేర‌కే నిషేధం విధించిన‌ట్టు ప్ర‌భుత్వ త‌ర‌పు న్యాయ‌వాది చెప్పు కొచ్చారు. అయితే చాలా ఏళ్లుగా ఉన్న చింతామ‌ణి నాట‌కాన్ని నిషేధించ‌డం నిబంధ‌న‌ల‌కు విరుద్ధ‌మ‌ని పిటిష‌న‌ర్ త‌ర‌పు న్యాయ‌వాది కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. నాట‌కానికి చాలా విశిష్ట‌త ఉంద‌ని వాదించారు.

ఇరువైపు వాద‌న‌లు విన్న న్యాయ‌స్థానం… వైశ్యుల విజ్ఞాప‌న ప‌త్రాన్ని త‌మ ముందు పెట్టాల‌ని ఆదేశించింది. అలాగే నిషేధానికి దారి తీసిన ప‌రిస్థితుల‌పై ప్ర‌భుత్వం, అధికారులు అఫిడ‌విట్లు దాఖ‌లు చేయాల‌ని న్యాయ‌స్థానం ఆదేశించింది. ఏది ఏమైనా ర‌ఘురామ దాఖ‌లు చేసిన పిటిష‌న్ వ‌ల్ల న్యాయ‌స్థానంలో ప్ర‌తికూల ప‌రిస్థితులు ఎదుర‌య్యాయ‌నే ఆవేద‌న ప్ర‌భుత్వంలో ఉంది.