ముహుర్తాలు కుదురుతున్నాయి.. చిరంజీవి మాటేమైంది?

ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుపై ఆమధ్య చిరంజీవి, ఏపీ సీఎం జగన్ మధ్య చర్చలు జరిగాయి. అబ్బెబ్బే అదేం లేదు, అది లంచ్ మీట్ అన్నారు ఏపీ మంత్రులు. కాదు ముఖ్యమంత్రి నన్ను…

ఏపీలో సినిమా టికెట్ల రేట్ల తగ్గింపుపై ఆమధ్య చిరంజీవి, ఏపీ సీఎం జగన్ మధ్య చర్చలు జరిగాయి. అబ్బెబ్బే అదేం లేదు, అది లంచ్ మీట్ అన్నారు ఏపీ మంత్రులు. కాదు ముఖ్యమంత్రి నన్ను స్వయంగా పిలిచి శుభవార్త చెప్పారు. టాలీవుడ్ కి త్వరలో మంచిరోజులొస్తాయన్నారు చిరంజీవి. 

ఇంతకీ ఆ మంచి రోజులెప్పుడు. కరోనా వల్ల కొత్త సినిమాల రిలీజ్ లు లేవు కాబట్టి ఎవరూ చిరంజీవి మాటల్ని సీరియస్ గా తీసుకోలేదు, తిరిగి ప్రశ్నించే సాహసం చేయలేదు. ఇప్పుడు సినిమాలు క్యూ కడుతున్నాయి. పెద్ద సినిమాలన్నీ వరుసపెట్టి రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నాయి. మరి ఆ మంచి రోజులేంటి..? టికెట్ల రేట్లు పెంచుతున్నారా..? అసలు ఇందులో పురోగతి ఉందా..? లేదా..?

ఏపీలో ఫిబ్రవరి 14 వరకు నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. దాంతోపాటే సినిమా హాళ్లలో 50శాతం ఆక్యుపెన్సీ కూడా అమలవుతుంది. అంటే సగానికి సగమే కలెక్షన్లు వస్తాయి. అందుకే ఎవరూ సినిమాల విడుదల సాహసం చేయడంలేదు. మార్చి నుంచి మహూర్తాలు పెట్టుకుని రెడీగా ఉన్నారు. 

కరోనా పరిస్థితి ఏంటనేదానిపై క్లారిటీ లేకపోయినా సినిమా జనాల నోళ్లలో నానుతూ ఉండాలంటే రిలీజ్ డేట్ ఒక్కటే మార్గం. అందుకే జక్కన్న నుంచి మొదలుపెట్టి మేకర్స్ అంతా రిలీజ్ డేట్స్ ప్రకటిస్తున్నారు. ఇది కూడా ఓ రకమైన పబ్లిసిటీ జిమ్మిక్కే.

ఇక అందరి దృష్టీ ఒకే విషయంపై ఉంది. ఏపీలో సినిమా టికెట్ల రేట్లు పెంచుతారా..? అప్పట్లో జనంపై భారం తగ్గించడానికి అంటూ ప్రభుత్వం గొప్పగా చెప్పింది, ఇప్పుడు సినిమా వాళ్ల అభ్యర్థనలు విని రేట్లు పెంచుతామంటే ఆ గొప్పలన్నీ తిప్పలవుతాయి కదా..? మరి ప్రభుత్వం ఆ సాహసం చేస్తుందా..?

చిరంజీవి మాటకు విలువ ఉందా.. లేదా..?

సినిమా వాళ్లకు మంచి వార్త, అంటే అప్పటికి అది కచ్చితంగా టికెట్ల రేట్ల వ్యవహారమే. కానీ ఇంకా ఈ విషయంలో ఏపీ ప్రభుత్వం క్లారిటీ ఇవ్వలేదు. ఓవైపు ఉద్యోగుల పీఆర్సీ పై గొడవ జరుగుతోంది. ఈ దశలో జీతాలు మరింత పెంచకుండా టికెట్ రేట్లు పెంచితే ఆ రచ్చ మామూలుగా ఉండదు. 

సో.. ఏపీలో టికెట్ల వ్యవహారం ఇప్పుడల్లా తెగేలా లేదు. అంటే ఏపీ మార్కెట్ ని బంగార్రాజు అర్థం చేసుకున్నట్టు అందరూ అర్థం చేసుకుని వదిలేస్తే మంచిది. మరోవైపు టికెట్ రేట్లపై ఏర్పాటైన కమిటీ ఏం చేస్తోందనే అంశంపై కూడా క్లారిటీ లేదు. ఆ కమిటీ నుంచి ఎవ్వరూ స్పందించలేదు. 

చూస్తుంటే.. ఈ వ్యవహారం మరిన్ని రోజులు పట్టేలా ఉంది. అప్పటివరకూ చిరంజీవి చెప్పిన మంచి రోజుల కోసం వేచి చూడాల్సిందే.