సీఎం సొంత జిల్లాలో అడుగ‌డుగునా అడ్డంకులు!

నూత‌న పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌ల పిలుపు మేర‌కు ఈ నెల 3న చ‌లో విజ‌య‌వాడ‌కు ఉద్యోగులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. అయితే చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేద‌ని ఇప్ప‌టికే పోలీస్ ఉన్న‌తాధికారులు…

నూత‌న పీఆర్సీని వ్య‌తిరేకిస్తూ పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌ల పిలుపు మేర‌కు ఈ నెల 3న చ‌లో విజ‌య‌వాడ‌కు ఉద్యోగులు స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. అయితే చ‌లో విజ‌య‌వాడ కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేద‌ని ఇప్ప‌టికే పోలీస్ ఉన్న‌తాధికారులు స్ప‌ష్టం చేశారు. అయిన‌ప్ప‌టికీ విజ‌య‌వాడ‌కు వెళ్లేందుకు ఉద్యోగులు, ప‌లువురు సంఘ నేత‌లు సిద్ధంగా ఉన్నారు. ఈ విష‌యాన్ని ప‌సిగ‌ట్టిన పోలీసులు ఆందోళ‌న‌కారుల‌ను ఎక్క‌డిక‌క్క‌డ అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు.

ఇందులో భాగంగా ఎవ‌రెవ‌రు విజ‌య‌వాడ కార్య‌క్ర‌మంలో పాల్గొనేందుకు వెళుతున్నారో వాలంటీర్లు, ఇత‌ర మార్గాల్లో పోలీసులు స‌మాచారం సేక‌రిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లువురు ఉద్యోగ సంఘాల నేత‌ల ఇంటి వ‌ద్ద‌కు పోలీసులు వెళ్లి చ‌ర్చిస్తున్నారు. ఆందోళ‌న కార్య‌క్ర‌మానికి అనుమ‌తి లేద‌ని, ఇంట్లోనే ఉండాలంటూ గృహ‌నిర్బంధం చేస్తున్నార‌ని స‌మాచారం.

ఈ నేప‌థ్యంలో  సీఎం జ‌గ‌న్ సొంత జిల్లాతో పాటు సొంత నియోజ‌క‌వ‌ర్గ‌మైన పులివెందుల నుంచి ఉద్యోగులు, సంబంధిత నాయ‌కులు విజ‌య‌వాడ‌కు వెళ్ల‌కుండా అడ్డుకునేందుకు రాజ‌కీయంగా కూడా పావులు క‌దుపుతున్నారు. పులివెందుల నుంచి ఎవ‌రైనా ఆందోళ‌న‌లో పాల్గొంటే తీవ్ర ప‌రిణామాలు ఉంటాయ‌నే హెచ్చ‌రిక‌లు పంపిన‌ట్టు స‌మాచారం. ఉద్యోగులు ఇప్ప‌టి వ‌ర‌కూ పులివెందుల తాలూకాలో ఎలాంటి ఆందోళ‌న కార్య‌క్ర‌మాల్లో పాల్గొన‌క‌పోవ‌డానికి ప్ర‌ధానంగా రాజ‌కీయ, పోలీసుల బెదిరింపులే కార‌ణ‌మ‌ని స‌మాచారం.

ఇటీవ‌ల క‌డ‌ప క‌లెక్ట‌రేట్ వ‌ద్ద ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ధ‌ర్నాకు దిగి ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ఇది సీఎంకు అవ‌మాన‌మ‌నే రీతిలో వైసీపీ నాయ‌కులు ఉద్యోగ సంఘాల నేత‌లను ఇప్ప‌టికే హెచ్చ‌రించిన‌ట్టు తెలిసింది. మ‌రోసారి క‌డ‌ప జిల్లాలో ఉద్య‌మం ఉవ్వెత్తున ఎగిసిప‌డుతోంద‌నే ప్ర‌చారం జ‌ర‌గ‌కూడ‌ద‌ని అధికార పార్టీ నేత‌లు శ‌త విధాలా ప్ర‌య‌త్నిస్తున్నారు. 

అయితే తాము ఎట్టి ప‌రిస్థితుల్లో వెన‌క్కి త‌గ్గేది లేద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు తేల్చి చెప్పిన‌ట్టు స‌మాచారం. మొత్తానికి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగుల‌ను క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌భుత్వం చేస్తున్న ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కు స‌త్ఫ‌లితాల‌ను ఇస్తుందో చూడాలి.