జనం మద్దతులేని పోరాటం.. గెలుస్తుందా?

ఉద్యోగులు ప్రత్యక్ష కార్యచరణకు ఉపక్రమిస్తున్నారు. గురువారం ఛలో విజయవాడ నిర్వహిస్తున్నారు. 6వ తేదీనుంచి సమ్మెకు వెళ్లబోతున్నారు. తమ ఉద్యమ కార్యచరణతో ప్రభుత్వం దిగివస్తుందని తమ మాట విని తీరాల్సిందేనని.. పీఆర్సీకి సంబంధించిన జీవోలను రద్దు…

ఉద్యోగులు ప్రత్యక్ష కార్యచరణకు ఉపక్రమిస్తున్నారు. గురువారం ఛలో విజయవాడ నిర్వహిస్తున్నారు. 6వ తేదీనుంచి సమ్మెకు వెళ్లబోతున్నారు. తమ ఉద్యమ కార్యచరణతో ప్రభుత్వం దిగివస్తుందని తమ మాట విని తీరాల్సిందేనని.. పీఆర్సీకి సంబంధించిన జీవోలను రద్దు చేయక తప్పదని వారు నమ్మకంగానే ఉన్నారు. ఆ మాత్రం నమ్మకం లేకపోతే ఉద్యమం చేయడం చాలా కష్టం. అయితే.. వాస్తవంగా జనం మద్దతు లేకుండా.. జనంలోంచి పుట్టని ఒక అవకాశ వాద ఉద్యమం ఎంతకాలం నిలబడుతుంది? ఎంత మేరకు విజయం సాధిస్తుంది? అనేది ఇప్పుడు ఎదురవుతున్న ప్నశ్న.

ఈ సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగులు చేపట్టిన ఉద్యమం, చేస్తున్న పోరాటం చాలా కీలకమైనది. ఇంతకూ ఉద్యోగులు ప్రభుత్వం మీద ఎందుకు పోరాటం చేస్తున్నారు? వారికి వచ్చిన కష్టం ఏమిటి? ఆకలితో అలమటిస్తున్నారా? పూటగడవడం లేదని ప్రభుత్వంతో గొడవ పడుతున్నారా? ఇలాంటి ప్రశ్నలు- వ్యవహారాన్ని తొలినుంచి గమనించని ఎవ్వరికైనా తలెత్తితే ఆశ్చర్యం లేదు. 

ఉద్యోగులు తమ తమ పోరాట కారణాల గురించి ఏమైనా చెప్పవచ్చు గాక. సింగిల్ లైన్ లో వారి పోరాటాన్ని నిర్వచించదలచుకుంటే.. ‘‘మాకు జీతాలు భారీగా పెంచడంలేదు. కొంచెమే పెంచితే ఊరుకునేది లేదు’’ అనేది వారి పోరాటసూత్రం అని అర్థమవుతుంది. రాష్ట్రం అనేక రకాలుగా ఆర్థిక ఇబ్బందులలో కునారిల్లుతోంది. ఎంత ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ.. ఆ ప్రభావం.. జనసామాన్యం మీద పడకుండా ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను కూడా సజావుగా నిర్వహిస్తూ వెళ్తోంది. ఇలాంటి సమయంలో.. ‘‘తాము తలచినంత భారీగా జీతాలు పెంచడం లేదు గనుక.. మేం గోల చేస్తాం’’ అని ఉద్యోగులు ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నారు. 

ఇలాంటి డిమాండ్‌కు, ఇలాంటి పోరాట ఎజెండాకు ప్రజల్లో గౌరవం ఉంటుందా? అనేది ఇప్పుడు మనలో మెదలుతున్న సందేహం. ఇది ప్రజల కోసం జరుగుతున్న పోరాటం గానీ, ప్రజల్లో పుట్టిన ఉద్యమం గానీ కాదు. కేవలం తమ తమ జీతాల పెంపులో, ఆశించినంత దక్కలేదనే భంగపాటు వలన జరుగుతున్న పోరాటం. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే.. రాష్ట్రాల చరిత్రల్లో ఇంత కంటె స్వార్థపూరితమైన కారణాల మీద జరుగుతున్న ఉద్యమం మరొకటి లేదని చెప్పాలి. ఇలాంటి పోరాటానికి ప్రజల మద్దతుగానీ, సానుభూతిగానీ ఎందుకు ఉంటుంది. 

అసలే ప్రభుత్వ ఉద్యోగుల మీద ప్రజల్లో సానుభూతి లేదు. ప్రభుత్వ కార్యాలయాలతో ఏ చిన్న పని పడినా.. లంచాలు ఇవ్వకుండా నెరవేరగలదనే నమ్మకం ఎవ్వరికీ లేదు. లంచం ఇవ్వకుండా పని చేసుకున్న అనుభవం కూడా ఎవ్వరికీ లేదు. కళ్లు చెదిరే జీతాలు తీసుకుంటూ.. ప్రతి చిన్న పనికీ లంచాల రూపంలో ఆమ్యామ్యాలు స్వీకరిస్తూ ఉండే ఉద్యోగులు తమ స్వార్థం కోసం .. జీతాల కోసం చేసే పోరాటానికి ప్రజలు ఎందుకు గౌరవం ఇస్తారు. 

అందుకే.. ప్రభుత్వం కూడా ఉద్యోగుల ఉద్యమ ప్రకటన పరిణామాలను ప్రశాంతంగా, స్థిరంగా, బెదిరిపోకుండా గమనిస్తోంది. ప్రజల మద్దతు లేకుండా.. ఉద్యోగులు ఎంతకాలం తమ పోరాటాన్ని కొనసాగించగలరో చూడాలి. ప్రజల సానుభూతి లేకపోవడం స్థానే వారికి ప్రజల ఛీత్కారాలు కూడా తప్పని పరిస్థితి వస్తుంది. ఆలోగా ఉద్యోగులు మేలుకుని ప్రభుత్వంతో సంయమన ధోరణి పాటిస్తే మంచిది. లేకపోతే వారికే చేటు జరుగుతుంది.