ఉక్కు మీద కాసింత చిలకరింపు…?

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని గత బడ్జెట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగానే చెప్పారు. ఈసారి కూడా బడ్జెట్ లో చూసుకుంటే ప్రైవేటీకరణ మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు.…

విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేట్ పరం చేస్తామని గత బడ్జెట్ లో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ గట్టిగానే చెప్పారు. ఈసారి కూడా బడ్జెట్ లో చూసుకుంటే ప్రైవేటీకరణ మీదనే ఎక్కువగా ఫోకస్ పెట్టారు. దీంతో ఏడాదిగా ఉక్కు కర్మాగారం కోసం పోరాడుతున్న ఉద్యమ సంఘాలు కేంద్ర వైఖరి మీద మండిపడుతున్నాయి. విశాఖ ఉక్కుపై వేటు పడితే ఒప్పుకునేది లేదు అని కూడా ఖండితంగా చెప్పేస్తున్నారు.

ఇదిలా ఉండగా విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం ఆ అయోయమాన్ని కంటిన్యూ చేస్తూనే బడ్జెట్ లో 910 కోట్ల రూపాయలను కేటాయించింది. దాంతో ప్రైవేటీకరణ ఉంటుందా ఉండదా అన్నదే కార్మికులకు అర్ధం కావడం లేదుట. నిజానికి ప్రైవేట్ పరం చేసే కర్మాగారానికి నిధులు కేటాయింపు అంతగా అవసరం లేదు. అయితే ఇచ్చినవి కూడా అరకొర నిధులే. దీని వల్ల మొత్తానికి మొత్తం ప్లాంట్ అభివృద్ధి అయితే ఏమీ జరిగిపోదు,

కానీ ప్లాంట్ మీద తమకు ప్రేమ ఉందని చెప్పుకోవడానికి అన్నట్లుగా నిధులు ఇచ్చారు అని ఉద్యమకారులు  అంటున్నారు. అదే టైమ్ లో ప్లాంట్ ని ప్రైవేటీకరించబోమని గట్టిగా చెప్పలేకపోతున్నారు. దీనిని బట్టి చూస్తూంటే స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్రం వైఖరి కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేదిగా ఉందని అంటున్నారు.

ఇక విశాఖకు సంబంధించి అనేక కేంద్ర సంస్థలకు కూడా పెద్దగా కేటాయింపులేవీ లేవు. గిరిజన‌ వర్శిటీని గతంలో కేటాయించిన 55 కోట్లలో కూడా ఈసారి కోత పెట్టారు. మొత్తానికి చూస్తే విశాఖ ప్రగతికి ఏమీ చేయని బడ్జెట్ గానే ఇది ఉందని మేధావులు, విద్యావేత్తలు అంటున్నారు.