ఉద్యోగులపై లాఠీలు విరిగితే ప్రభుత్వానికి క్షేమమేనా..?

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంది. అడిగినదానికంటే ఎక్కువ ఐఆర్ ఇచ్చి జగన్ దేవుడు అనిపించుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కలిపేసుకుని ఎవరూ చేసని సాహసం చేశారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగులు…

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఉద్యోగులను కడుపులో పెట్టుకుని చూసుకుంది. అడిగినదానికంటే ఎక్కువ ఐఆర్ ఇచ్చి జగన్ దేవుడు అనిపించుకున్నారు. ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కలిపేసుకుని ఎవరూ చేసని సాహసం చేశారు. కరోనా కష్టకాలంలో ఉద్యోగులు ఆ కృతజ్ఞత చూపించారు కూడా. 

బయట వైరస్ భయపెడుతున్నా.. ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్రాణాలకు తెగించి విధులకు హాజరయ్యారు. ప్రజల ప్రాణాలు కాపాడారు, వ్యాక్సినేషన్లు టార్గెట్లు రీచ్ అయ్యారు, ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. కానీ ఇప్పుడే పీఆర్సీ గొడవ మొదలైంది. ఉద్యోగులు ఎక్కువ ఆశించారు, ప్రభుత్వం ఆ స్థాయిలో న్యాయం చేయలేనంది. పీటముడి పడింది. చివరకు సమ్మె వరకు వ్యవహారం ముదిరింది. ముందు ముందు ఏం జరుగుతుంది.

ఇప్పటి వరకైతే ఏపీలో ఉద్యోగులపై అనుకున్న స్థాయిలో క్రమశిక్షణ చర్యలేవీ మొదలు కాలేదు, హౌస్ అరెస్ట్ లు మినహా లాఠీలు విరగలేదు. ముఖ్యమంత్రి జగన్ పై ఐటమ్ సాంగ్ రాసి పాడినా సోషల్ మీడియాలో ట్రోలింగ్ మొదలైంది కానీ, వారిపై క్రమశిక్షణ చర్యలు కానీ, లీగల్ యాక్షన్ కానీ ఏదీ లేదు. కానీ ఇప్పుడు ఉద్యోగిపై లాఠీ విరిగే పరిస్థితి వస్తోంది.

చలో విజయవాడపై రెండు వర్గాలు పంతాలకు పోతున్నాయి. 5 వేలమందితో బహిరంగ సభకు అనుమతి కోరి లక్షమందిని తరలించాలని ఉద్యోగ సంఘాల నేతలు చూస్తున్నారు. బెజవాడలో కొవిడ్ నిబంధనలు ఉన్నాయి, 144 సెక్షన్ అమలులో ఉందంటూ సభకు అనుమతి లేదని స్పష్టం చేశారు నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా. ఈ దశలో ఘర్షణ అనివార్యం అని తేలుతోంది. మరి ఉద్యోగిపై లాఠీ విరిగితే అది ప్రభుత్వానికి క్షేమమేనా..?

మధ్యే మార్గం లేనే లేదా..?

మాకు జీతాలు తగ్గాయని ఉద్యోగులంటున్నారు, కాదు పెరిగాయని ప్రభుత్వం చెబుతోంది. మధ్యలో జనం మాత్రం ఏది నమ్మాలో, ఏది నమ్మకూడదో అని డైలమాలో ఉన్నారు. మాకెందుకు లెమ్మంటూ తమ తని తాము చేసుకుంటున్నారు. ఇంతకీ జీతాలు నిజంగానే పెరిగాయా.. పెరిగితే కనీసం ఉద్యోగులకు ఆ విషయం ప్రభుత్వం అర్థమయ్యేలా ఎందుకు చెప్పలేకపోతోంది. పోనీ తగ్గాయా.. మరి పెరిగిన పే స్లిప్పులంటూ ప్రభుత్వం చెబుతున్న మాటలు అసత్యమా..? ఎందుకీ పంతాలు, ఏమిటీ పట్టింపులు.

ప్రభుత్వం-ఉద్యోగులు కొట్టుకుంటే తమషా చూడాలని గోతికాడ నక్కల్లా కాచుకు కూర్చున్నాయి ప్రతిపక్షాలు, వారి అనుకూల మీడియా. కనీసం ఈ విషయంలో అయినా ప్రభుత్వం అవగాహనతో ఉందా. ఛలో విజయవాడను అడ్డుకోవాలనుకుంటున్నారు సరే, ఆ క్రమంలో ఏ వర్గం కాస్త శృతి మించినా, ఎవరికి జరగరాని నష్టం జరిగినా బాధ్యులెవరు..? ఉద్యోగులపై లాఠీ విరిగితే అది ప్రభుత్వానికి మంచిదేనా..?