వైసీపీ తెలివైన ప‌ని

మ‌తం పేరుతో జ‌నాల్ని రెచ్చ‌గొట్టే అవ‌కాశాన్ని బీజేపీకి ఇవ్వ‌కుండా అధికార వైసీపీ తెలివిగా న‌డుచుకుంది. చాలా అరుదుగా వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తుంటుంది. అందులో ఇది ఒక‌టి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ బ‌ల‌ప‌డాల‌ని చూస్తోంది. అయితే…

మ‌తం పేరుతో జ‌నాల్ని రెచ్చ‌గొట్టే అవ‌కాశాన్ని బీజేపీకి ఇవ్వ‌కుండా అధికార వైసీపీ తెలివిగా న‌డుచుకుంది. చాలా అరుదుగా వైసీపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తుంటుంది. అందులో ఇది ఒక‌టి. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ బ‌ల‌ప‌డాల‌ని చూస్తోంది. అయితే కేంద్రంలో అధికారం చెలాయిస్తున్న బీజేపీ ఏపీకి నామమాత్రం కూడా మంచి చేయ‌డం లేదు. పైగా విభ‌జ‌న హామీలు, జాతీయ ప్రాజెక్టు పోల‌వ‌రం నిర్మాణానికి ఆర్థికంగా అడ్డంకులు సృష్టిస్తుండ‌డం… ఏపీలో బీజేపీ ఎదుగుద‌ల‌కు అవ‌రోధాల‌య్యాయి.

ఏపీలో బ‌ల‌ప‌డేందుకు బీజేపీ న‌మ్ముకున్న, ఎంచుకున్న ఏకైక అంశం మ‌తం. ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ క్రిస్టియ‌న్ కావ‌డాన్ని అవ‌కాశంగా తీసుకుని, మ‌త విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌ని బీజేపీ కృషి చేస్తోంది. ఇందులో భాగంగా ఏపీలో హిందువుల ఆల‌యాల ధ్వంసం, అలాగే ర‌థాలు, విగ్ర‌హాల‌ను అధికార పార్టీ అండ‌తో త‌గ‌ల‌బెతున్నారంటూ బీజేపీ నానాయాగీ చేయ‌డాన్ని చూశాం.

ఈ క్ర‌మంలో గుంటూరులో జిన్నా ట‌వ‌ర్‌ను ఓ అస్త్రంగా బీజేపీ ఎంచుకుంది. జిన్నా ట‌వ‌ర్ ఏర్పాటుకు సంబంధించి చారిత్ర‌క నేప‌థ్యాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోకుండా ర‌చ్చ‌కు దిగింది. సున్నిత‌మైన అంశం కావ‌డంతో అధికార పార్టీ వైసీపీ జాగ్ర‌త్త‌గా అడుగులు వేసింది. ఇటీవ‌ల జిన్నా ట‌వ‌ర్‌ను కూల‌గొట్టేందుకు, అలాగే దానిపై జాతీయ జెండా ఎగుర‌వేత పేరుతో బీజేపీ చేసిన కుట్ర రాజ‌కీయానికి వైసీపీ చ‌ర‌మ గీతం పాడింది.

జిన్నా ట‌వ‌ర్‌కు జాతీయ జెండా రంగులే వేసి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపారు. గుంటూరు మేయ‌ర్ కావ‌టి శివ‌నాగ మ‌నోహ‌ర్ నాయుడు, తూర్పు ఎమ్మెల్యే మ‌హ‌మ్మ‌ద్ ముస్త‌ఫా గుంటూరు న‌గ‌ర వాసుల అభిప్రాయాల‌ను తీసుకున్నారు. అనంత‌రం ట‌వ‌ర్‌కు  కాషాయం, తెలుపు, ఆకుప‌చ్చ రంగులు వేయించారు. అంతేకాదు, ఈ నెల 3న జిన్నా ట‌వ‌ర్ వ‌ద్ద‌ జాతీయ జెండా ఎగుర వేయాల‌ని తీర్మానించ‌డంపై స‌ర్వ‌త్రా హ‌ర్షం వ్య‌క్త‌మ‌వుతోంది. 

వైసీపీ ప్ర‌భుత్వం త‌గిన స‌మ‌యంలో స‌రైన నిర్ణ‌యం తీసుకుని బీజేపీ మ‌త విద్వేష రాజ‌కీయాల‌కు ఆదిలోనే స‌మాధి క‌ట్టింద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.