రిలీజ్ డేట్ సెట్ చేసిన రాధేశ్యామ్

రెండు రోజులుగా నలుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టింది రాధేశ్యామ్ యూనిట్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా మార్చి 11న విడుదల కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అంతకంటే ముందు ఈ సినిమా ఓటీటీలో…

రెండు రోజులుగా నలుగుతున్న చర్చకు ఫుల్ స్టాప్ పెట్టింది రాధేశ్యామ్ యూనిట్. ప్రభాస్ హీరోగా నటిస్తున్న రాధేశ్యామ్ సినిమా మార్చి 11న విడుదల కాబోతున్నట్టు అధికారికంగా ప్రకటించింది. అంతకంటే ముందు ఈ సినిమా ఓటీటీలో నేరుగా స్ట్రీమింగ్ కు రాబోతోందనే ప్రచారం జరిగింది. తాజా పోస్టర్ తో దానిపై కూడా క్లారిటీ ఇచ్చింది. మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో మాత్రమే రాధేశ్యామ్ వస్తుందని ప్రకటించింది.

మిగతా సినిమాల టైపులో రెండు రిలీజ్ డేట్స్ పద్ధతి ఫాలో అవ్వలేదు రాధేశ్యామ్ యూనిట్. ఇప్పటికే ఓసారి సంక్రాంతి బరి నుంచి సినిమాను తప్పించిన మేకర్స్.. ఈసారి ప్లాన్-ఏ, ప్లాన్-బి లాంటి పద్ధతులకు పోకుండా, నేరుగా ఒకే విడుదల తేదీ ప్రకటించారు. అటు బాలీవుడ్ ప్రముఖులతో, ఇటు టాలీవుడ్ నిర్మాతలతో పూర్తిస్థాయిలో సంప్రదించిన తర్వాత విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు.

రాధేశ్యామ్ రాకతో మార్చి నెల బాక్సాఫీస్ సందడిగా మారింది. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ విడుదల తేదీని లాక్ చేశారు. మార్చి 25న ఆ సినిమా థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పుడు ఆ సినిమా కంటే 2 వారాల ముందు రాధేశ్యామ్ షెడ్యూల్ అయింది. దీంతో మార్చి నెలలో మరో పెద్ద సినిమాకు చోటు లేనట్టే.

రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్ తమ విడుదల తేదీల్ని పక్కాగా ప్రకటించడంతో ఇప్పుడు మిగతా సినిమాలు ప్రత్యామ్నాయాలు వెదుక్కోవాల్సిన పరిస్థితి. పక్కా కమర్షియల్, రామారావు ఆన్ డ్యూటీ లాంటి సినిమాల్ని మార్చి నెలలో విడుదల చేయాలని అనుకున్నారు. ఇప్పుడీ రెండు సినిమాలు ఏప్రిల్ లేదా మే నెలకు వాయిదా పడేలా ఉన్నాయి.

ప్రభాస్-పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా నటించిన సినిమా రాధేశ్యామ్. యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై రాథాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కింది ఈ భారీ బడ్జెట్ మూవీ. ప్రేమకు, విధికి మధ్య జరిగే పోరాటంగా ఈ సినిమాను అభివర్ణిస్తున్నారు. ఇందులో చేయి చూసి పక్కాగా జాతకం చెప్పే వ్యక్తిగా కనిపించబోతున్నాడు ప్రభాస్.