జ‌గ‌న్ స‌ర్కార్‌పై ఎత్తుకు పైఎత్తు!

జ‌గ‌న్ స‌ర్కార్ ఎత్తుకు ఉద్యోగ సంఘాలు పైఎత్తు వేశాయి. నూత‌న పీఆర్సీపై ఉద్యోగులు, ప్ర‌భుత్వం మ‌ధ్య వివాదం నెల‌కున్న సంగ‌తి తెలిసిందే. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నూత‌న పీఆర్సీని అంగీక‌రించేది లేద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు…

జ‌గ‌న్ స‌ర్కార్ ఎత్తుకు ఉద్యోగ సంఘాలు పైఎత్తు వేశాయి. నూత‌న పీఆర్సీపై ఉద్యోగులు, ప్ర‌భుత్వం మ‌ధ్య వివాదం నెల‌కున్న సంగ‌తి తెలిసిందే. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నూత‌న పీఆర్సీని అంగీక‌రించేది లేద‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు స్ప‌ష్టం చేశారు. ప్ర‌భుత్వం కూడా అంతే ప‌ట్టుద‌ల‌తో ఉంది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్న‌ట్టు నూత‌న పీఆర్సీ జీవోల‌ను వెన‌క్కి తీసుకునేది లేద‌ని, కొత్త వేత‌నాల‌ను వేస్తామ‌ని ప్ర‌క‌టించింది. తాను చెప్పిన‌ట్టే ప్ర‌భుత్వం చేసుకుపోతోంది.

అయితే ఉద్యోగుల ఉద్య‌మాన్ని నీరుగార్చేందుకు ప్ర‌భుత్వం వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించింది. ఉద్యోగుల‌పై ప్ర‌జానీకంలో వ్య‌తిరేక‌త పెంచే క్ర‌మంలో చ‌ర్చ‌ల అంశాన్ని తెర‌పైకి తెచ్చింది. ఏపీ స‌చివాల‌యంలో చ‌ర్చ‌ల పేరుతో మంత్రుల క‌మిటీ వ‌రుస‌గా నాలుగు రోజుల పాటు ఎదురు చూసింది. అయిన‌ప్ప‌టికీ ఉద్యోగ సంఘాలు వెన‌క్కి త‌గ్గ‌లేదు. మంత్రుల క‌మిటీతో చ‌ర్చించేందుకు పీఆర్సీ సాధ‌న స‌మితి నేత‌లు స‌సేమిరా అన్నారు.

ఇదే క్ర‌మంలో అస‌లు చ‌ర్చ‌ల‌కే వెళ్ల‌క‌పోతే ఉద్యోగుల స‌మ‌స్య‌లు ఎలా ప‌రిష్కారం అవుతాయ‌ని ఇటు న్యాయ‌స్థానంతో పాటు పౌర స‌మాజం నుంచి ప్ర‌శ్న‌లు వెల్లువెత్తాయి. ఉద్యోగులు బ్లాక్‌మెయిల్‌కు పాల్ప‌డుతున్నార‌నే వ్య‌తిరేక‌త ప్ర‌జ‌ల్లో పెరగ‌డాన్ని ఉద్యోగ సంఘాలు గ్ర‌హించాయి. దీంతో ఉద్యోగ సంఘాలు త‌మ పంథా మార్చుకుని, ఒక మెట్టు వెన‌క్కి త‌గ్గిన‌ట్టు వ్య‌వ‌హ‌రించాయి. ఈ నేప‌థ్యంలో ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు జ‌రిపేందుకు ఉద్యోగ సంఘాల నేత‌లు ముందుకొచ్చారు.

ఈ సంద‌ర్భంగా మంత్రుల క‌మిటీ ఎదుట ప్ర‌ధానంగా మూడు డిమాండ్ల‌ను ఉద్యోగ సంఘాల నేత‌లు పెట్టారు. జ‌న‌వ‌రికి పాత జీతాలు ఇవ్వాల‌ని, పీఆర్సీ ఉత్త‌ర్వులు నిలుపుద‌ల చేయాల‌ని , అశుతోష్‌మిత్ర నివేదిక బ‌హిర్గ‌తం చేయాలంటూ మూడు డిమాండ్ల‌ను మంత్రుల క‌మిటీ ముందు ఉద్యోగ సంఘాల నేత‌లు బ‌లంగా వినిపించారు.

ఈ మూడింటిపై త‌మ అభిప్రాయం చెప్పేందుకు స‌మ‌యం కావాల‌ని, అంత వ‌ర‌కూ స‌చివాల‌యంలోనే వెయిట్ చేయాల‌ని ఉద్యోగ సంఘాల నేత‌ల‌తో మంత్రుల క‌మిటీ చెప్పింది. చివ‌రికి చావు క‌బురు చ‌ల్ల‌గా అన్న‌ట్టు… ప్ర‌భుత్వ స‌ల‌హాదారు స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి నుంచి క‌బురు. డిమాండ్ల‌ను ప‌రిష్క‌రించ‌డం సాధ్యం కాద‌ని తెగేసి చెప్పారు. దీంతో ప్ర‌భుత్వంతో చ‌ర్చ‌లు విఫ‌ల‌మ‌య్యాయి. అస‌లు చ‌ర్చ‌ల‌కే ముందుకు రాలేద‌నే చెడ్డ‌పేరును మూట‌క‌ట్టుకోవ‌డం ఎందుక‌ని ఉద్యోగ సంఘాల నేత‌లు ఆలోచించి, ఆ త‌ర్వాత బాల్‌ను మంత్రుల క‌మిటీ ప‌రిధిలోకే నెట్ట‌డం వ్యూహాత్మ‌క ఎత్తుగ‌డ‌గా చెప్పొచ్చు.  

ఈ నేప‌థ్యంలో ఉద్య‌మాన్ని కొన‌సాగించేందుకు పీఆర్సీ సాధ‌న స‌మితి నిర్ణ‌యించింది. ఇందులో భాగంగా బుధ‌వారం ప్లే స్లిప్స్ ద‌హ‌నం, 3న చ‌లో విజ‌య‌వాడ‌, 6వ తేదీ అర్ధ‌రాత్రి నుంచి స‌మ్మెలోకి వెళ్లాల‌ని ఉద్యోగులు నిర్ణ‌యించారు. చ‌ర్చ‌లు విఫ‌ల‌మైన నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ర్కార్ త‌ర్వాత వ్యూహం ఏంట‌నేది చ‌ర్చ‌నీయాంశ‌మైంది.