తిరుపతి ఉప ఎన్నిక నేపథ్యంలో మిత్రపక్షమైన జనసేనకు బీజేపీ గట్టి షాక్ ఇవ్వనుంది. ఉప ఎన్నికలో విజయం సాధించేందుకు ప్రత్యర్థి పార్టీల నుంచి వలసలను ప్రోత్సహించడం సహజమే. అయితే మిత్ర పక్ష పార్టీ నాయకుడిని చేర్చుకునేందుకు బీజేపీ నేతలు పావులు కదుపుతుండడం గమనార్హం.
మాజీ ఎమ్మెల్యే, టీటీడీ మాజీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తిని పార్టీలోకి చేర్చుకునేందుకు బీజేపీ నేతలు చర్చలు సాగిస్తు న్నారు. టీడీపీ తరపున తిరుపతి నుంచి చదలవాడ కృష్ణమూర్తి ఎమ్మెల్యేగా గెలుపొందారు.
అలిపిరి మందుపాతర ఘటనలో చంద్రబాబుతో పాటు చదలవాడ కృష్ణమూర్తి కూడా గాయాలపాలయ్యారు. వ్యక్తిగతంగా నిజాయితీపరుడిగా ఆయనకు పేరు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్ట మొదట టీటీడీ చైర్మన్‌గా ఆయన్ను నియమించారు.
ఆ తర్వాత టీడీపీలో అంతర్గత కుమ్మలాటల కారణంగా ఆయన పార్టీకి దూరమయ్యారు. గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఆయన జనసేనలో చేరారు.
2019 సార్వత్రిక ఎన్నికల్లో ఆయన తిరుపతి అసెంబ్లీ స్థానం నుంచి జనసేన తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అనంతరం పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఈ నేపథ్యంలో తిరుపతి ఉప ఎన్నిక రానుండడంతో మరోసారి రాజకీయం వేడెక్కుతోంది.
వివిధ పార్టీల్లోని అసంతృప్తులు బయటపడుతున్నాయి. తనను పార్టీలో పట్టించుకోలేదనే అసంతృప్తితో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ గాలి వీస్తున్న నేపథ్యంలో ఆ పార్టీలో చేరడం మంచిదని చదలవాడ ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది.
దీంతో బీజేపీ నేతలతో చదలవాడ జరిపిన చర్యలు దాదాపు సఫలం అయ్యాయని తెలుస్తోంది. త్వరలో జనసేన నుంచి బీజేపీలో చేరే అవకాశాలు స్ఫష్టంగా కనిపిస్తున్నాయి. ఇదే జరిగితే మాత్రం మిత్రపక్షమైన జనసేనకు బీజేపీ షాక్ ఇచ్చినట్టే అని అర్థం చేసుకోవాల్సి వుంటుంది.