ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మొదటి రోజు నుంచి సంక్షేమమే లక్ష్యంగా దూసుకుపోతున్న సీఎం జగన్, ఈరోజు మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ పథకం పేరు జగనన్న తోడు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న చిరు వ్యాపారులకు ఇది వరం.
జగనన్న తోడు పథకంలో భాగంగా చిరు వ్యాపారాలు చేసుకునే ప్రతి ఒక్కరికి 10వేల రూపాయల వడ్డీ లేని రుణం అందించబోతోంది ప్రభుత్వం. ఈ పథకం కింద ఇప్పటివరకు 10 లక్షల దరఖాస్తులు అందగా.. వీళ్ల నుంచి 6 లక్షల 40వేల మందిని అర్హులుగా గుర్తించింది ప్రభుత్వం.
వీళ్లందరికీ ఈరోజు వివిధ బ్యాంకుల నుంచి సున్నా వడ్డీకి 10వేల రూపాయల రుణం అందబోతోంది. ఈ మేరకు తొలి విడతగా వెయ్యి కోట్ల రూపాయల నిధుల్ని కేటాయించింది ఏపీ సర్కారు. అంతేకాదు, ఈ పథకం కింద రుణం పొందిన వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులు ఇవ్వబోతోంది.
అర్హుల ఎంపికను నిరంతర ప్రక్రియగా జరపాలని ఇప్పటికే అధికారులకు ఆదేశించారు జగన్. ఒక్కసారి లబ్దిదారుల ఎంపిక పూర్తయిన తర్వాత పథకం వర్తింపు ఆగిపోదని, ఈ పథకం కింద ఎవ్వరైనా, ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చని స్పష్టంచేశారు. ఈ మేరకు ఇప్పటికే లబ్దిదారుల్ని గుర్తించే సర్వే క్షేత్రస్థాయిలో పూర్తికాగా.. ఎవరైనా ఎప్పుడైనా ఇందులో చేరేలా నిబంధనల్ని సవరించారు.
గ్రామాలు, పట్టణాల్లో 5 అడుగుల పొడవు, 5 అడుగుల వెడల్పుతో శాశ్వత లేదా తాత్కాలిక షాపు ఏర్పాటుచేసున్న వాళ్లంతా ఈ పథకానికి అర్హులు. రోడ్లపై కూరగాయలు, ఇతర వస్తువులు అమ్ముకునే వాళ్లు.. తోపుడు బండ్లు వ్యాపారులు, నెత్తిన బుట్ట పెట్టుకొని అమ్ముకునే వాళ్లు కూడా ఈ పథకం కిందకు వస్తారు. ఒకవేళ అర్హులకు బ్యాంక్ ఖాతా లేకపోతే, పొదుపు ఖాతా ఓపెన్ చేసే బాధ్యతను వాలంటీర్లకు అప్పగించారు.
అన్ని పథకాల్లానే ఈ పథకానికి సంబంధించిన అర్హుల జాబితాను కూడా గ్రామ/వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంచుతారు. కాబట్టి ఈ పథకంలో కూడా పూర్తి పారదర్శకత ఉంటుంది.