మహిళలపై అత్యాచారాలనేవి ఓ ప్రపంచ సమస్య. మర్మ స్థానం కాదది, జన్మస్థానమని ఎవరెన్ని హితబోధనలు చేసినా కొందరు కామాంధులు తమ వ్యవహారశైలి మార్చుకోవడం లేదు.
మహిళలపై అత్యాచారాలను అరికట్టేందుకు ఒక్కో దేశంలో ఒక్కో రకమైన కఠిన చట్టాలను తీసుకొచ్చారు, తీసుకొస్తున్నారు. మన దేశంలో నిర్భయ చట్టం తీసుకొచ్చినప్పటికీ అఘాయిత్యాలు ఆగడం లేదు.
గత ఏడాది ఇదే నెలలో హైదరాబాద్ శివార్లలో దిశపై సామూహిక హత్యాచారం జరిగింది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా తీవ్ర సంచలనం రేకెత్తించింది. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రాస్‌లో దళిత యువతిపై సాగిన దారుణ సామూహిక హత్యాచారం మరోసారి భారతావని అట్టుడికేలా చేసింది.
ఇదిలా ఉండగా పాకిస్థాన్‌లో అత్యాచారాలను అరికట్టేందుకు ఆ దేశ ప్రభుత్వం కఠిన చట్టాన్ని అమలు చేసేందుకు సమాయత్తం అవుతోంది. అత్యాచారానికి పాల్పడితే ఇక శాశ్వతంగా నపుంసకులుగా మార్చే చట్టాన్ని పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకరానుంది.
ఈ మేరకు పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ సూత్రప్రాయ అంగీకారాన్ని తెలిపారు. రసాయనాల సాయంతో నపుంసకులుగా మార్చేలా చట్టంలో రూపొందించారని తెలుస్తోంది. ఈ చట్టం ఆ దేశంలో ఎలాంటి ఫలితాలు ఇస్తుందో చూడాలి.