తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాద్ ఆకస్మిక మృతితో ఆ స్థానానికి రెండు మూడు నెలల్లో ఉప ఎన్నిక జరగనుంది. దీంతో ఈ ఎన్నికల్లో ఎలాగైనా సత్తా చాటాలని అన్ని పార్టీలు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాయి.
ఈ నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ సీట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పలు అంశాలపై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో పాటు ఇతర అగ్రనేతలతో చర్చించేందుకు జనసేనాని పవన్‌కల్యాణ్ నిన్న ఢిల్లీ వెళ్లారు. తనతో పాటు పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌ను కూడా వెంట తీసుకెళ్లారు.
గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం భేషరతుగా మద్దతు ఇచ్చిన నేపథ్యంలో తిరుపతి పార్లమెంట్ టికెట్‌ను తమ పార్టీకి విడిచిపెట్టాలని బీజేపీ అగ్రనేతలతో చర్చించి, ఒప్పించేందుకు పవన్ ఢిల్లీ వెళ్లారనే ప్రచారం జరుగుతోంది.
ఈ నేపథ్యంలో మంగళవారం ఆయన జేపీ నడ్డాతో పాటు అమిత్‌షాత్‌ను కలిసి కీలక చర్చలు జరుపుతారని జనసైనికులు ఎంతో ఆశించారు. ఒకవేళ చర్చించిన తర్వాత ఫలితాలు ఏవైనా కావచ్చు. అదే వేరే సంగతి.
అయితే అసలు తమను కలవడానికి కూడా పవన్‌కు బీజేపీ అగ్రనేతలు అపాయింట్‌మెంట్ ఇవ్వకపోవడం జనసైనికులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఇది ముమ్మాటికీ తమ నేతను అవమానపరచడమే అనే అభిప్రాయాలు ఆ పార్టీ శ్రేణుల నుంచి వినిపి స్తున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో అగ్రహీరోగా, పవర్‌స్టార్‌గా పిలుపించుకునే పవన్‌కల్యాణ్‌ను …బీజేపీ పెద్దలు పవరలెస్ స్టార్‌గా మార్చారని జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
లక్షలాది మంది అభిమానించే ఒక నాయకుడికి ఢిల్లీ బీజేపీ పెద్దలు కనీసం అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. కనీసం అపాయింట్‌మెంటే ఇవ్వని బీజేపీ పెద్దలు ఇక తిరుపతి టికెట్ ఏమిస్తారని జనసైనికులు ఆక్రోశంతో ప్రశ్నిస్తున్నారు. మరి బుధవారమైనా పవన్‌కు బీజేపీ అగ్రనేతల దర్శన భాగ్యం దక్కుతుందో లేదో మరి!