టీడీపీ అధినేత చంద్రబాబు స్వభావాన్ని భవిష్యత్ తరాలకు తెలియజెప్పేందుకు, ఆయనకు సంబంధించి జ్ఞాపకాలను ఓ మ్యూజియంలో పెట్టాలి. ఎందుకంటే ఏదేతై తాను చేయాల్సింది చేయరో, అదే ఇతర పాలకులు చేయాలని డిమాండ్ చేస్తారు.
అది చేయకపోతే భయపడ్డారని విమర్శిస్తారు. ఇదనే కాదు, ఆయన మాట్లాడే ఏ అంశమైనా …మాటలకు, చేతలకు పూర్తి విరుద్ధంగా ఉంటుంది. ఇక ప్రజాస్వామ్యం, స్వేచ్ఛ గురించి బాబు చెప్పే సూక్తులు ఏ ప్రవచనకారులు కూడా అంతలా వల్లించి ఉండరేమో!
అర్రె తన హయాంలో ఇలా చేశానే, ఇప్పుడు ఇట్ల మాట్లాడితే ప్రజలు నవ్విపోతారనో, ఛీత్కరించుకుంటారనే భావన ఏ మాత్రం ఆయనలో ఉండదు. అందుకే ఇలాంటి అరుదైన మనిషి గురించి రానున్న తరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పడం.
స్థానిక సంస్థల ఎన్నికలనే తీసుకుందాం. టీడీపీ మండల కమిటీలతో చంద్రబాబు వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ విచిత్ర విమర్శను చర్చకు పెట్టారు.
స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగితే గెలవలేమనే భయంతోనే వాటి నిర్వహణకు వైసీపీ వెనుకంజ వేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో ఆ పార్టీపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఇప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అంతా ఏకమై ఓడిస్తారని ఆందోళన ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోందని ఆయన చెప్పుకొచ్చారు.
ప్రజలు తిరగబడితే డబ్బులు, అధికార బలం పనిచేయదనే వాస్తవాన్ని వైసీపీ నేతలు గుర్తించుకోవాలని బాబు హెచ్చరించారు. అసలు స్థానిక సంస్థలు తన హయాంలో 2018లోనే జరగాల్సిన విషయాన్ని తనకు అనుకూలంగా మరిచిపోయారు.
మరి అప్పట్లో తాను భయపడే స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగలేదని బాబు పరోక్షంగా అంగీకరించినట్టేనా? సార్వత్రిక ఎన్నికల ముంగిట స్థానిక సంస్థల ఎన్నికల్లో తన ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని వెల్లడైతే … అసలుకే ఎసరు వస్తుందనే భయంతో అప్పట్లో చంద్రబాబు స్థానిక సంస్థల ఎన్నికల ఊసే ఎత్తలేదు.
ఇప్పుడు రాజ్యాంగం, చట్టం అంటూ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఉవ్విళ్లూరుతున్న ఎన్నికల అధికారే… అప్పట్లో కూడా ఉన్నారు. బాబు ప్రయోజనాలు తప్ప, ప్రజా ప్రయోజనాలు పట్టని ఆ అధికారికి, ఇప్పుడు మాత్రం అచ్చం బాబులాగే అన్నీ గుర్తుకొస్తున్నాయి.
అప్పట్లో భయంతో తాను స్థానిక సంస్థల ఎన్నికలు జరపకపోయినా, ఆ తర్వాత సార్వత్రిక ఎన్నికల్లో తన డబ్బు, అధికారం పనిచేయలేదనే అనుభవంతో … ఇప్పుడా నీతులు చెబుతున్నట్టు కనిపిస్తోంది.