ఢిల్లీ పెద్దలు పిలిచారా, లేక తనే అపాయింట్ మెంట్ కోరి అక్కడికి వెళ్లారా అనే విషయం తెలియదు కానీ మొత్తమ్మీద పవన్ కల్యాణ్ మాత్రం హడావిడిగా హస్తినకు వెళ్లారు.
ఢిల్లీకి వెళ్లినంత స్పీడ్ గా.. అక్కడ బీజేపీ నేతల ఆఫీస్ లోకి మాత్రం జనసేనానికి ఎంట్రీ దొరకలేదు. ఒక రోజంతా వేస్ట్ అయింది. ఇప్పటివరకు పవన్ కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దర్శనం దొరకలేదు.దీంతో పవన్ పర్యటనపై ఓ రకమైన గందరగోళం నెలకొని ఉంది.
అసలింతకీ పవన్ ఢిల్లీ ఎందుకు వెళ్లారు? తిరుపతి టికెట్ సాధించుకుని వస్తారా? గ్రేటర్ ప్రచారానికి ఉపదేశం తీసుకుని వెనుదిరుగుతారా? అసలు ఏదీ లేకుండా మరోసారి డ్రామా పండించేందుకే ఆయన ఢిల్లీ వెళ్లారా? బొకే ఇచ్చేసి, ఇదో కర్టసీ కాల్ అనుకుంటూ ఎంచక్కా వచ్చేస్తారా?
ఢిల్లీలో స్వెట్టర్ వేసుకుని పవన్ పుస్తకాలు చదువుకునే ఫొటోల కోసం జనసైనికులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈలోగా సోషల్ మీడియాకు మాత్రం పవన్ బాగా టార్గెట్ అయ్యారు.
అంతన్నాడింతన్నాడే.. అంటూ పవన్ ఢిల్లీ పర్యటనపై ట్రోలింగ్ జరుగుతోంది. పవన్ కి అపాయింట్ మెంట్ దక్కలేదని, ఆయన నిరాశగా వెనుదిరుగుతున్నారని, వెంటనే వెనక్కి వచ్చేస్తే బాగోదని మరోరోజు వెయిట్ చేస్తున్నారని సొంతంగా బ్రేకింగ్ న్యూస్ లు వేసి పడేస్తున్నారు.
చివరకు పవన్ కల్యాణ్ తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి మద్దతివ్వండి, ఒక్క ఓటు కూడా బైటకు పోనీయకుండా అన్నీ కూటమి అభ్యర్థికే వేయండి అంటూ ఢిల్లీ నుంచి స్టేట్ మెంట్ ఇస్తే అది మరీ పరువు తక్కువ పని. అందుకే జనసైనికులు తెగ మథనపడిపోతున్నారు.
సోషల్ మీడియా ట్రోలింగ్ లు పవన్ కి కొత్తేమీ కాకపోయినా.. చాతుర్మాస దీక్ష తర్వాత పొలిటికల్ రీఎంట్రీతో వరుస ఎదురు దెబ్బలు తగలడం మాత్రం కాస్త ఆలోచించాల్సిన విషయమే. జీజేపీ అసలు జనసేనానిని లెక్కలోకి తీసుకుందా లేక బుజ్జగిస్తే చెప్పినట్టు వింటాడులే అని సరిపెట్టుకుంటుందా అనేది తేలాల్సి ఉంది.
వ్యక్తిగతంగా పవన్ కి, పార్టీకి ప్రయోజనం ఉంటుందా లేదా అనే విషయం పక్కనపెడితే.. ఢిల్లీలో తిరుపతి టికెట్ సాధిస్తేనే.. పవన్ ఏపీలో హీరో అవుతారు, లేకపోతే ఎప్పట్లానే జీరోనే.