బాబు జైల్లోనే ఉండిపోవాలని పవన్ ఫ్యాన్స్ పూజలు!

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. 5వ తేదీ నాటికి జైలు నుంచి బయటకు వచ్చేస్తారా? లేదా, మరికొన్ని రోజులు జైల్లో గడపవలసి వస్తుందా? అనే లెక్కల్లో తెలుగుదేశం పార్టీ వారంతా తలమునకలై ఉన్నారు. ఆయన కోసం…

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు.. 5వ తేదీ నాటికి జైలు నుంచి బయటకు వచ్చేస్తారా? లేదా, మరికొన్ని రోజులు జైల్లో గడపవలసి వస్తుందా? అనే లెక్కల్లో తెలుగుదేశం పార్టీ వారంతా తలమునకలై ఉన్నారు. ఆయన కోసం వీధిపోరాటాలు, ఆందోళనలు చేయాలని ఉపక్రమిస్తున్నారు. మరొకవైపు జనసేన నాయకులు కూడా ఈ పోరాటాల్లో పాల్గొనాలని పార్టీ దిశానిర్దేశం చేస్తోంది. 

తెలుగుదేశం ఆందోళనల్లో పాలుపంచుకోవాలని నాదెండ్ల మనోహర్ వారికి సూచిస్తున్నారు. పరిస్థితులు ఇలా ఉండగా.. చంద్రబాబునాయుడు కనీసం ఇంకో ఏడాది, రెండేళ్ల పాటు జైల్లోనే ఉండిపోవాలని పవన్ కల్యాణ్ వీరాభిమానులు కోరుకుంటున్నట్టుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం, ఇలాంటి కోరికతో వారు ఆలయాల్లో పూజలు చేయిస్తున్నట్టుగా, దేవుళ్లకు మొక్కుకుంటున్నట్టుగా కూడా గుసగుసలు వినిపిస్తున్నాయి.

పవన్ కల్యాణ్ కు ముఖ్యమంత్రి పదవి మీద మోజు ఉంది. ఎటూ అయిదేళ్లు రాజకీయ నాయకుడిగా కనిపించాము కదా, ప్రజలందరూ కూడా మనల్ని ముఖ్యమంత్రిని చేయాలనే మోజుతో ఎగబడుతుంటారని అనుకుని 2019 ఆయన ఒంటరిగా పోటీచేసి దారుణ పరాభవాన్ని మూటగట్టుకున్నారు. 

సొంతంగా గెలిచేంత బలం లేదనే క్లారిటీ వచ్చింది గానీ, ముఖ్యమంత్రి పదవి మీద మోజు చావలేదు. ఇప్పుడు చంద్రబాబుతో జట్టు కట్టి ఊరేగుతున్నారు గానీ.. ముఖ్యమంత్రి పదవిని అందుకోవాలనే ఉంది. అందుకే ఆయన దాదాపుగా ప్రతి మీటింగులోనూ.. అవకాశం వస్తే ముఖ్యమంత్రి పదవిని స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా అని అంటున్నారు. ఆ పదవికోసం వెంపర్లాడను అంటూ తాను త్యాగమూర్తి అన్నట్టుగా చెప్పుకుంటున్నారు.

చంద్రబాబునాయుడు పల్లకీ మోస్తూ, ఆయన ఉండగా పవన్ సీఎం ఎలా అవుతారు? చిన్న లాజిక్ ఇది. అదే సమయంలో.. చంద్రబాబు జైలునుంచి బయటకు రాకపోతే గనుక.. పవన్ కల్యాణ్ సీఎం అయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆయన వీరాభిమానులు పండగ చేసుకుంటున్నారు. 

వారాహి యాత్రను తాజాగా మళ్లీ మొదలు పెట్టిన తర్వాత.. పవన్ సీఎం పదవి గురించి చేసిన వ్యాఖ్యలు వారిలో ఆశ పుట్టిస్తున్నాయి. పవన్ సీఎం కావాలంటూ.. వారు దేవుళ్లకు ప్రత్యేక పూజలు చేయిస్తున్నారు. అలా జరగాలంటే, చంద్రబాబునాయుడు ఎన్నికలు పూర్తయ్యేదాకా జైలునుంచి బయటకు రాకూడదని కూడా దేవుణ్ని వేడుకుంటున్నారు.

చంద్రబాబు జైల్లో ఉంటే.. ఆ పార్టీకి కూటమికి కలిపి.. పవన్ కల్యాణ్ తప్ప మరొక దిక్కు లేదు అనే సంగతి.. ములాఖత్ నాడు.. నారా లోకేష్, బాలకృష్ణలను డమ్మీలుగా నిలబెట్టి.. మొత్తం పవన్ కల్యాణ్ మాట్లాడినప్పుడే అర్థమైపోయిందని వారు మురిసిపోతున్నారు. మొత్తానికి పవన్ కు గ్రహాలు అనుకూలించి, ఆయన సీఎం కావడానికి, చంద్రబాబునాయుడు కలకాలం జైల్లోనే ఉండాల్సి వస్తుందేమో అనే అభిప్రాయాలు పలువురిలో వ్యక్తంఅవుతున్నాయి.