మాజీ మంత్రి వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంపై బీజేపీ సంబరపడుతోంది. ఈ మేరకు ఏపీ బీజేపీ కో ఇన్ఛార్జ్ సునీల్ ధియోదర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌తో వైసీపీ, బీజేపీ మధ్య సత్సంబంధాలు లేవని నిరూపితమైందని ఆయన అన్నారు. ఏపీలో వైసీపీ రౌడీ రాజ్యం నడుస్తోందని ఆయన ఘాటు ఆరోపణలు చేశారు. వైసీపీ ప్రభుత్వ అవినీతిపై బీజేపీ పోరాటం నిరంతరం కొనసాగుతుందని ఆయన పేర్కొనడం గమనార్హం.
ఏపీలో వైసీపీ, బీజేపీ మధ్య అనధికార మైత్రి కొనసాగుతోందన్న ప్రచారం వుంది. కేంద్రంలో బీజేపీ సర్కార్ తీసుకున్న ప్రతి నిర్ణయానికి వైసీపీ మద్దతు తెలుపుతున్న సంగతి తెలిసిందే. దీంతో బీజేపీకి వైసీపీ మిత్రపక్షమనే విమర్శలున్నాయి. ఏపీలో బీజేపీకి అన్ని రాజకీయ పక్షాలు మద్దతుగా నిలిచాయి. సీబీఐ, ఈడీ, ఐటీ దాడుల భయంతో వైసీపీ, టీడీపీ బీజేపీకి అండగా నిలిచాయి.
ఇటీవల ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ ఓటమికి వైసీపీతో స్నేహమనే ప్రచారమే కారణమని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ మాధవ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పులు చేసుకోడానికి మోదీ సర్కార్ మద్దతే కారణమన్న ప్రచారం వుంది. ఏపీ బీజేపీలో టీడీపీ, వైసీపీ అనుకూల, వ్యతిరేక నాయకులున్నారు. ఇదే బీజేపీ ఎదుగుదలకు అడ్డంకిగా మారింది. తాజాగా వివేకా హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డి అరెస్ట్‌ను రాజకీయంగా తమకు అనుకూలంగా మలుచుకునేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది.
తమ మద్దతు లేకపోవడం వల్లే సీబీఐ నిష్పక్షపాతంగా విచారణ జరుపుతున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. అదే విషయాన్ని సునీల్ ధియోదర్ పేర్కొనడం గమనార్హం. అయితే వైసీపీతో తమకెలాంటి స్నేహసంబంధాలు లేవని బీజేపీ వాదనను ప్రజలు ఎంత వరకు విశ్వసిస్తారనేది కీలకం. ఎందుకంటే బీజేపీలో ఆ పార్టీకి చెందిన నిజమైన నేతలు తక్కువ మంది ఉన్నారు. ఏపీ బీజేపీ టీడీపీ, వైసీపీ శ్రేయోభిలాషులుగా విడిపోయిన సంగతి వాస్తవం.