మాజీ మంత్రి వివేకా హత్య కేసులో చంద్రబాబు పాత్రపై సాక్షి పత్రిక తప్పుడు కథనం రాసిందని, ఆ సంస్థ చైర్పర్సన్ వైఎస్ భారతి తమ నాయకుడికి క్షమాపణ చెప్పాలని టీడీపీ నేతలు సరికొత్త డిమాండ్‌ను తెరపైకి తెస్తున్నారు. ఇలాగైతే ముఖ్యమంత్రి వైఎస్ జగన్, ఆయన భార్య భారతికి చంద్రబాబు , ఆయన కోసం పని చేస్తున్న ఎల్లో మీడియా ప్రతిరోజూ క్షమాపణ చెప్పాల్సి వుంటుందనే కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి.
వివేకా హత్యకు సంబంధించి నాడు సాక్షిలో నారాసుర రక్తచరిత్ర శీర్షికతో బ్యానర్ కథనాన్ని టీడీపీ నేతలు ఇప్పుడు తెరపైకి తెచ్చారు. ఈ కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయడంతో పాటు ఆయన కుమారుడైన కడప ఎంపీ అవినాష్‌రెడ్డిని కూడా అవసరమైతే అరెస్ట్ చేస్తామని విచారణ సంస్థ తెలంగాణ హైకోర్టుకు చెప్పిన సంగతి తెలిసిందే. దీంతో వివేకా హత్య కేసులో నిందితులు వైఎస్ కుటుంబానికి చెందిన వారే అంటూ టీడీపీ నేతలు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు.
అయితే వివేకా హత్యను చంద్రబాబు మెడకు చుట్టాలని అనుకున్నారని, పాత విషయాలను తిరగతోడుతున్నారు. నారాసుర రక్త చరిత్ర అంటూ వైఎస్ జగన్ తన సాక్షి పత్రికలో విష ప్రచారం చేశారని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. అయితే సీబీఐ విచారణలో నిందితుల జాబితాలో జగన్ కుటుంబ సభ్యులే ఉన్నారని చెప్పుకొస్తున్నారు. నాడు నారాసుర రక్తచరిత్ర అని రాసిన సాక్షి పత్రిక డైరెక్టర్ భారతీరెడ్డి.. చంద్రబాబుకు, టీడీపీకి బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని ఆ పార్టీ నేతలు డిమాండ్ చేయడం గమనార్హం.
అయితే ప్రతిరోజూ ఎల్లో పత్రికల్లో తమ నాయకుడు వైఎస్ జగన్‌తో పాటు ఇతర వైసీపీ నేతలపై విషం చిమ్మడాన్ని అధికార పార్టీ నేతలు గుర్తు చేస్తున్నారు. టీడీపీ డిమాండ్‌ను పరిగణలోకి తీసుకుంటే… ప్రతిరోజూ చంద్రబాబు, ఎల్లో మీడియా జగన్‌కు, వైసీపీకి క్షమాపణలు చెప్పాల్సి వుంటుందని హితవు చెబుతున్నారు. విషం చిమ్మడమే ఎజెండాగా ఎల్లో పత్రికలు, టీడీపీ నేతలు పని చేస్తున్నాయనేందుకు రోజూ ఎన్ని ఉదాహరణలైనా చూపుతామంటున్నారు.