జనసేనాని పవన్‌కల్యాణ్‌కు తగ్గట్టే ఆ పార్టీ నాయకులూ తోడయ్యారు. తెలంగాణ ప్రజలకు ఏపీ మంత్రులు క్షమాపణలు చెప్పాలని పవన్‌కల్యాణ్ డిమాండ్ చేయడం తీవ్ర విమర్శలకు దారి తీసింది. అలాగే హరీష్‌రావుకు కౌంటర్ ఇవ్వడం తనకు మనస్తాపం కలిగించిందని పవన్‌కల్యాణ్ పేర్కొనడం రాజకీయంగా ఆయనకు నష్టం కలిగించింది. కనీసం ఈ వాస్తవం తెలిసిన తర్వాతైనా జనసేన నష్ట నివారణ చేపట్టాల్సి వుండింది.
అబ్బే…అలా చేస్తే అది జనసేన పార్టీ కాకుండా, మరేదైనా అయి వుండేది. కేసీఆర్ వెయ్యి కోట్ల ప్యాకేజీ ఆరోపణల్ని నిజం చేసేలా పవన్ వ్యాఖ్యలున్నాయని విస్తృతంగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్‌కు ఓ రేంజ్లో మాజీ మంత్రి పేర్ని నాని చీవాట్లు పెట్టారు. పవన్ పరువును కృష్ణా నదిలో కలిపిన పేర్ని నానికి జనసేన నాయకుడు పోతిన మహేశ్ కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఆయన కూడా బీఆర్ఎస్కు బీ టీమ్ జనసేన అనే అభిప్రాయం కలిగేలా మాట్లాడారు.
జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన మహేశ్ మీడియాతో మాట్లాడుతూ పేర్ని నానికి పిచ్చి బాగా ముదిరిందన్నారు. అజ్ఞానం ఎక్కువైందని విమర్శించారు. పవన్ ఏం మాట్లాడాడో ముందు తెలుసుకోవాలని పేర్నికి హితవు చెప్పారు. ప్రజలను కించ పరచవద్దని పవన్ చాలా సందర్భాలలో చెప్పారన్నారు. నాయకులు తప్పుగా మాట్లాడితే పవన్ ఖండించారన్నారు. వైసీపీ నాయకులు తెలంగాణ ప్రజలను కించ పరుస్తారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ నాయకులు మాట్లాడే వాటిని వక్రీకరించారన్నారు. బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తే లోటస్ పాండ్ కూలిపోతుందనే భయమా… లేక తమ వ్యాపారాలు హైదరాబాద్‌లో ఉండవనా అని ఆయన నిలదీశారు.
‘పవన్ వ్యాఖ్యలను వక్రీకరిస్తారా.. మీకు దమ్ముంటే హరీష్ రావు వ్యాఖ్యలకు కౌంటర్ ఇవ్వండి. తెలంగాణలో పార్టీ పెట్టి పాదయాత్ర చేస్తున్న షర్మిల అప్పలరాజు వ్యాఖ్యలను ఎందుకు ఖండించలేదు. మీరు మాట్లాడకపోతే అన్నా చెల్లెల్లు డ్రామా అనుకోవాల్సి వస్తుంది’ అంటూ జనసేన నేత వ్యాఖ్యానించారు.
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలు చేస్తూ, తెలంగాణకు మద్దతుగా పవన్ మాట్లాడాన్ని రాష్ట్ర ప్రజానీకం ఏ విధంగా తీసుకుందో ఒక్కసారి పోతిన మహేశ్ తెలుసుకుంటే మంచిది. తన బతుకు తెలంగాణ అని అక్కడే రాజకీయాలు చేస్తున్న షర్మిలను స్పందించాలని ప్రశ్నించడం ఏంటి? మంత్రి సీదిరి అప్పలరాజు వ్యాఖ్యలపై షర్మిల స్పందించకపోతే…అన్నాచెల్లెల్లు డ్రామా అనుకోవాల్సి వస్తుందని జనసేన అధికార ప్రతినిధి చెప్పడం విడ్డూరంగా వుంది.
ఇక్కడే కదా జనసేన పప్పులో కాలేసింది. ఆల్రెడీ తెలంగాణ సీఎం కేసీఆర్‌తో పవన్ వెయ్యి కోట్ల ప్యాకేజీ మాట్లాడుకున్నారని ఎల్లో జర్నలిస్టు అధిపతి సంచలన ఆరోపణలు చేసిన నేపథ్యంలో, ఇప్పుడు తెలంగాణకు మద్దతు పలకడం ద్వారా ఆ ఆరోపణలకు బలం కలిగించినట్టు అవుతుందనే కనీస స్పృహ జనసేన నేతల్లో ఎందుకు కొరవడిందో అసలు అర్థం కావడం లేదు. పవన్‌కే కాదు, అధికార ప్రతినిధులకు కూడా రాజకీయంగా బుర్ర లేదనే వాస్తవాన్ని తమకు తాము బయట పెట్టుకుంటున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకవైపు తెలంగాణ ప్రజల్ని ఏపీ మంత్రులు కించపరిచారని విమర్శిస్తూనే, మరోవైపు బీఆర్ఎస్ పై విమర్శలు చేస్తే లోటస్ పాండ్ కూలిపోతుందనే భయమా అని ప్రశ్నించడంలో అర్థం ఉందా? తెలంగాణలో తమ ఆస్తులకు ఏమైనా జరుగుతుందనే భయం పవన్‌కల్యాణ్‌కు, ఆయన పార్టీ నేతలకు ఉండడం వల్లే ఆ రాష్ట్రానికి ఒత్తాసు పలుకుతున్నారనే విమర్శల్లో నిజం లేదా? ఏపీ అధికార పార్టీ నేతలపై విమర్శలు గుప్పించే క్రమంలో జనసేన నేతలు అనవసరంగా సెల్ఫ్‌గోల్ వేసుకుంటున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.