ముప్పావలా కోడిగుడ్డుకు రూపాయిన్నర కోడిపిల్లను దిష్టి తీసాడన్నట్లుగా వుంది వ్యవహారం. రాక్షసుడు అనే సినిమా మంచి హిట్. అందులో సందేహం లేదు. ఆ సినిమా తమిళ రీమేక్. ఒరిజినల్ సినిమా పక్కన పెట్టుకుని, హీరో, ఫొటోగ్రాఫర్, డైరక్టర్ అందరూ కలిసి, ఫ్రేమ్ టు ఫ్రేమ్, సీన్ టు సీన్ అలా తీసి పక్కన పెట్టారు. అది యూనిట్ అందరికీ తెలుసు.
సినిమా కు ఎంత లాభం వచ్చిందీ నిర్మాతకు తెలుసు. అది మరీ కోట్లకు కోట్లు వచ్చి పడిపోలేదనీ నిర్మాతలకు తెలుసు. బయ్యర్లకు కూడా తెలుసు. ఇలాంటి నేపథ్యంలో, రాక్షసుడు సినిమాకు లాభాలు వచ్చేసాయని, నిర్మాత ఏకంగా మూడు కోట్లకు పైగా ఖరీదైన ఫ్లాట్ కొని డైరక్టర్ రమేష్ వర్మకు ఇచ్చేసారంటూ ప్రెస్ నోట్. ఫొటో.
సినిమా జనాల భారీ గిఫ్ట్ ల వ్యవహారాలు రకరకాలుగా వుంటాయి. తరువాత సినిమాకు అడ్వాన్స్ అన్నట్లుగా, లేదా టాక్స్ లెక్కల కోసం అన్నట్లుగా ఇలా రకరకాలుగా. కొన్ని సార్లు మాత్రం అభిమానంతో అన్నట్లుగా వుంటుంది. పైగా రమేష్ వర్క తో రాక్షసుడు నిర్మాతలకు ఆర్థిక లావాదేవీలు ఇంకా ముగియలేదని, బాకీ కొంత వుందనీ ఇండస్ట్రీ ఇన్ సైడ్ వర్గాల బోగట్టా.
ఇలాంటి నేపథ్యంలో మూడు కోట్ల ఇల్లు గిఫ్ట్ ఇచ్చేసాడంటూ ప్రెస్ నోట్, ఫొటోలు రావడం చూసి, సినిమా జనాలు తెర వెనక్కు కిసిక్కుమంటూ నవ్వుకుంటున్నారు.