తెలుగు ప్రజలు ఇప్పుడు ఏపీకి ప్రత్యేకహోదా అనే అంశాన్ని మరచిపోయారు. అది వస్తుందనే నమ్మకం వారికి పూర్తిగా సన్నగిల్లిపోయింది. కనుక ఆ దిశలో వారిని ప్రత్యేకంగా మభ్యపుచ్చవలసిన అవసరం ఎంతమాత్రమూ లేదు. కానీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మళ్లీ ఎందుకో హోదా అంశం ఎత్తుతున్నారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా ఇవ్వాలని ఆయన కేంద్రానికి లేఖ రాశారు.
హోదాను చాలా రాష్ట్రాలు అడుగుతున్నాయని, అయితే ఆ అంశం కేంద్రం పరిధిలోదే తప్ప తమకు సంబంధం లేదని.. 15వ ఆర్థిక సంఘం తేల్చి చెప్పింది. ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ.. కేంద్రం తమకు హోదా ఇచ్చి ఆదుకోవాలని ముఖ్యమంత్రి లేఖ రాశారు. ఇదేదో లాంఛనమే అయితే పరవాలేదు. కానీ.. హోదా సాధించుకు వస్తా.. రాష్ట్రాన్ని ఆ దన్నుతో ముందుకు తీసుకువెళ్తా అని ప్రజల ఎదుట చెప్పడానికి ఈ పనిచేసిఉంటే గనుక.. ఇబ్బందే!
అలా చేస్తున్నట్లయితే.. జగన్ కూడా చంద్రబాబు చేసిన తప్పును రిపీట్ చేస్తున్నట్టే. రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉండగా.. ప్రజల ఎదుట తమ పరువు కాపాడుకోవడానికి… హోదా ఉంటే చాలా చేసేసేవాళ్లం.. అని మభ్యపుచ్చడం చంద్రబాబుకు అలవాటు అయింది. అందుకే ఆయన తాను కేంద్రంలో భాగస్వామిగా ఉన్నంత కాలమూ హోదా డిమాండును కాలరాచి, బయటకు వచ్చిన తర్వాత.. దానిపై ఊదరగొట్టారు. కానీ.. అలాంటి మాటల్ని ప్రజలు నమ్మలేదు.
మోడీ సర్కారుకు ప్రత్యేకహోదా ఇచ్చే ఉద్దేశమే ఉంటే గనుక.. వారు అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే ఆ పని జరిగి ఉండేది. ఏపీలోని రాజకీయ పార్టీల మధ్య వైరుధ్యాలు, వారి స్వార్థ ప్రయోజనాలు ఇవన్నీ కలిసి.. మోడీ సర్కారు రాష్ట్రాన్ని ఉపేక్షించినా కూడా పట్టించుకోని పరిస్థితిని కల్పించాయి. ఏపీ ప్రజలకు ఇచ్చిన మాట తప్పడంలో ఎలాంటి వెరపు లేని మోడీ.. పట్టించుకోలేదు. దానికి చంద్రబాబు తొలుత సహకరించారు. మొత్తానికి హోదా డిమాండు మంటగలిసిపోయింది.
జగన్ ప్రభుత్వానికి వచ్చేసరికి ఆయనకున్న ఎడ్వాంటేజీ… ప్రజల్లో హోదా ఆశ మిగలలేదు. ఇప్పుడు ఆయన మళ్లీ కేంద్రానికి లేఖ రాయడం వంటి చర్యల ద్వారా.. హోదా తెస్తాననే భ్రమలు కల్పించడానికి ప్రయత్నిస్తే.. ఇబ్బంది తప్పదు. లేదా ఆర్థిక సంఘం వ్యాఖ్యల నేపథ్యంలో.. ఏదో లాంఛనంగా రాసిన లేఖే గనుక అయితే పరవాలేదు.