రాజధాని విషయంలో అధికార పక్షం వైసీపీ నెత్తిన టీడీపీ పార్లమెంట్ సాక్షిగా పాలు పోసింది. రాజధాని అంశాన్ని కేంద్రం దృష్టికి వైసీపీ ఇంకా అధికారికంగా తీసుకెళ్లలేదు. ఇదే విషయాన్ని పార్లమెంట్ సాక్షిగా కేంద్రహోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ కూడా చెప్పాడు. ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటుపై కేంద్రంతో చర్చించి, వారి నుంచి సానుకూల నిర్ణయాన్ని తీసుకొని రావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వైసీపీ పని తేలిక చేస్తూ….ఆ పని టీడీపీ చేసింది.
రాజధాని విషయంలో ఇటు రాష్ట్రాన్ని, అటు కేంద్రాన్ని ఇరికించాలని ప్రతిపక్ష టీడీపీ వేసిన ప్లాన్ బెడిసి కొట్టింది. ఎవరు తీసిన గోతిలో వారే పడతారనే సామెత…టీడీపీ విషయంలో అక్షరాలా నిజమైంది.
టీడీపీ ఇద్దరు ఎంపీలు గల్లా జయదేవ్, కేశినేని నాని వేసిన రెండు ప్రశ్నలు….వాటికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సమాధానాలు, ఏపీలో అధికార పక్షం వైసీపీకి కొండంత బలాన్ని ఇచ్చాయని చెప్పొచ్చు.
గల్లా ప్రశ్నకు దిమ్మ తిరిగే సమాధానం
రాజధాని అంశంపై లోక్‌సభలో గల్లా జయదేవ్ కేంద్రానికి కొన్ని ప్రశ్నలు వేశాడు. ‘ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందా? వస్తే దీనిపై కేంద్రం స్పందన ఏమిటి? ఈ నిర్ణయం రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా సహాయపడుతుంది? రాజధాని అమరావతికి భూములు ఇచ్చిన వేలాది మంది రైతులకు నష్టం వాటిల్లుతున్నందున ఇలాంటి నిర్ణయాలు తీసుకోరాదని కేంద్రం రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇస్తుందా? ఇస్తే అందుకు సంబంధించి వివరాలేమిటి?’ అని గల్లా జయదేవ్ ప్రశ్నించారు.
గల్లా ప్రశ్నకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్రాయ్ సూటిగా, స్పష్టంగా లిఖితపూర్వక సమాధానం ఇచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే టీడీపీ నోటికి తాళం లాంటి జవాబు కేంద్రం ఇచ్చింది.
‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాజధాని నగరంగా అమరావతిని నోటిఫై చేస్తూ 2015 ఏప్రిల్ 23న జీవో జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు రాజధానులు ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్టు ఇటీవల మీడియాలో వార్తలు వచ్చాయి. తమ ప్రాదేశిక భూభాగంలో రాజధానిని నిర్ణయించుకునే అధికారం ఆయా రాష్ట్రాలకే దఖలు పడి ఉంది..’ అని కేంద్రమంత్రి విస్పష్టంగా ప్రకటించాడు. నిజానికి కేంద్రం నుంచి ఇలాంటి జవాబును వైసీపీ సభ్యులు రాబట్టాలి. కానీ టీడీపీ సభ్యుల అత్యుత్సాహంతో ఇక మీదట రాజధాని విషయమై పార్లమెంట్లో మాట్లాడే అవకాశం లేకుండా చేసుకున్నారు.
కేశినేని నాని ప్రశ్నతో మరో దెబ్బ
టీడీపీకి చెందిన మరో సభ్యుడు కేశినేని శ్రీనివాస్ (నాని) అమరావతిలో నిరసన అంశంపై అడిగిన ప్రశ్న ఎదురు తన్నిందని చెప్పొచ్చు. ‘అమరావతి విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో సామూహిక నిరసనలు జరుగుతున్న విషయం కేంద్రం దృష్టికి వచ్చిందా? నిరసనకారులపై పోలీసుల దాడులు కేంద్రం దృష్టికి వచ్చాయా? ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏదైనా సమాచారం వచ్చిందా? ఈ విషయంలో జోక్యం చేసుకునే యోచన ఉందా?’ అని అడిగాడు.
శాంతి భద్రతలు రాష్ట్రాల పరిధిలోనివే…
కేశినేని నాని ప్రశ్నకు కూడా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చాడు. ‘ప్రజల భద్రత, పోలీసింగ్ రాజ్యాంగంలోని ఏడో షెడ్యూలు ప్రకారం రాష్ట్రాల జాబితాలోని అంశాలు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడడం, చట్టప్రకారం అపరాధులపై చర్యలు తీసుకునే ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల్లో శాంతి భద్రతల స్థితిని పర్యవేక్షిస్తుంది. భారీగా శాంతి భద్రతల సమస్యలు ఉన్నట్లైతే రాష్ట్రాల అభ్యర్థన మేరకు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(సీఏపీఎఫ్) పంపడం ద్వారా సాయం చేస్తుంది. అయితే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అలాంటి అభ్యర్థనేదీ కేంద్ర హోం శాఖకు ఇంతవరకూ రాలేదు’ అని సమాధానం ఇచ్చాడు.
రాజధాని రైతులపై పోలీసులతో దాడి చేయిస్తున్నారనే ప్రతిపక్షాల ఆరోపణలకు కేంద్రం చెక్ పెట్టినట్టైంది. అంతేకాదు , రాష్ట్రం అభ్యర్థిస్తే కేంద్రం సాయుధ బలగాలను కూడా పంపిస్తుందని రాష్ట్రానికి భరోసా ఇవ్వడం గమనార్హం. టీడీపీ అత్యుత్సాహంతో లోక్‌సభలో కేంద్రానికి రెండు ప్రశ్నలు వేసి…గోడేటు, చెంపేటు తిన్నది. మొత్తానికి రాజధానిపై ముందుకు సాగేందుకు కేంద్రం నుంచి గ్రీన్‌సిగ్నల్‌ను టీడీపీ ఇప్పంచినట్టైంది. ఆ విధంగా వైసీపీ నెత్తిన టీడీపీ పాలు పోసినట్టైంది.