టీడీపీ అధినేత చంద్రబాబు ఇంకా తాను అధికారంలో ఉన్నట్టుగానే భావిస్తున్నాడు. పదేపదే గతాన్ని గుర్తు తెచ్చు కుంటూ…అలా అనుకుని ఉంటే నీ సంగతెలా ఉండేదంటూ సీఎం జగన్ను ప్రశ్నిస్తున్నాడు. అంతిమంగా ఎవరినైనా, ఏమైనా చేయగల శక్తిసామర్థ్యాలు ప్రజలకు మాత్రమే ఉంటాయనే స్పృహ బాబులో లోపిస్తోంది. ఒకవేళ ఆ స్పృహే బాబులో ఉంటే ఆయన అలా మాట్లాడేవారు కాదు.
తెనాలిలో చంద్రబాబు మాట్లాడుతూ తాము అడ్డుకుంటే జగన్ రాష్ట్రంలో తిరిగే వారా? అని ప్రశ్నించాడు. అంతేకాదు, తాము తలుచుకుంటే మీరు ఎక్కడ ఉండేవారని వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించాడు. అసలు జగన్ రాష్ట్రంలో పాదయాత్ర చేపట్టడానికే చంద్రబాబు అనుసరించిన నిరంకుశ విధానాలే కారణం. అసెంబ్లీలో ప్రతిపక్ష వైసీపీ సభ్యులు కనీసం మాట్లాడేందుకు మైక్ ఇవ్వకపోవడం వల్లే ప్రజాక్షేత్రంలో తేల్చుకునేందుకు జగన్ పాదయాత్ర చేయాల్సి వచ్చిందనే విషయాన్ని చంద్రబాబు మరిచిపోయినట్టున్నాడు.
చంద్రబాబు తలుచుకోవడం వల్లే వైసీపీ నేతలు నేడు అధికారంలో ఉన్నారు. చంద్రబాబు తలుచుకోవడం వల్లే టీడీపీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. అధికారంలో ఉంటూ అన్ని రకాల అప్రజాస్వామిక విధానాలకు చంద్రబాబు పాల్పడటం వల్లే ప్రజలు ఓటు అనే ఆయుధంతో శిక్ష విధించారు. తానేదో రారాజు అయినట్టు…‘మేము తలుచుకుంటే, మేమనుకుంటే’ అంటూ చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉంది. చంద్రబాబు పదేపదే గతంలోకి వెళ్లడానికి అంత ఘనంగా ఏమీ లేదు. గతమంతా దోపిడీ, అణచివేత, నియంతృత్వ పాలనే. కనీసం వర్తమానంలోనైనా ప్రతిపక్ష నేగా హూందాగా వ్యవహరిస్తే రాజకీయ చరమాంకంలో గౌరవం దక్కుతుందనే వాస్తవాన్ని బాబు గ్రహిస్తే మంచింది.