‘‘మీరు సినిమా చేయండి.. మీరు సినిమా చేస్తే.. తద్వారా వచ్చే క్రేజ్ మిమ్మల్ని అమాంతం ముఖ్యమంత్రిని చేసేస్తుంది. మీ సినిమాలు చూసి జనం వెర్రెత్తిపోయి మీకు ఓట్లు వేసేసి… మిమ్మల్ని రెడ్ కార్పెట్ మీద శాసనసభకు పంపిచేస్తారు..’ ఇలాంటి డైలాగులు.. చూడగానే.. ఎవణ్నో మాయ చేయడానికి పుట్టిన డైలాగులని ఇట్టే అర్థమైపోతుంది. అచ్చంగా ఇవే డైలాగులు కాదుగానీ.. ఇంచుమించుగా ఇదే తరహాలో.. పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి వెటరన్ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అంటున్నారు.
పరుచూరి పలుకులు పేరుతో.. తమకున్న ఇమేజిని యూట్యూబ్ ద్వారా కేష్ చేసుకునే సినిమా సెలబ్రిటీల్లో ఒకరైన పరుచూరి గోపాలకృష్ణ.. సదరు యూట్యూబ్ వీడియోలు వేగంగా వైరల్ కావడానికి సరైన రీతిలోనే పవన్ కల్యాణ్ సబ్జెక్టును ఎంచుకోవడం విశేషం. అందుకే అయిదు గంటల్లో 26వేలు దాటిపోయాయి వ్యూస్.
అప్పట్లో మేం అన్నగారికి కూడాచెప్పాం.. అంటూ ప్రతిసారీ లాగానే పాత పాట పాడిన పరుచూరి.. తాము చెప్పకపోతే ఎన్టీఆర్ నాదేశం సినిమా చేసేవాడే కాదన్నట్లుగా ఈ వీడియోలో బిల్డప్ ఇచ్చారు. దానికి తోడు ముఖ్యమంత్రి అయ్యాక కూడా సినిమాలు చేయొచ్చునంటూ సంకేతం కూడా ఇచ్చారు. అయినా సినిమాలను ఓట్లకు రాచబాటగా వాడుకోవాలనే సంగతి ఇవాళ తెలియని వాడెవ్వడు.
పవన్ కల్యాణ్ కూడా అలాంటి అద్భుతమైన వ్యూహాలతోనే.. తన పార్టీని యాక్టివేట్ చేయడానికి ముందు 2018లో అజ్ఞాతవాసి సినిమా తీశాడు. ప్రజలు దానిని ఎలా రిసీవ్ చేసుకున్నారో అందరికీ తెలుసు. ఎన్నికల్లో అంతకంటె ఘోరంగా బుద్ధి చెప్పారు. సినిమా బాగుంటే పవన్ కల్యాణ్ పవర్ స్టార్ అనుకోవాల్సిందే గానీ.. అది బాగాలేకపోతే.. జనం ఎప్పటికప్పుడు బుద్ధి చెబుతూనే వచ్చారు. ఖుషి తర్వాత.. పదుల సంఖ్యలో చిత్రాలు బాక్సాఫీసువద్ద చీదేసిన సంగతి అందరికంటె బాగా పవన్ కే తెలుసు. ఎందుకంటే ఆయన చేతులు కాల్చుకున్న వాటిలో.. స్వీయ దర్శకత్వంలోని జానీ కూడా ఉంది.
కాబట్టి… సినిమాలు చేయగానే సీఎం అయిపోతారు లాంటి ఎవరైనా చెప్పే మాయమాటలు నమ్మి.. సీఎం కావడానికి తగిన ఎలిమెంట్స్.. పంచ్ డైలాగులు సినిమాల్లోకి బలవంతంగా చొప్పించకుండా.. సినిమాను సినిమాలాగా శ్రద్ధగా దర్శకుడు చెప్పిన మాట వింటూ చేస్తే.. పవన్ కు కనీసం అక్కడైనా విజయం దక్కుతుంది. రాజకీయాల్లో ఎటూ ఆయన దుకాణం భాజపాకు లీజుకు రాసిచ్చేశారు కదా!