పిల్ల కుంకలట.. మరీ ఇంత అహంకారమా.?

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలుపు బాధ్యతని పెంచితే, ఓటమి పాఠాల్ని నేర్పిస్తుంది. దురదృష్టవవాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబుకి గెలుపుతో అహంకారం తన్నుకొస్తుంది.. ఓటమితో అసహనం పెరిగిపోతుంటుంది. అమరావతి పేరుతో అధికారంలో వున్నన్నాళ్ళూ పబ్లిసిటీ స్టంట్లు…

రాజకీయాల్లో గెలుపోటములు సహజం. గెలుపు బాధ్యతని పెంచితే, ఓటమి పాఠాల్ని నేర్పిస్తుంది. దురదృష్టవవాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబుకి గెలుపుతో అహంకారం తన్నుకొస్తుంది.. ఓటమితో అసహనం పెరిగిపోతుంటుంది. అమరావతి పేరుతో అధికారంలో వున్నన్నాళ్ళూ పబ్లిసిటీ స్టంట్లు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబు, అధికారం కోల్పోయాక కూడా అదే అమరావతి పేరుతో యాగీ చేస్తున్నారు.

తాత్కాలిక సచివాలయం, తాత్కాలిక హైకోర్టు.. తప్ప ఏమున్నాయక్కడ.? 'మేం మొత్తం కట్టేశాం.. ఇంకో 2 వేల కోట్లు ఖర్చు చేస్తే అమరావతి పూర్తయిపోయినట్లే..' అంటూ ఇప్పుడు తాపీగా ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న చంద్రబాబు, అమరావతి ప్రాజెక్టు కోసం లక్ష కోట్ల పైన ఖర్చవుతుందని గతంలో ఎందుకు చెప్పినట్లు.?

ఇక, గుంటూరు జిల్లా తెనాలిలో అమరావతికి మద్దతుగా.. అంటూ ఓ బహిరంగ సభలో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి.

'పిల్ల కుంకలు.. నాకు పాఠాలు చెబుతున్నారు..' అంటూ చంద్రబాబు, ప్రతిపక్షం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీపై విరుచుకుపడిపోయారు. 'ఎన్నికల సమయంలో చెప్పాను.. వైసీపీకి ఓటేస్తే కరెంటు తీగ పట్టుకున్నట్లేనని.. ఇప్పుడు ఏమయ్యింది.. మీరంతా మాడి మసైపోయారు..' అంటూ జనాన్ని ఉద్దేశించి సెటైర్లు వేశారు చంద్రబాబు.

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చి ఇంకా ఏడాది కూడా పూర్తి కాలేదు. అదే చంద్రబాబు హయాంలో అయితే, 'మాకు ప్రజలు అధికారమిచ్చింది ఐదేళ్ళ పాలన కోసం.. రెండేళ్ళే అయ్యాయి కదా.. మూడేళ్ళే అయ్యాయి కదా..' అంటూ చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా తప్పించుకు తిరిగిన వైనాన్ని ఎలా మర్చిపోగలం.?

అన్నట్టు, విశాఖకు మెట్రో రైల్‌ తీసుకొచ్చారట.. అలా విశాఖను అభివృద్ధి చేసేశారట. ఎయిర్‌ పోర్ట్‌ కోసం ప్రయత్నిస్తే, వైఎస్సార్సీపీ అడ్డుపడిందట. ఇవీ అమరావతిలో చంద్రబాబు చెప్పిన కాకమ్మ కథలు. విశాఖకు మెట్రో ఎక్కడ వచ్చిందో చంద్రబాబుకే తెలియాలి. విశాఖలో కొత్త ఎయిర్‌ పోర్ట్‌కి సంబంధించి కేంద్రం – రాష్ట్రం మధ్య గొడవ తలెత్తడంతో ఆ ప్రాజెక్టు అయోమయంలో పడ్డ విషయం విదితమే.

ఏదిఏమైనా, 'పిల్ల కుంకలు' అనే మాట మాట్లాడేముందు చంద్రబాబు ఒకటికి పదిసార్లు ఆలోచించుకుంటే మంచిది. వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి దెబ్బకి టీడీపీ అధికారం కోల్పోయింది. వైఎస్‌ జగన్‌ తలచుకుంటే, అసెంబ్లీలో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా పోతుంది. పదే పదే హుందాతనం గురించి మాట్లాడే చంద్రబాబు, ఆ హుందాతనాన్ని పాటించడంలో మాత్రం వెరీ వెరీ పూర్‌.! ఆ విషయం ఇక్కడ ఇంకోసారి నిరూపితమయ్యిందంతే.