ఎమ్బీయస్‍: ఎన్టీయార్ మరణం వాయిదా పడివుంటే..?

1996 జనవరి 18న తెల్లవారుతూండగా ఎన్టీయార్‌ మరణించారు. నాలుగు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో పాల్గొని తన టిడిపికి ప్రజాబలముందో, బాబు టిడిపికి ప్రజాబలముందో నిరూపించుదామని ఉవ్విళ్లూరుతున్న సమయంలో పోయారు. ఆయన మరణంతో బాబుకి…

1996 జనవరి 18న తెల్లవారుతూండగా ఎన్టీయార్‌ మరణించారు. నాలుగు నెలల్లో జరగనున్న పార్లమెంటు ఎన్నికలలో పాల్గొని తన టిడిపికి ప్రజాబలముందో, బాబు టిడిపికి ప్రజాబలముందో నిరూపించుదామని ఉవ్విళ్లూరుతున్న సమయంలో పోయారు. ఆయన మరణంతో బాబుకి ఎదురు లేకుండా పోయింది. లక్ష్మీపార్వతి, ఆమె వెనక్కాల వున్న ఎమ్మెల్యేలు కలిసి పెట్టుకున్న ఎన్టీయార్‌టిడిపి (ఎల్‌పి) నెగ్గుతుందని కార్యకర్తలు, నాయకులు అనుకోలేదు. అధికారం, మీడియా మద్దతు బాబువైపే ఉన్నాయి. కమ్యూనిస్టులు బాబుతో పొత్తు పెట్టుకున్నారు. ఊరూరా టిడిపి కార్యకర్తలతో సంబంధబాంధవ్యాలు ఆయనకే ఉన్నాయి. అందువలన వాళ్లంతా ఆయన వెంటే నిలిచారు. మేలో జరిగిన ఓటర్లలో టిడిపి అభిమానులలో చాలామంది బాబు టిడిపి వర్గానికే ఓటేశారు. ఎంతమంది?

ఫలితాలు చూస్తే మజ్లిస్‌కు 1 పోగా, తక్కిన 41టిలో ఒంటరిగా పోటీచేసిన కాంగ్రెసుకు 22 సీట్లు 39.7% ఓట్లు (1.21 కోట్లు) వచ్చాయి. టిడిపి కూటమికి 37.8% ఓట్లు (1.15 కోట్లు) వచ్చాయి. విడిగా టిడిపికి 16, సిపిఐకి 2, సిపిఎంకు 1 వచ్చాయి. ఎల్‌పి వర్గానికి సీట్లేమీ రాకపోయినా 10.7% ఓట్లు (0.32 కోట్లు) వచ్చాయి. టిడిపి ప్రతిపక్షంలో వుండగా వచ్చిన 1991 పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెసుకు 25 సీట్లు రాగా, టిడిపికి 13, దానితో పొత్తు పెట్టుకున్న సిపిఐ, సిపిఎంలకు చెరొకటి వచ్చాయి. మధ్యలో 1994 డిసెంబరులో వచ్చిన అసెంబ్లీ ఎన్నికలలో టిడిపికి 44% ఓట్లు, 216 సీట్లు వచ్చాయి. కాంగ్రెసుకు 34% ఓట్లు, 26 సీట్లు వచ్చాయి.

దీని అర్థం 1996 మే నాటికి పార్లమెంటు సీట్లలో కాంగ్రెసుదే పైచేయి. 1994 డిసెంబరు అసెంబ్లీ ఎన్నికలలో 44% ఓట్లు తెచ్చుకున్న టిడిపికి,  18 నెలల తర్వాత, రెండు వర్గాలు, లెఫ్ట్‌కు కలిపి 48.5% వచ్చాయి. లెఫ్ట్‌కు 2.5% వచ్చి వుంటాయనుకుని తీసేసి చూస్తే టిడిపి రెండు వర్గాల ఓట్లూ కలిపి 46% అనుకోవాలి. దీనిలో బాబు టిడిపికి 35.3, ఎల్‌పి టిడిపికి 10.7 వచ్చాయి. అంటే మొత్తం టిడిపి ఓటులో 77% బాబుకి, 23% ఎల్‌పికి వచ్చాయి. పార్టీ చీలినప్పుడు ఎమ్మెల్యేలలో 85% మంది బాబు పక్షాన నిలువగా, 15% మంది ఎన్టీయార్‌ పక్షాన నిలిచారు. 9 నెలల తర్వాత జరిగిన ఎన్నికలలో ఓటర్లలో శాతం వేరేలా వుందని, ఎన్టీయార్‌ నిష్క్రమణ తర్వాత కూడా టిడిపి ఓటర్లలో 23% బాబుకి దూరంగానే ఉన్నారని యీ అంకెలు చెప్తున్నాయి. 

అద్భుతమైన స్టామినా ప్రదర్శించిన మహాబలశాలి ఎన్టీయార్‌ను తన అత్యాశతో అకాల మృత్యుమార్గంలో నడిపించిన వ్యక్తిగా ఎల్‌పిని అందరూ అసహ్యించుకుంటున్న ఆ రోజుల్లోనే ఆమె నేతృత్వంలోని వర్గానికి 23% ఓట్లు వచ్చాయంటే, ఎన్టీయారే బతికి వుండి వుంటే ఎలా వుండేది? ఓట్ల చీలిక 77-23కు బదులుగా కనీసం ఏ 50-50యో వుండేదేమో! ముక్కోణపు పోటీలో టిడిపి ఓట్లు వీళ్లిద్దరి మధ్య చీలిపోయి కాంగ్రెసుకు మరిన్ని సీట్లు వచ్చావేమో కానీ, ఓటింగు శాతం బట్టి టిడిపిలో ఎన్టీయార్‌ బలమేమిటో తెలిసేది.

కానీ అలా జరగలేదు. ఎన్నికలకు నాలుగు నెలల ముందే ఎన్టీయార్‌ మరణించడంతో యివన్నీ అయితే, గియితేలుగా మిగిలిపోయాయి. బాబు టిడిపిలో ఎదురులేని ఏకైక నాయకుడై పోయారు. ఇంతకీ ఎన్టీయార్‌ మృత్యువుకి దారి తీసిన కారణమేమిటి? పార్టీ చేజారిపోయాక, కుటుంబసభ్యులందరూ దూరమైపోయాక ఆయన కృంగి, కృశించి, అహం దెబ్బ తిని తన చావు తానే కొని తెచ్చుకున్నారా? ఆయన మూడ్ ఎలా వుండేది? ఇది తెలుసుకోవడానికి ఇండియా టుడే 21 09 1995 నాటి సంచిక తిరగేశాను. ‘‘ప్రజాసమక్షంలోనే అసలుసిసలు బలపరీక్ష’’ పేర అమర్‌నాథ్ కె మేనోన్ రాసిన కథనమది. దానిలో గమనార్హమైన దేమిటంటే సెప్టెంబరు 12న బాబు ప్రమాణస్వీకారం కోసం జిల్లాల నుంచి హైదరాబాదుకి జనాల్ని రప్పిస్తే వాళ్లు ఎన్టీయార్‌ యింటికి పరుగులు తీసి, పాదాభివందనాలు చేశారట. ఇది ఎన్టీయార్‌లో ఆశలు రగిలించింది.

ఎందుకంటే నాదెండ్ల ఉదంతంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన బంద్‌లలో ఎందరో టిడిపి కార్యకర్తలు మరణించారు. ఈసారి బాబు ఉదంతంలో ప్రజాగ్రహం పెల్లుబకలేదు. పైగా భార్యామోహితుడైన ఎన్టీయార్ తప్ప, టిడిపి ముఖ్యులందరూ తనతోనే ఉన్నారనే యిమేజిని బాబు సృష్టించారు. ప్రజారక్షణ సదస్సు పేరిట జరిగిన విజయోత్సవ సభలో బాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, హరికృష్ణలను ప్రజారక్షణకు నడుం కట్టిన త్రిమూర్తులుగా వర్ణిస్తూ కటౌట్లు, పోస్టర్లు పెట్టారు. (ఉప ముఖ్యమంత్రి పదవి దక్కని దగ్గుబాటి 18మంది ఎమ్మెల్యేలతో సహా ఎన్టీయార్ బతికి వుండగానే ఆయన క్యాంపుకి వచ్చేశారు. హరికృష్ణను బాబు వదుల్చుకున్నారు). దీనితో బాటు ఎన్టీయార్ వాగ్దానం చేసి నెరవేర్చిన చౌకబియ్యం, మద్యనిషేధం, హార్స్‌పవర్‌కు 50 రూ.ల రేటుపై విద్యుత్ అందించే పథకాలను ఆయన కంటె మెరుగ్గా అమలు చేస్తాం అని బాబు చెప్పుకున్నారు. (ఎన్టీయార్‌ మరణం తర్వాత బియ్యం రేటు 2 రూ.ల నుంచి 3.50కు పెంచారు, మద్యనిషేధం ఎత్తివేశారు, విద్యుత్ రేట్లు, నీటి తీరువా రేట్లు పెంచేశారు. కానీ యీ సంగతి అప్పటికి తెలియదు కదా) పైగా ప్రతి నియోజకవర్గంలో వెయ్యి యిళ్ల చొప్పున మొత్తం 3 లక్షల యిళ్లను 1996 మార్చిలోపున కడతామని ప్రకటించారు. అదీ జరగలేదనుకోండి.

పథకాలే కాదు, బాబు వ్యవస్థలను, తన పాత అనుచరులను కూడా మేనేజ్ చేయగలుగుతున్నారని ఎన్టీయార్‌కి అర్థమై పోయింది. సెప్టెంబరు 7న అసెంబ్లీ సమావేశమైంది. సభలో మాట్లాడేందుకు స్పీకరు యనమల రామకృష్ణుడు ఎన్టీయార్‌కు అవకాశమివ్వలేదు. ఎన్టీయార్‌కు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు స్పీకర్ పోడియంలోకి వెళ్లి ఆయనతో దాదాపు రెండు గంటలు వాగ్వాదానికి దిగారు. ఆవేశంలో ఒక ఎమ్మెల్యే మైకు విరగ్గొట్టి స్పీకరుపైకి విసిరేశాడు. తన ఎమ్మెల్యేల ప్రవర్తనకు ఎన్టీయార్ క్షమాపణ వేడారు. కానీ స్పీకరు ఎమ్మెల్యేలనే కాకుండా ఏమీ చేయకపోయినా ఎన్టీయార్‌ను కూడా సస్పెండ్ చేసి, వాళ్లందరూ వెళ్లిపోయాక బలపరీక్ష నిర్వహించి బాబుకి 183 మంది టిడిపి ఎమ్మెల్యేల మద్దతున్నట్లు ప్రకటించాడు. అంతకు ముందు ఆగస్టు 29న జరిగిన బిజినెస్ ఎడ్వయిజరీ కమిటీ సమావేశానికి స్పీకరు ఎన్టీయార్‌ను ఆహ్వానించలేదు.

స్పీకర్‌నే కాదు, గవర్నరును కూడా బాబు మేనేజ్ చేశారని ఎన్టీయార్‌ బాధ. అసెంబ్లీని రద్దు చేయమని తను చేసిన సిఫార్సును పక్కన పెట్టి, పార్టీ నుంచి బహిష్కరించిన బాబుని అదే పార్టీ తరఫున ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయమని ఆహ్వానించడం తప్పు అంటూ ఎన్టీయార్ హైకోర్టులో కేసు పడేసి, తన తరఫున వాదించమని నానీ ఫాల్కీవాలాను అడిగారు. రద్దు చేయకపోవడం గవర్నరు పరిధిలోనిదే కానీ, బాబును అదే పార్టీ తరఫున ఆహ్వానించడం తప్పే అని ఫాల్కీవాలా చెప్పి, బాంబే హైకోర్టులో పని ఒత్తిడి వలన హైదరాబాదుకి రాలేనన్నారు. హైకోర్టు ఎన్టీయార్ వాదనను తోసి పుచ్చింది. ఇలాటి పరిస్థితుల్లో బాబును ఎదుర్కోవడం ఎలా అని అనుకుంటున్న ఎన్టీయార్‌కు సామాన్య ప్రజలు తన వద్దకు పరిగెట్టుకుని రావడం ఆనందాన్ని కలిగించింది.

స్వార్థపరులైన ఎమ్మెల్యేలు ఎటున్నా, ప్రజలు తన వెంటే ఉన్నారని, తనదే అసలైన టిడిపి అని నిరూపించుకోవడానికి 1996 మే నెలలో జరిగే లోకసభ ఎన్నికలు మంచి అవకాశమని ఎన్టీయార్ భావించారు. 1995 సెప్టెంబరులో అమరనాథ్‌కు యిచ్చిన యింటర్వ్యూలో ఆయన అప్‌బీట్ మూడ్‌లో ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ‘కార్పోరేషన్ చైర్మన్ పదవుల ఆశ చూపి, ధనాశ చూపి బాబు ఎమ్మెల్యేలను ఆకట్టుకున్నారు… నా పిల్లలను కూడా తప్పుదోవ పట్టించినట్లుంది. ప్రజలకోసం నేను ప్రారంభించిన పార్టీని వారసత్వ ఆస్తిలా తమలో తాము పంచుకోవడానికి వాళ్లు చేతులు కలిపారు. వారిలో ఎవరైనా తిరిగి వచ్చినా నేను పార్టీలో చేర్చుకోను. (కొంతకాలానికి దగ్గుబాటి వస్తే చేర్చుకున్నారు). అల్లుళ్లూ, కుమారులైతే కావచ్చు. కానీ వారు నన్నూ, యీ రాష్ట్రప్రజలనూ మోసగించారు. వాళ్లు తడిగుడ్డతో గొంతుకోసే రకాలు. పశ్చాత్తాపపడిన ఎమ్మెల్యేలను మాత్రం తిరిగి చేర్చుకునే విషయం పరిశీలిస్తాను.’ అని చెప్పారు. నా పిల్లలపై నాకు ఆసక్తి లేదు. నా పక్షాన ఎవరుంటే వారంతా నా పిల్లలు అని చేర్చారు.

మోహనబాబు గురించి అడిగితే ‘అతడి గురించి మాట్లాడడం శుద్ధదండగ’ అన్నారు. లెఫ్ట్ వాళ్లు విశ్వాసతీర్మానంపై బాబును ఎందుకు సమర్థించారు? అని అడిగితే ‘వారి గురించి వర్ణించడానికి నా వద్ద మాటలు లేవు. తాము నాతోనే వున్నట్లు మొదట్లో చెప్పి, తర్వాత ప్లేటు ఫిరాయించారు.’ అన్నారు. ‘లక్ష్మీపార్వతి ప్రవేశానికి ముందు బాబు పార్టీలో, ప్రభుత్వంలో రాజ్యాంగాతీత శక్తిగా ఉన్నారని కొందరంటున్నారు. నిజమా?’ అని అడిగితే గట్టిగా నవ్వేసి ‘నేనేం చెప్పేది? ఈ సంగతి మీకూ, రాష్ట్రప్రజలకూ చాలా బాగా తెలుసు.’ అనేశారు. ‘పార్టీ నాతోనే ప్రారంభమైంది. బాబు ఓ పార్టీని ప్రారంభించదలిస్తే ప్రజల ముందుకు వెళ్లమనండి. ఎన్నికల్లో పోటీ చేసి తన సత్తా నిరూపించుకోమనండి. నేను యీ లోకసభ ఎన్నికలలో 37 సీట్లు గెలుస్తాను.’ అని ప్రకటించుకున్నారు.

పార్టీ గుర్తు తనకే వస్తుందని సెప్టెంబరులో ధీమా వ్యక్తం చేసినా, బాబు ఎన్నికల సంఘంలో కూడా మేనేజ్ చేస్తారన్న అపనమ్మకం కలిగిందో ఏమో దాని నిర్ణయం రాకుండానే తన వర్గానికి ఎన్టీయార్‌ తెలుగుదేశం అనే పేరు పెట్టేసుకుని పోటీ చేయడానికి నిశ్చయించుకున్నారు. నిజాం కాలేజీ గ్రౌండ్స్‌లో పెట్టిన సభ (ఫోటో చూడండి) సక్సెస్ కావడంతో ధైర్యం వచ్చింది. ఎన్నికలలో గెలుపే తన సత్తాను చాటుతుందనే పరిపూర్ణ నమ్మకంతో, బాబు చేసిన నమ్మకద్రోహాన్ని ప్రజల దృష్టికి తీసుకుని వెళ్లి తనకు అండగా నిలవమని అడగడానికి ‘జామాతా దశమగ్రహం’ కాసెట్లు తయారు చేయించారు. దగ్గుబాటి తిరిగి రావడంతో ధైర్యం కాస్త పెరిగింది. 1996 ఫిబ్రవరి 12న విజయవాడతో మొదలుపెట్టి, వరంగల్, తిరుపతి యిలా అన్ని జిల్లాలలోనూ సింహగర్జన సభలు పెట్టాలని పథకం వేశారు. తెలుగు విశ్వామిత్ర ఫెయిలైంది కాబట్టి, కొన్ని మార్పులు చేసి హిందీ విశ్వామిత్రను రిలీజ్ చేయడానికి కూడా సన్నాహాలు చేశారు. తనకు మద్దతివ్వమని నేషనల్ ఫ్రంట్‌ నాయకులను కోరారు ఎన్టీయార్. కొద్దిపాటి తర్జనభర్జనల తర్వాత జనతాదళ్ 1996 జనవరి 11న మీకే మద్దతు అంది. కమ్యూనిస్టు పార్టీలు మాత్రం బాబుకి మద్దతివ్వడానికి నిశ్చయించుకున్నాయి.

ఇదీ ఆనాటి పరిస్థితి. ఇక ఆయన మరణించిన దానికి ముందు రోజు ఘటనలు చూద్దాం. జనవరి 17న ఉదయం 10 గంటలకు దేవినేని నెహ్రూ వచ్చి విజయవాడ ఫిబ్రవరి 12 సభకు ఏర్పాట్ల గురించి చర్చించారు. రూ.30 లక్షలు ఖర్చవుతుందనుకున్నారు. టిడిపి బ్యాంక్ ఎక్కవుంటులో రూ.75 లక్షల బేలన్సుంది. పార్టీ చీలిపోయింది కాబట్టి అది ఏ వర్గానికి యివ్వాలో తేలక బ్యాంకింగ్ యాంబుడ్స్‌మన్ దగ్గర పెండింగులో వుంది. యాంబుడ్స్‌మన్ ఆర్కె రాగాల తనకే యిప్పించబోతున్నట్లు  తెలియరావడంతో బ్యాంకు మేనేజర్‌కు ఫోన్ చేసి విత్‌డ్రా చేస్తున్నానని ఎన్టీయార్‌ చెప్పారు. వెంటనే మేనేజరు బాబుకి చెప్పేశారు. బాబు వెంటనే హైకోర్టులో పెండింగులో వున్న రిట్ పిటిషన్‌పై విచారణ చేపట్టమని కోరారు. అప్పటికీ, యిప్పటికీ బాబుకి న్యాయవ్యవస్థ అనుకూలంగానే వుంటూ వచ్చింది. హైకోర్టు వెంటనే జనవరి 25 వరకు స్టే యిచ్చేసింది. ఆ డబ్బు చేతికి రాకుంటే సింహగర్జన సభలు ఎలా? సాయంత్రం 4 గంటలకు యీ వార్త తెలియడంతో ఎన్టీయార్‌కు కోపంతో ఊగిపోయారు. లాయర్లను తిట్టారు. తేరుకోవడానికి రెండు గంటలు పట్టిందట.

ఆ తర్వాత బివి మోహన్‌రెడ్డి వచ్చి కబుర్లు చెప్పడం, టీవీలో ఎల్వీ ప్రసాద్ డాక్యుమెంటరీ చూసి, ఎయన్నార్‌తో ఫోన్ చేసి మాట్లాడడం, డి రామానాయుడు వస్తే మాట్లాడడం జరిగాయి. రాత్రి 10.30 గంటలకు పడుక్కున్నారు. ఆ తర్వాత 3.30 గంటల ప్రాంతంలో పోయి వుంటారని లక్ష్మీపార్వతి కథనం. కాదు, అంతకుముందే పోయి వుంటారు, ఆవిడ డబ్బంతా సూటుకేసుల్లో తరలించిన తర్వాతనే కుటుంబసభ్యులకు చెప్పి వుంటుందని వినికిడి. చనిపోవడానికి కారణమేమిటి? హైకోర్టు యిచ్చిన తీర్పు వలన కలిగిన మనోవేదనే అని లక్ష్మీపార్వతి వర్గీయుల వాదన. అబ్బే కాదు అనడానికి బాబు సమర్థకులు ప్రచారంలో పెట్టిన వదంతులు కొన్ని వున్నాయి. వాటిలో ఒకటి ఎన్నికలలో ఖర్చుకై రామ్‌ విలాస్ పాశ్వాన్ భారీ మొత్తంలో డబ్బు పంపించారట. దాన్ని ఎన్టీయార్‌ బీరువాలో పెట్టి తాళం వేసి, దాన్ని తన రొంటిలో పెట్టుకుని ఎన్టీయార్‌ నిద్రపోయారు. లక్ష్మీపార్వతి, ఆవిడ కొడుకు (కొన్ని వెర్షన్లలో ప్రియుడు) దాన్ని కొట్టేయాలని ప్రయత్నించారు. ఎన్టీయార్‌కు మెలకువ వచ్చి గింజుకున్నారు. ఆ పెనుగులాటలో ఎన్టీయార్‌ కింద పడిపోయి మరణించారు.

ఆ రోజు ఆ గదిలో ఏం జరిగిందో మనకు తెలియదు. కానీ కామన్‌సెన్స్ ఉపయోగించి సాధ్యాసాధ్యాలు ఊహించాలి. ఆ డబ్బు లక్ష్మీపార్వతికి ఎందుకు కావలసి వచ్చింది? రాబోయే నాలుగు నెలల్లో యింకా అనేక మార్గాల ద్వారా నిధులు రావచ్చు కదా! ‘వచ్చిన ఈ డబ్బును మా పిల్లలకు పంపుతాను’ అని ఎన్టీయార్‌ అని వుండరు కదా! దాన్ని ఎన్నికలలో వెచ్చించి, ఓ పదో, పదిహేనో ఎంపీ సీట్లు గెలిస్తే ఎన్టీయార్‌కి మళ్లీ ప్రాముఖ్యత కలిగి, లక్ష్మీపార్వతి అధికారం పెరుగుతుంది కదా! అప్పటికప్పుడు డబ్బు కొట్టేయాల్సిన అవసరం ఏముంది? ఎన్టీయార్‌ మరణం తర్వాత బోల్డు సూటుకేసుల్లో డబ్బు, నగలు తరలించిందని అనేకమంది చెప్పారు. ఆ లెవెల్ ధనరాశులపై అజమాయిషీ వున్న వ్యక్తికి, యీ పాశ్వాన్ డబ్బే కావలసి వచ్చిందా? ఒక వృద్ధుడితో పెనగులాడితే ఆయన ఛస్తే తన గతేమిటనే ఆలోచన ఆవిడకు రాదా? నిజానికి ఎన్టీయార్‌ మరణంతో అత్యధికంగా నష్టపోయినది ఆవిడే, ఎక్కడికో వెళ్లిపోతానని ఆశపడి, రిక్తహస్తాలతో మిగిలింది. ఎన్టీయార్‌ జీవితాన్ని ప్రమాదంలో పడవేసే చర్య ఆవిడెందుకు తలపెడుతుంది? తాళం చెవి లాగబోయినా, మెలకువ రాగానే ఆగిపోయి వుంటుంది.

ఇంకో వదంతి ఏమిటంటే, ఆ రోజు ఏ కారణం చేతనో నిద్రమాత్రలు వేసుకోకపోవడం చేత అనుకోకుండా మధ్యలో మెలకువ వచ్చిన ఎన్టీయార్‌ చూడకూడని దృశ్యం చూశారని, దానితో గుండె పగిలి చచ్చిపోయారని! ఈ కథనాన్ని బాబుకి ఆత్మీయులైన సీనియర్ జర్నలిస్టులు గ్రంథస్తం చేశారు, ఎన్టీయార్‌ కుటుంబీకుల కథనం అంటూ! ఈ చూడరాని దృశ్యమేమిటో ఎవరైనా వూహించగలరు. ప్రపంచంలో అతి చవగ్గా దొరికేదేమిట్రా అంటే స్త్రీ శీలం! కానీ ఆలోచించి చూస్తే ఏ స్త్రీయైనా ఎన్టీయార్‌ వంటి సింహం యింట్లో వుండగా దుకాణం పెట్టగలుగుతుందా?

అసలేం జరిగి వుంటుంది? 72 ఏళ్ల వయసున్న ఎన్టీయార్‌ ఆరోగ్యం అంతంతమాత్రంగా వుంది. ఆయనకు హై బిపి, నియంత్రణలో లేని సుగర్‌లతో బాటు గుండె, మెదడుకి సంబంధించిన వ్యాధులున్నాయి. కొత్త సంసారం కోసం ఉత్ప్రేరకాలు వాడడం వలన కొన్ని సమస్యలు అదనంగా వచ్చి వుంటాయన్న అనుమానాలూ వున్నాయి. పైగా ఆయన మందులు సరిగ్గా వేసుకునేవాడు కాదు, టెస్టులు చేయించుకునేవాడు కాదు. సుగర్‌కు టెస్టెందుకు బ్రదర్? అరచేతిలో ఊదుకుంటే వచ్చే వాసన బట్టి తెలిసిపోతుంది అనేవారట. అలా సుగర్ ఎక్కువుందని తెలియవచ్చు కానీ ఎంత ఎక్కువుందో ఎలా తెలుస్తుంది? సొంతవైద్యం, యింటి చిట్కాలపై ఆయనకు నమ్మకం ఎక్కువ. పైకి దృఢంగా కనబడినా, శరీరం మాత్రం శిథిలమవుతోంది. దానికి తోడు ఆ రోజు నిధులు అందకపోవడమనేది పెద్ద సమస్య మానసికంగా తీవ్రమైన బాధను కలిగించి వుంటుంది.

నిధులు లేకపోతే సభలు లేవు, ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి విరాళాలు పెద్దగా రావు. సభలు జరగకపోతే తన పార్టీకి ఎంపీ సీట్లు తగినంతగా రాకపోతే, మొహం ఎత్తుకోలేని పరిస్థితి. ఎన్నికలు యిప్పట్లో లేకపోతే నిధులు ఆలస్యంగా వచ్చినా ఫర్వాలేక పోను. ఈ బాధ ఆయన్ని తొలిచి వేసి వుంటుంది. గుండెపోటుకి దారి తీసి వుంటుంది. అసలే గుండె వీక్ కాబట్టి కొలాప్స్ అయివుంటుంది. మానసిక ఒత్తిడితో కలిగిన సహజమరణమే అనుకోవాలి. ఆయన యింకో ఆర్నెల్లు బతికి వుండి వుంటే తెలుగు రాజకీయాలు మరోలా వుండివుండేవని అనుకోవచ్చు.

– ఎమ్బీయస్ ప్రసాద్ (జనవరి 2022)

[email protected]