టాలీవుడ్ లో మరోసారి రిలీజ్ డేట్స్ హంగామా

సరిగ్గా సంక్రాంతి ముందు విడుదల తేదీల విషయంలో ఎంత హంగామా నడిచిందో అందరం చూశాం. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి వచ్చింది. వాయిదా పడిన సినిమాలకు సంబంధించి కొత్త విడుదల తేదీలతో ఒకేసారి ప్రేక్షకులముందుకొచ్చారు…

సరిగ్గా సంక్రాంతి ముందు విడుదల తేదీల విషయంలో ఎంత హంగామా నడిచిందో అందరం చూశాం. ఇప్పుడు మరోసారి అలాంటి పరిస్థితి వచ్చింది. వాయిదా పడిన సినిమాలకు సంబంధించి కొత్త విడుదల తేదీలతో ఒకేసారి ప్రేక్షకులముందుకొచ్చారు మేకర్స్. సేమ్ గతంలో చూసినట్టుగానే, ఈసారి కూడా అంతా కలిసి మూకుమ్మడిగా తమ సినిమాల విడుదల తేదీలు ప్రకటిస్తున్నారు.

ప్రభాస్ హీరోగా నటించిన రాధేశ్యామ్ సినిమా సంక్రాంతి బరి నుంచి తప్పుకుంది. ఇప్పుడీ సినిమాను మార్చి 11న విడుదల చేయబోతున్నారు. ఈ మేరకు ఫీలర్ వచ్చింది, అధికారిక సమాచారం మాత్రం రావాల్సి ఉంది. 

ఇక ఇదే నెలలో ఆర్ఆర్ఆర్ కూడా రాబోతోంది. మార్చి 18 లేదా ఏప్రిల్ 28న ఆర్ఆర్ఆర్ ను విడుదల చేస్తామని గతంలో ప్రకటించారు. ఇప్పుడు ఆ రెండు తేదీలు కాకుండా.. మార్చి 25న థియేటర్లలోకి రాబోతున్నట్టు తాజాగా ప్రకటించారు.

ఆర్ఆర్ఆర్ మార్చి 25న వస్తోంది కాబట్టి అనివార్యంగా ఆచార్య మరోసారి వాయిదా పడింది. ఇదే విషయాన్ని కొణెదల ప్రొడక్షన్ కంపెనీ ప్రకటించింది. ఆర్ఆర్ఆర్ మార్చి 25న వస్తోంది కాబట్టి, ఏప్రిల్ 1న రావాల్సిన ఆచార్య సినిమాను మరోసారి వాయిదా వేస్తున్నామని, ఏప్రిల్ 29న థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు.

ఇక ఆర్ఆర్ఆర్, ఆచార్యకు మధ్యలో కేజీఎఫ్2 రాబోతోంది. ఇంతకుముందు చెప్పినట్టుగానే ఏప్రిల్ 14న ఈ సినిమా థియేటర్లలోకి రాబోతోంది.

అయితే ఈ మొత్తం వ్యవహారంలో భీమ్లానాయక్ మరోసారి మిస్సయింది. ఆ సినిమా నిర్మాతలు తేదీ ప్రకటించలేదు కానీ, కుదిరితే ఫిబ్రవరి 25న, కుదరకపోతే ఏప్రిల్ 1న వస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 25 అనేది దాదాపు అసాధ్యంగా కనిపిస్తోంది కాబట్టి.. ఏప్రిల్ 1న భీమ్లానాయక్ రాక పక్కా అని తెలుస్తోంది. 

ప్రస్తుతానికి సర్కారువారి పాట, ఎఫ్3 సినిమాల విడుదల తేదీలు పెండింగ్ లో ఉన్నాయి. మరికాసేపట్లో ఆ తేదీలు కూడా వచ్చేలా ఉన్నాయి.