కర్మ సిద్ధాంతం కళ్లముందు కనిపిస్తోంది. వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేలను, 3 ఎంపీలను తెదేపా గతంలో లాక్కుంటే 2019 ఎన్నికల్లో తెదేపాకి సరిగ్గా అవే మిగిలి, తక్కిన 151 ఎమ్మెల్యే సీట్లు, 22 ఎంపీ స్థానాలు వైసీపీకి వెళ్లిపోయాయి.
అయినా సరే పవరు పోయినా పొగరు తగ్గని తెదేపా తదేకంగా వైసీపీ పాలనపై గురి పెట్టి కుళ్లబొడిచే పని పెట్టుకుంటూనే ఉంది.
అమరావతి రైతులకి మెడలో ఆకుపచ్చ కందువా కప్పి ఉద్యమం చేయించింది.
రాష్ట్రంలో ఏ దళితుడి మీద దాడి జరిగినా దానికి వైసీపీ కారణమని ఎత్తి చూపింది.
దేవాలయాల మీద వరస దాడుల్ని ప్రోత్సహించి వైసీపీ మీద నెట్టే ప్రయత్నం చేసింది.
ఎన్ని చేసినా అమరావతి స్థానిక ఎన్నికల్లో తెదేపాకి పళ్లు రాలిపోయాయి.
తెదేపా ఆశించినట్టు దేవాలయాల విషయంలో మత కలహాలేవీ చోటు చేసుకోలేదు.
అన్ని స్థానిక మరియు బై ఎలక్షన్స్ లోనూ వైసీపీ మునుపటి కంటే పెద్ద విజయం సాధించింది.
అవన్నీ ఒకెత్తైతే కుప్పంలో చంద్రబాబు పార్టీ కుప్ప కూలడం మామూలు విషయం కాదు. ఏం చెయ్యాలో పాలుపోని స్థితి బాబుది.
40 ఏళ్ల చరిత్రని నాలుగేళ్లల్లో చెరిపేసే శక్తి వైసీపీకి కేవలం రాజకీయమొక్కటే ఇవ్వలేదనిపిస్తోంది.
పై విషయాలన్నీ పరిశీలిస్తే ప్రకృతి, దైవం కలిసి ప్రజల్ని తెదేపాకి వ్యతిరేకంగా పగ పట్టి ఉసిగొల్పుతున్నట్టుగా ఉంది.
ఇప్పటికీ ఆ దృష్టాంతాలు ఆగట్లేదు.
జనవరి 14 న గుడివాడలో కొడాలి నాని క్యాసినో ఆడించాడని తెదేపా మీడియా తెలుగు ప్రజలందర్నీ నమ్మించింది. అది స్వయాన తన సొంత కళ్యాణమంటపంలో జరిగిందని టీవీల్లో నానా రభసా చేసింది. జనాన్ని నమ్మించింది.
నిజం చెప్పులేసుకునే లోపు అబద్ధం ఊరంతా తిరిరిగొస్తుందన్నట్టు, “నా కళ్యాణమంటపంలో జరిగలేదు బాబోయ్…” అని కొడాలి నాని మొత్తుకున్నా తెదేపా మీడియా ప్రజల బుర్రలోకి ఎక్కించిన విషం ఆ నిజాన్ని నమ్మనీయలేదు.
అయితే మాత్రమే? ప్రకృతి ఊరుకోదుగా…దాదాపు 20 మంది తెదేపా మనుషులు క్యాసినో పద్ధతిలో భారీగా గ్యాంబ్లింగ్ ఆడుతూ పోలీసులకి రెడ్ హ్యాండెడ్ గా దొరికారు రెండ్రోజుల క్రితం. కేసులు బుక్కయాయి. లక్షల్లో బ్లాక్ మనీ కూడా సీజ్ చేసారు.
ఇది జరగడానికి కాస్త అటు ఇటుగా వినోద్ జైన్ అనే తెదేపా నాయకుడు ఏకంగా ఒక మైనర్ బాలిక ఆత్మహత్యకేసులో నీచమైన క్రిమినల్ గా చట్టానికి చిక్కాడు. ఆ బాలిక రాసిన మూడు పేజీల మరణవాంగ్మూలం తెదేపా పాలిట శాపంలా మారింది.
“నారీ సంకల్ప దీక్ష” పేరుతో తెదేపా నాయకురాళ్లు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్త్రీలకి రక్షణ లేని రాజ్యంగా రాష్ట్రం ఉందని చాటుతూ ఒక కార్యక్రమానికి తెర లేపారు. ఈ నేపథ్యంలో సరిగ్గా బయటపడ్డ వినోద్ జైన్ సంఘటన ఆ దీక్ష మీద చన్నీళ్లు జల్లినట్టయ్యింది. ప్రజలు ఆ దీక్షని సీరియస్ గా తీసుకోక పోగా దీక్ష చేస్తున్నందుకు సీరియస్ అవుతున్నారు.
“ముందు మీ పార్టీలో ఉన్న కామాంధుల్ని చక్కబెట్టుకుని తర్వాత కూర్చోండి దీక్షలో” అని మాటలతోటే మొట్టికాయలు మొడుతున్నారు.
ఆ కామాంధుడిని తెదేపా పార్టీ నుంచి బహిష్కరించడం మాట అటుంచి ఎబీయన్ చానల్లో మెడలో ఆకుపచ్చ కండువా కప్పుకుని కూర్చున్న ఒక అమరావతి రైతు, “వినోద్ జైన్ గారు” అని సంబోధించడం కొసమెరుపు. తెలుగు ప్రజలంతా ఆ కామాంధుడి పేరు ఉచ్చరించడానికే చిరాకు పడుతూ 'రోగ్', “వెధవ”, “కామపిశాచి”, “నికృష్టుడు” అని సంబోధిస్తున్న తరుణంలో ఈ ఆకుపచ్చ పెద్దాయన “..గారు” అని రెండు మూడు సార్లనడం ఎంత అసహ్యంగా ఉందో చెప్పడానికి కష్టం. ఆల్రడీ ఆ వీడియో విపరీతంగా ట్రోలవుతోంది.
మావోడు తప్పు చేసినా “గారే”…ఎగస్పార్టీవాడు తప్పు చేస్తే మాత్రం “వాడు వీడు”. అదీ ఈ తెదేపాలో ఉన్న పసుపుపచ్చ మరియు ఆకుపచ్చ కండువారాయుళ్ల పరిస్థితి.
అలాగే ఈనాడు పేపర్లో కూడా “అపార్ట్ మెంట్ పెద్దమనిషి” అని హెడింగ్ పెట్టారు ఆ కామాంధుడి గురించి రాస్తూ..వాడు “పెద్దమనిషా”? అదే తెదేపాకి సంబంధించని వాడు కాకపోతే మాత్రం “కామాంధుడు”, “కామోన్మాది” అంటూ జబర్దస్త్ హెడింగ్ పెట్టేవాళ్లు రామోజిరావు వెనకున్న పేపరుసైనికులు.
ఇలాంటి వన్ సైడు రాతలతో తెదేపాని భ్రష్టు పట్టించిన మీడియా తెదేపా కన్నుమూసేదాకా కళ్లు తెరవదేమో. ప్రకృతి, ప్రజలు, దైవం పగపట్టి తెదేపాకి గుణపాఠం చెబుతుంటే ఆ పార్టీకి కొమ్ముకాసి పాతాళానికి పోతున్నారు పచ్చమీడియా యజమానులు.
కాలం గడిచే కొద్దీ పతనమే తప్ప తెదేపా కేతనం ఎగిరే ప్రసక్తి లేదు. “రాజకీయాలు ఎప్పుడు మారతాయో తెలీదులేండి” లాంటి రొటీన్ స్టేట్మెంట్లు ఎలా ఉన్నా ఇక్కడ సాధారణ రాజకీయానికి మించింది ఏదో జరుగుతోంది.
పుత్రుడు, పరిస్థితులు, శకునాలు అన్నీ తెదేపా అధినేత అవతార పరిసమాప్తికి సంకేతాలే అని ప్రకృతి పదే పదే చెబుతోంది. అది గ్రహించడం గ్రహించడకపోవడం వేరే విషయం. ఎవరి కర్మ వారిది.
– శ్రీనివాసమూర్తి