తగ్గేదేలే.. సంక్రాంతి బరిలో మరో సినిమా

సంక్రాంతికి 2 పెద్ద సినిమాలొచ్చిన తట్టుకునే సామర్థ్యం బాక్సాఫీస్ కు ఉందనేది టాలీవుడ్ నిర్మాతలు, ట్రేడ్ చెప్పే మాట. ప్రతి ఏటా ఇదే జరుగుతోంది కూడా. మరి ఒకేసారి లెక్కలేనన్ని సినిమాలొస్తే ఏంటి పరిస్థితి?…

సంక్రాంతికి 2 పెద్ద సినిమాలొచ్చిన తట్టుకునే సామర్థ్యం బాక్సాఫీస్ కు ఉందనేది టాలీవుడ్ నిర్మాతలు, ట్రేడ్ చెప్పే మాట. ప్రతి ఏటా ఇదే జరుగుతోంది కూడా. మరి ఒకేసారి లెక్కలేనన్ని సినిమాలొస్తే ఏంటి పరిస్థితి? వచ్చే ఏడాది సంక్రాంతికి ఇదే ప్రమాదం పొంచి ఉంది.

ఇప్పటికే రేసులో మహేష్ బాబు గుంటూరు కారం, తేజ సజ్జ హనుమాన్, నాగార్జున నా సామిరంగ, రవితేజ ఈగల్ సినిమాలున్నాయి. వీటితో పాటు తాజాగా విజయ్ దేవరకొండ కొత్త సినిమాను కూడా సంక్రాంతికే ప్రకటించారు. ఇక వెంకటేష్ చేస్తున్న సైంధవ్ కూడా సంక్రాంతికే అంటున్నారు.

ఓవైపు ఇలా స్ట్రయిట్ సినిమాలు రేసులో ఉన్నప్పటికీ మరోవైపు డబ్బింగ్ సినిమాలు కూడా తగ్గడం లేదు. శివకార్తికేయన్ అయలాన్ సినిమాను సంక్రాంతికే ప్రకటించారు. ఇప్పుడు లిస్ట్ లోకి మరో డబ్బింగ్ బొమ్మ కూడా చేరింది.

రజనీకాంత్ కీలక పాత్రలో తెరకెక్కుతున్న లాల్ సలామ్ సినిమాను కూడా సంక్రాంతికే విడుదల చేయబోతున్నట్టు తాజాగా ప్రకటించారు. ఐశ్వర్య రజనీకాంత్ డైరక్ట్ చేస్తున్న ఈ సినిమాలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలు. మొయిద్దీన్ భాయ్ అనే ఓ కీలక పాత్రలో రజినీకాంత్ కనిపించబోతున్నారు.

ఇప్పుడీ సినిమా రాకతో సంక్రాంతి రద్దీ మరింత పెరిగింది. జనవరి 9 మంగళవారం పడింది కాబట్టి ఆరోజు సినిమా రిలీజులు ఉండవు. కాబట్టి 10వ తేదీ నుంచే అసలైన రిలీజెస్ ఉంటాయి. కొన్ని సినిమాలు 7-8 తేదీలకు కూడా రావొచ్చు. లిస్ట్ లో ఉన్న మరికొన్ని సినిమాలు సంక్రాంతి ముందువారానికి (జనవరి 5) ప్రీ-పోన్ అయ్యే అవకాశం ఉంది.