నారా లోకేశ్ మాటలు కోటలు దాటుతాయి. ఆయన మాత్రం గడప దాటరు. చంద్రబాబు అరెస్ట్ వల్ల టీడీపీకి కలిగిన ప్రయోజనం ఏంటంటే… వారసుడి అవసరాన్ని గుర్తు చేయడం. లోకేశ్‌కు అంత సీన్ లేదని తేలిపోయింది. టీడీపీ జాతీయ అధ్యక్షుడైన చంద్రబాబు జైల్లో వుంటే, ఆ పార్టీలో కీలక స్థానంలో ఉన్న లోకేశ్ శ్రేణుల్ని ముందుకు నడిపించాలి. కానీ ఆయన ఆ బాధ్యతల్ని నిర్వర్తించలేదు. ఢిల్లీకి వెళ్లి సేదతీరుతున్నారు.
వైసీపీకి వార్నింగ్‌లు కొంచెం తగ్గించారే తప్ప, ఆయనలోని కోతల రాయుడు మాత్రం ఊరుకోలేదు. మీడియా ప్రతినిధులతో నిర్వహించిన ఇష్టాగోష్టిలో లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఉగాది నాటికి టీడీపీ కనుమరుగవుతుందనే మంత్రి బొత్స సత్యనారాయణ కామెంట్స్‌పై లోకేశ్ సీరియస్‌గా స్పందించారు. టీడీపీని ఎవరూ అంతం చేయలేరన్నారు. ఇందిరాగాంధీతో పోరాడిన చరిత్ర తమ పార్టీదని ఆయన గొప్పలు చెప్పారు.
ఇందిరాగాంధీ పెట్టిన రాజకీయ భిక్షే తన తండ్రికి ఈనాడు ఈ రాజభోగం అని లోకేశ్ గుర్తించాలి. 1978లో చంద్రగిరి నుంచి ఇందిరా కాంగ్రెస్ తరపున చంద్రబాబు పోటీ చేసి మొట్టమొదటిసారిగా చట్టసభలో అడుగు పెట్టారు. ఆ తర్వాత తనకు పిల్లనిచ్చిన ఎన్టీఆర్ టీడీపీని స్థాపించినప్పటికీ, ఆ పార్టీ భవిష్యత్‌పై నమ్మకం లేకపోవడంతో చంద్రబాబు చేరలేదు. 1983లో మళ్లీ కాంగ్రెస్ తరపునే చంద్రగిరి నుంచి బాబు బరిలో దిగి టీడీపీ అభ్యర్థి వెంకట్రామానాయుడు చేతిలో ఓడిపోయారు. అనంతర కాలంలో బాబు రాజకీయ ప్రస్థానం ఏంటో అందరికీ తెలిసిందే.
ఇందిరాగాంధీతో పోరాడింది ఎన్టీఆర్. బాబుకు అంత సీన్ లేదు. గత సార్వత్రిక ఎన్నికల్లో మోదీతో ఢీకొని చంద్రబాబు రాజకీయంగా చావు దెబ్బ తిన్నారు. అప్పటి నుంచి మోదీకి బాబు దాసోహం అయ్యారు. మోదీ ఎంత అన్యాయం చేసినా నోరెత్తలేని దయనీయ స్థితి. అంతెందుకు… చంద్రబాబుపై కేసు వెనుక బీజేపీ హస్తం వుందని కాంగ్రెస్ నేత రఘువీరారెడ్డి చేసిన విమర్శపై ఇదే ఇష్టాగోష్ఠిలో లోకేశ్ స్పందన చూస్తే, ఎంత పిరికోడో అర్థమవుతుంది. రఘువీరారెడ్డి వద్ద ఆధారాలు వుంటే బయట పెట్టాలని లోకేశ్ సమాధానం ఇచ్చారు.
ఇలాంటి సమాధానం బీజేపీ నేతలు చెబితే సబబుగా వుంటుంది. బీజేపీ గురించి చిన్న విమర్శ చేయడానికి కూడా లోకేశ్, ఇతర టీడీపీ నేతలకు ధైర్యం చాలడం లేదని ఇదే నిదర్శనం. అలాగని లోకేశ్ ప్రగల్భాలు పలకకుండా ఉంటారా? అంటే… అబ్బే అలా వుండరు. కావున లోకేశ్ కోతలు కోయడం మాని, ఆచరణలో ఎంత మేరకు ధైర్యంగా వుంటారో అంత వరకే పరిమితమైతే బాగుంటుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఎన్టీఆర్ నాటి కాలం టీడీపీ కాదని తెలుసుకోవాలి. ఇప్పుడు పిరికి వాళ్లైన చంద్రబాబు, లోకేశ్ సారథ్యంలో టీడీపీ నడుస్తోంది. ఎన్టీఆర్ కాలం నాటికి, నేటికి నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా.