అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు (ఐఆర్ఆర్) వ్యవహారంలో తనను అరెస్ట్ చేస్తారని నారా లోకేశ్ భయపడుతున్నారా? అంటే…ఔననే సమాధానం వస్తోంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోనే మరికొన్నాళ్లు గడపడానికే లోకేశ్ ఆసక్తి చూపుతున్నట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ నెల 29న పునఃప్రారంభించాలని భావించిన యువగళం పాదయాత్రను వాయిదా వేయడానికే లోకేశ్ మొగ్గు చూపుతున్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి.
రెండు రోజుల క్రితం నిర్వహించిన టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో లోకేశ్ తిరిగి పాదయాత్రను ప్రారంభించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి శుక్రవారం రాత్రి 8 గంటల తర్వాత పాదయాత్ర ప్రారంభించేందుకు ముహూర్తం కూడా ఖరారు చేశారు. లోకేశ్ ఒకటి ఆలోచిస్తే, సీఐడీ మరోలా ఆలోచిస్తున్నట్టు టీడీపీ వాపోతోంది.
తనను అరెస్ట్ చేయకుండా బెయిల్ ఇవ్వాలని హైకోర్టును లోకేశ్ ఆశ్రయించారు. లోకేశ్ ముందస్తు బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 29న విచారణ జరగనుంది. న్యాయస్థానంలో బెయిల్‌పై స్పష్టత వచ్చిన తర్వాతే జనంలోకి వెళ్లడం మంచిదనే ఆలోచనలో లోకేశ్ ఉన్నట్టు సమాచారం. అయితే జనంలో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే, మరింత సానుభూతి పొందొచ్చని టీడీపీ ముఖ్య నేతలు సూచించినప్పటికీ, లోకేశ్ అంగీకరించలేదని తెలిసింది.
రాజకీయంగా లాభనష్టాల కంటే, అరెస్ట్ కావడానికి లోకేశ్ ఎంత మాత్రం అంగీకరించలేదని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. తన విషయంలో కేవలం అరెస్ట్ వరకే పరిమితం కారని, మరేదో చేస్తారనే భయం లోకేశ్‌ను వెంటాడుతోంది. ఈ భయం సీఐడీ బాధితుడైన ఒక ఎంపీ వల్ల వచ్చిందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
లోకేశ్ పాదయాత్రను శుక్రవారం ప్రారంభించకపోవచ్చని టీడీపీ నేతలు అంటున్నారు. నంద్యాలలో శుక్రవారం టీడీపీ పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో పాదయాత్రపై తుది నిర్ణయం తీసుకుంటారని సమాచారం. అరెస్ట్ భయంతోనే లోకేశ్ అడుగులు వెనక్కి పడ్డాయనే ప్రచారం జరుగుతోంది.