చంద్రబాబునాయుడికి సంబంధించిన కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఒకవైపు జైలు, కేసుల నుంచి చంద్రబాబు త్వరగా విముక్తి పొందాలని తహతహలాడుతున్నారు. అయితే ఆయన్ను మరింతగా కేసుల్లో ఇరికించేందుకు వైసీపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబునాయుడు, తనకు సానుకూల తీర్పు వస్తుందని ఆశిస్తున్నారు.
అదే జరిగితే, తాను సచ్ఛీలుడిగా జనం ముందుకు రావచ్చని వ్యూహాత్మకంగా కేసు నడుపుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌లో ఇవాళ ఏపీ ప్రభుత్వం ఇన్వాల్వ్ కావడం చర్చనీయాంశమైంది. చంద్రబాబు క్వాష్ పిటిషన్‌కు సంబంధించి తమ వాదనలు కూడా వినాలని వైసీపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో కేవియట్ పిటిషన్ దాఖలు చేసింది. తమ వాదనలు విన్న తర్వాతే బాబు పిటిషన్‌పై నిర్ణయం తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానాన్ని ఏపీ ప్రభుత్వం కోరడం గమనార్హం.
స్కిల్ స్కామ్‌లో చంద్రబాబునాయుడిని ఈ నెల 9న నంద్యాలలో సీఐడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు రాజమండ్రి సెంట్రల్ జైల్లో బాబు రిమాండ్ ఖైదీగా ఉన్నారు. బాబు క్వాష్ పిటిషన్‌ను ఏపీ హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆర్థిక నేరానికి సంబంధించి కేసు విచారణలో ఉండగా క్వాష్ పిటిషన్‌పై బాబుకు సానుకూల తీర్పు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది.
దీంతో వెంటనే విచారించాలంటూ బాబు తరపు న్యాయవాదులు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్‌ను బుధవారం కోరారు. బాబు తరపు న్యాయవాదుల విన్నపాన్ని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ నిరాకరించారు. బాబుకు వెంటనే ఉపశమనం కావాలంటే బెయిల్ పిటిషన్ వేసుకోవచ్చు కదా అని ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించడం తెలిసిందే. ఈ నెల 3న బాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. ఇందులో ఏపీ ప్రభుత్వం తన వాదనలు వినిపించడానికి ముందుకు రావడం గమనార్హం.