స్కిల్ స్కామ్, అలాగే ఫైబర్ నెట్ స్కామ్‌లో లోకేశ్‌ను అరెస్ట్ చేస్తారనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ నేపథ్యంలో గత తొమ్మిది రోజులుగా లోకేశ్ ఢిల్లీలోనే వుండడంతో అరెస్ట్‌కు భయపడి ఏపీకి రాలేదని సొంత పార్టీ నేతలు కూడా చెబుతున్న పరిస్థితి. తన తండ్రిని ఎలాగైనా కేసు నుంచి బయటపడేసేందుకు ఢిల్లీలో అత్యున్నత న్యాయ నిపుణులతో లోకేశ్ చర్చిస్తున్నట్టు టీడీపీ అనుకూల మీడియా ప్రచారం చేస్తోంది.
ఈ నేపథ్యంలో ఇవాళ తన పార్టీ ముఖ్య నేతలతో లోకేశ్ టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అర్థంతరగా ఆగిపోయిన తన పాదయాత్ర గురించి లోకేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ నెల 9న చంద్రబాబును స్కిల్ స్కామ్ కేసులో సీఐడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయానికి లోకేశ్ పాదయాత్ర ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రాజోలు నియోజకవర్గంలోని పొదలాడలో నిలిచిపోయింది.
బాబు అరెస్ట్, అనంతర పరిణామాల నేపథ్యంలో లోకేశ్ తాత్కాలికంగా పాదయాత్రను నిలిపివేశారు. బాబును ఎలాగైనా బయటికి తెచ్చేందుకు టీడీపీ సర్వశక్తులు ఒడ్డుతోంది. దేశంలోనే ప్రముఖ న్యాయవాదులను బరిలో దింపింది. సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది. రెండుమూడు రోజుల్లో బాబుకు సుప్రీంకోర్టులో ఉపశమనం లభించొచ్చని టీడీపీ ఆశాభావంతో వుంది.
ఇదిలా వుండగా లోకేశ్ పాదయాత్రను మొదలు పెట్టే ఆలోచనలో ఉన్నట్టు టీడీపీ నేతలు చెబుతున్నారు. బాబు విషయమై న్యాయపోరాటం సాగుతున్న నేపథ్యంలో యువగళం పాదయాత్రను త్వరలో మొదలు పెడతానని పార్టీ నాయకులకు టెలీకాన్ఫరెన్స్‌లో లోకేశ్ చెప్పినట్టు సమాచారం. జగన్ ప్రభుత్వం కక్షసాధింపు చర్యలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇదే సరైన సమయంగా లోకేశ్ ఆలోచిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నారు.