కలియుగ దైవం శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైన తిరుమలలో ఆదివారం తెల్లవారుజామున విస్తుపోయే ఘటన చోటు చేసుకుంది. శ్రీవారి ధర్మరథం (ఎలక్ట్రికల్ బస్సు)ను దుండగులు చోరీ చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. ప్రస్తుతం తిరుమలలో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జీఎన్‌సీ సమీపంలోని చార్జింగ్ పాయింట్ వద్ద నుంచి తెల్లవారుజామున 3.30 గంటల సమయంలో శ్రీవారి ధర్మ రథాన్ని దుండగులు చాకచక్యంగా కొండ మీద నుంచి కిందికి దించారు.
తిరుమలలో ఉచిత ఎలక్ట్రికల్ బస్సు అదృశ్యం అయిన విషయాన్ని టీటీడీ అధికారులు ఆలస్యంగా గుర్తించారు. ఈ విషయమై 10.30 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ అధికారులు అప్రమత్తమై తిరుపతి, చిత్తూరు జిల్లాల్లోని అన్ని పోలీస్‌స్టేషన్ల అధికారులను అప్రమత్తం చేశారు. ఎలక్ట్రికల్ బస్సు కదలికలపై నిఘా పెట్టాలని కోరారు.
చివరికి తిరుపతి జిల్లా సూళ్లూరుపేట నియోజకవర్గంలోని నాయుడుపేట మండలం బిరదవాడలో ఎలక్ట్రికల్ బస్సును పోలీసులు గుర్తించారు. ఈ బస్సును దుండగులు చెన్నైకి తరలిస్తుండగా అక్కడికి వెళ్లే సరికి బ్యాటరీ చార్జింగ్ అయిపోవడంతో బస్సు ముందుకు కదల్లేదని సమాచారం. బస్సును నాయుడుపేట పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి ఘటన తిరుమలలో ఇదే మొట్టమొదటిది.
బస్సును నడిపే డ్రైవర్ తనను ఎవరూ గుర్తించకుండా ముఖానికి మాస్క్ వేసుకున్నట్టు చెబుతున్నారు. ఆర్టీసీలో పని చేసే సిబ్బందిలోనే కొంత మంది ఈ చోరీకి పాల్పడినట్టు తిరుమల పోలీసులు అనుమానిస్తున్నారు. త్వరలో నిందితులను పట్టుకుంటామని తిరుమల పోలీసులు చెప్పారు.