క‌ర్ణాట‌క‌లో… పొలిటిక‌ల్ ఫ్యామిలీ డ్రామా!

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు కేవ‌లం పొలిటిక‌ల్ హీట్ ను పెంచ‌డ‌మే కాదు, అక్క‌డి రాజ‌కీయాలు ఫ్యామిలీ డ్రామాగా కూడా పండుతూ ఉన్నాయి. దీనికి ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల్లోనూ కుటుంబ రాజ‌కీయం…

క‌ర్ణాట‌క అసెంబ్లీ ఎన్నిక‌లు కేవ‌లం పొలిటిక‌ల్ హీట్ ను పెంచ‌డ‌మే కాదు, అక్క‌డి రాజ‌కీయాలు ఫ్యామిలీ డ్రామాగా కూడా పండుతూ ఉన్నాయి. దీనికి ఒక పార్టీ అని కాదు, అన్ని పార్టీల్లోనూ కుటుంబ రాజ‌కీయం ఆస‌క్తిదాయ‌కంగా సాగుతూ ఉంది. కుటుంబం రాజ‌కీయాల‌కు తాము వ్య‌తిరేకం అని ప్ర‌క‌టించుకునే భార‌తీయ జ‌న‌తా పార్టీ కూడా ఇందుకు మిన‌హాయింపు కాదు. రాజ‌కీయ వార‌స‌త్వాల‌కు తాము వ్య‌తిరేకం అని ప్ర‌క‌టించుకునే బీజేపీ అధిష్టానం.. త‌మ వ‌ర‌కూ వ‌చ్చేస‌రికి య‌డియూర‌ప్ప త‌న‌యుడికి అవ‌కాశం ఇవ్వ‌క‌త‌ప్ప‌లేదు. బీజేపీ తొలి జాబితా రావ‌డానికి ముందే త‌న త‌న‌యుడిని త‌ను ప్ర‌స్తుతం ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నియోజ‌క‌వ‌ర్గం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించుకున్నారు య‌డియూర‌ప్ప‌. త‌న త‌న‌యుడిని గెలిపించాల‌ని పిలుపునిచ్చారు!

మ‌రి భార‌తీయ జ‌న‌తా పార్టీ వాళ్లు కాంగ్రెస్ ను, జేడీఎస్ ను వార‌స‌త్వ రాజ‌కీయ పార్టీలు అంటూ విమ‌ర్శ‌లు చేస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ త‌ర‌ఫున మాత్రం రాజ‌కీయ వార‌సులు పోటీలో ఉండ‌నే ఉన్నారు. ఇలా గురివింద చందంగా మారింది క‌మ‌లం పార్టీ ప‌రిస్థితి.

ఇక కాంగ్రెస్ పార్టీ త‌మ పార్టీ నేత‌ల వార‌సుల‌కు టికెట్లు ఇవ్వ‌డానికి ఏ మాత్రం వేనుకాడ‌లేదు. ప్ర‌స్తుతం ఏఐసీసీ ప్రెసిడెంట్ గా ఉన్న మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే త‌న‌యుడికి కాంగ్రెస్ టికెట్ ద‌క్కింది. ప్ర‌స్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే త‌న‌యుడు ప్రియాంక్ ఖ‌ర్గేకు ఈ ఎన్నిక‌ల్లో విజ‌యం అత్యంత కీల‌కం కూడా! చిత్తాపూర్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి ప్రియాంక్ పోటీలో ఉన్నారు. గ‌త ఎన్నిక‌ల్లో బోటాబోటీ మెజారిటీతో ఆయ‌న నెగ్గారు. ఈ సారి క‌చ్చితంగా విజ‌యం సాధించాల్సిన ప‌రిస్థితుల్లో ఈయ‌న ఉన్నారు. ఒక‌వేళ ప్రియాంక్ ఓడితే మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే పై కూడా తీవ్ర విమ‌ర్శ‌లు త‌ప్ప‌వు. ఏఐసీసీ ప్రెసిడెంట్ త‌న‌యుడు క‌నీసం ఎమ్మెల్యేగా నెగ్గ‌లేదంటే ఆయ‌న పార్టీని దేశ‌మంతా ఏం గెలిపిస్తాడ‌నే విమ‌ర్శ‌లు రానే వ‌స్తాయి. ఇలా మ‌ల్లిఖార్జున ఖ‌ర్గే త‌న‌యుడి విజ‌యం కాంగ్రెస్ కు ప్ర‌తిష్టాత్మ‌కం.

ఇక కాంగ్రెస్ ముఖ్య‌మంత్రి అభ్య‌ర్థుల్లో ఒక‌రు అన‌ద‌గ్గ మాజీ సీఎం సిద్ద‌రామ‌య్య విష‌యంలో కాస్త రివ‌ర్స్ ఫ్యామిలీ డ్రామా న‌డుస్తోంది. సిద్ధ‌రామ‌య్య‌ను ఈ ఎన్నిక‌ల్లో ఓడించ‌డానికి కాంగ్రెస్ వాళ్లే ప్ర‌య‌త్నిస్తార‌ని ఆయ‌న ఫ్యామిలీలో అనుమానాలున్నాయి. ఇలాంటి కుట్ర‌ల‌ను ఎదుర్కొన‌డానికి సిద్ధ‌రామ‌య్య త‌న‌యుడు త్యాగం చేశారు. వారి కుటుంబానికి అత్యంత అనుకూలంగా నిలుస్తూ వ‌స్తున్న వ‌రుణ నియోజ‌క‌వ‌ర్గం నుంచి గ‌త ఎన్నికల్లో సిద్ధరామ‌య్య కుమారుడు గెలిచారు. ఈ సారి ఆ సీటు నుంచి త‌న తండ్రి బ‌రిలో ఉండేలా ఆయ‌న చూసుకున్నారు. వేరే సీటు నుంచి సిద్ధ‌రామ‌య్య పోటీలో ఉంటే ఓట‌మికి ఆస్కారం ఉందేమో అనే అనుమానాల‌తో , అప్పుడు సీఎం సీటు అందే అవ‌కాశం ఉండ‌ద‌ని.. అందుకే వ‌రుణ నుంచి త‌ను పోటీ నుంచి త‌ప్పుకుని త‌న తండ్రికి అవ‌కాశం ద‌క్కేలా చూసుకున్నాడ‌ట సిద్ధ‌రామ‌య్య త‌న‌యుడు! సాధార‌ణంగా రాజ‌కీయాల్లో త‌న‌యుల కోసం తండ్రులు త్యాగం చేస్తూ ఉంటారు. ఇందుకు రివ‌ర్స్ లో సిద్ధరామ‌య్య ఫ్యామిలీ పాలిటిక్స్ న‌డుస్తున్న‌ట్టుగా ఉన్నాయి.

ఇక కుటుంబ పాల‌న‌కు పెట్టింది పేరైన జేడీఎస్ లో కూడా ర‌క‌ర‌కాల రాజ‌కీయం సాగుతూ ఉంది. ఇప్ప‌టికే హెచ్ డీ దేవేగౌడ కుటుంబీకులు జేడీఎస్ ను ఓన్ చేసుకుని, తమ కుల జ‌నాభా గ‌ణ‌నీయంగా ఉన్న చోట అంతా తామే అభ్య‌ర్థుల‌వుతున్నారు. అటు ఇటుగా వీరి కుటుంబం నుంచి ఎనిమిది మంది రాజ‌కీయాల్లో ఉన్నారు! ఏ ఎన్నిక‌లు అయినా వీరి పేర్లు వినిపిస్తూనే ఉంటాయి. వీరు పోటీకి ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉంటారు, పోటికి దిగుతూ ఉంటారు. కొంద‌రు గెలుస్తూ ఉంటారు కూడా! ఈ క్ర‌మంలో హెచ్డీ దేవేగౌడ మ‌న‌వ‌డు నిఖిల్ మ‌రోసారి ఎన్నిక‌ల బ‌రిలో నిలిచాడు. 2019 లోక్ స‌భ ఎన్నిక‌ల్లో మండ్య నుంచి ఎంపీగా బ‌రిలోకి దిగి నిఖిల్ ఓడిపోయాడు. న‌టి సుమ‌ల‌త చేతిలో కుమార‌స్వామి త‌న‌యుడు ఓడిపోయాడు. ఇప్పుడు అత‌డు ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగాడు. బెంగ‌ళూరు కు స‌మీపంలోని రామ‌న‌గ‌ర నుంచి నిఖిల్ ఎమ్మెల్యేగా బ‌రిలోకి దిగాడు. 

ఇందుకోసం అత‌డి త‌ల్లి త్యాగం చేయ‌డం గ‌మ‌నార్హం. ప్ర‌స్తుతం రామ‌న‌గ‌ర నుంచి కుమార‌స్వామి భార్య అనిత సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. త‌న త‌న‌యుడు ఎన్నిక‌ల బ‌రిలోకి దిగ‌డానికి అనుగుణంగా ఆమె రామ‌న‌గ‌ర టికెట్ ను త్యాగం చేసిన‌ట్టుగా ఉన్నారు. మ‌రి తొలి సారి ఎంపీగా బ‌రిలోకి దిగి ఓడిన నిఖిల్ కుమార‌స్వామి, మ‌రి ఎమ్మెల్యేగా అయినా గెలిచి క‌ర్ణాట‌క విధాన‌సౌధ‌లోకి ఎంట‌ర్ కాగ‌ల‌రో లేదో!

ఇంకా బంగార‌ప్ప త‌న‌యులు ఇద్ద‌రు చెరో పార్టీ త‌ర‌ఫున ఒకే నియోజ‌క‌వ‌ర్గంలో బ‌రిలోకి దిగి మ‌రోసారి త‌ల‌ప‌డుతున్నారు! జేడీఎస్ టికెట్ల కోసం దేవేగౌడ కుటుంబీకులు మ‌రింత మంది బ‌రిలోకి దిగే ప్ర‌య‌త్నాలు చేస్తూ ఉన్నారు. ఈ సారితో వారి కుటుంబీకులు మొత్తం  ఎనిమిది మంది ఎన్నిక‌ల బ‌రిలో నిలిచిన‌ట్టుగా కావొచ్చు! ఇలా వార‌స‌త్వాలు, త్యాగాలతో క‌ర్ణాట‌క రాజ‌కీయంలో పొలిటిక‌ల్ ఫ్యామిలీ డ్రామా పండుతోంది.