బుల్లితెర యాంకర్ బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లిన మొదలుకుని, తిరిగి ఎలిమినేట్ అయి బయటికి వచ్చేంత వరకూ మొహంపై నవ్వు చెదరనివ్వలేదు.
అప్పుడప్పుడు భావోద్వేగ సందర్భాల్లో ఆమె కంట కన్నీళ్లు వచ్చాయి. మొత్తానికి పేరుకు తగ్గట్టే ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ బిగ్‌బాస్ రియాల్టీ షోలో 11 వారాల పాటు ఆమె సరదాగా గడిపారు.
సేఫ్ గేమ్ ఆడుతుందని ఎవరెన్ని చెప్పినా, అది తన క్యారెక్టర్ అని లాస్య చిట్ట చివరి రోజు వరకూ ఒకే స్టాండ్‌పై నిలిచారామె.
ఎలిమినేషన్ టైం వచ్చే సరికి చివరికి అల్లరి పిల్ల అరియానా, నవ్వుల రాణి లాస్య మిగిలారు. అరియానా సేవ్ కాగా, లాస్య ఎలిమినేట్ అయ్యారు. అయితే బిగ్‌బాస్ ప్రేక్షకుల అదృష్టం కొద్ది ఏడుపులు, పెడబొబ్బలు లాంటివేవీ లేకుండానే లాస్య ఆ ఇంటి నుంచి బయటికి వచ్చారు.
అనంతరం స్టేజ్‌పై నాగార్జునతో సరదాగా మాట్లాడుతూ ఇంటి సభ్యుల గురించి తన మనసులో మాటను బయట పెట్టారు. టాప్ 2లో సోహైల్, అభిజిత్ ఉంటారని లాస్య చెప్పారు. ఇంటి సభ్యుల్లో ఒక్కొక్కరి గురించి లాస్య చెబుతూ చివరికి అభిజిత్ వద్దకు వచ్చారు.
అప్పుడు లాస్య కళ్లలో, మాటల్లో చెప్పలేని ఆనందం కనిపించింది. బిగ్‌బాస్ హౌస్‌లో తనకు అందరి కంటే అభిజిత్ అంటే ఇష్టమని సంతోషంగా చెప్పారామె. అందుకే బిగ్ బాంబ్ కూడా అతనిపైనే వేసి రియాల్టీ షోలో తన జర్నీని ముగించారు బిగ్‌బాస్ చిన్నక్క లాస్య.