విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం పక్క దోవ పడుతోంది అని ప్రజా సంఘాలు మేధావులు గగ్గోలు పెడుతున్నారు. విశాఖ ఉక్కు ని పరిరక్షిస్తామని పెద్ద మాటలు మట్లాడేవారు అంతా కూడా చివరికి ప్రైవేటుకే రూట్లు వేస్తున్నారు అని అంటున్నారు. సీబీఐలో జేడీగా పనిచేసి మాజీ అయిన వీవీ లక్ష్మీనారాయణ విశాఖ ఉక్కు ఉద్యమం విషయంలో తీసుకుంటున్న నిర్ణయాల మీద పెద్ద విమర్శలు వస్తున్నాయి.
అసలు జేడీ ఎవరిని అడిగి బిడ్ ని దాఖలు చేశారు. అది కూడా పేరూ ఊరూ లేని ఒక డొల్ల కంపెనీ పేరిట వేయాల్సిన అవసరం ఏమొచ్చింది. ఆయన రాజకీయ ప్రయోజనాల కోసం విశాఖ ఉక్కు ఉద్యమాన్ని అడ్డు పెట్టుకుంటున్నారా అన్న ఆరోపణలు వస్తున్నాయి.
విశాఖ ఉక్కు కార్మికులు పాదయాత్ర చేశారు. అందులో పాల్గొన్న జేడీ సంచలన ప్రకటన చేశారు. తాను స్వయంగా బిడ్ ని దాఖలు చేస్తాను ఎ.ఎక్స్ ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ కింద పాల్గొంటాను అని చెప్పారు. తనకు ఉమ్మడి ఏపీ ప్రజలు నాలుగు నెలల పాటు నెలకు వంద వంతున ఇస్తే అది 8.5 కోట్ల రూపాయలు అవుతుందని చెప్పిన జేడీ సొంతంగా బిడ్ దాఖలు చేస్తారు అనుకుంటే విజయవాడకు చెందిన వెంప్రా ఇంపెక్స్ అనే కంపెనీ ద్వారా బిడ్ దాఖలు చేయడమేంటన్న ప్రశ్నలు వస్తున్నాయి.
అసలు ఆ కంపనీకి విశాఖ ఉక్కు ఉద్యమానికి సంబంధం ఏంటి అని కూడా అడుగుతున్నారు. ఇక జేడీ లక్ష్మీనారాయణ బిడ్ దాఖలు చేసినా అదానీ చేసినా తేడా ఏముందని అంటున్నారు. ఇద్దరూ ప్రైవేట్ వ్యక్తులే కదా ఆ మాత్రం దానికి ఎవరు వస్తే ఏంటి ఎవరు చేస్తే ఏంటి అన్న ప్రశ్నలు సంధిస్తున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమంది విశాఖ ఉక్కు ఉద్యమాన్ని వాడుకుంటున్నారు అన్న విమర్శలు కూడా వ్యక్తం అవుతున్నాయి.
నిజమైన లక్ష్యంతో చిత్తశుద్ధితో అంతా కలసి పోరాడాలని కేంద్రం నుంచి తక్షణ సాయం కింద అయిదు వేల కోట్లను విశాఖ స్టీల్ ప్లాంట్ కి ఇప్పించాలని అదే అసలైన ఉద్యమమని అంటున్నారు. బిడ్ ని దాఖలు చేస్తే ప్రైవేటీకరణను సమర్ధించినట్లే అని కూడా అంటున్నారు. ఇంతకీ జేడీ స్టీల్ ప్లాంట్ ఉద్యమాన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు అన్నదే ప్రజా సంఘాల నుంచి సూటిగా వస్తున్న ప్రశ్న.